దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డుల విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది. వినియోగంలో ఉన్న రెండు కోట్ల క్రెడిట్ కార్డుల మైలురాయిని సాధించిన తొలి బ్యాంక్‌గా నిలిచింది. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆర్‌బీఐ డేటా ప్రకారం.. అన్ని బ్యాంకులు మొత్తంగా జారీ చేసిన 9.6 కోట్ల క్రెడిట్ కార్డులలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దాదాపు 21 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇక కార్డు వ్యయాల్లో 2023 మార్చి 31 నాటికి తమ వాటా 28.6 శాతం ఉన్నట్లు బ్యాంక్ తెలిపింది.
లేటుగా ప్రారంభించినా..
క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించిన ప్రధాన బ్యాంకులలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చివరిది కావడం గమనార్హం. ఎస్‌బీఐ తన కార్డ్ వ్యాపారాన్ని 1997లో ప్రారంభించగా ఐసీఐసీఐ బ్యాంక్ 2000లో క్రెడిట్ కార్డులు తీసుకొచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2001లో తన కార్డ్ వ్యాపారాన్ని ప్రారంభించింది.
ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇతర బ్యాంకులు మందగించినప్పటికీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రం ఓ వైపు కస్టమర్లతోపాటు మరోవైపు వ్యాపారులపైనా దృష్టి పెడుతూ స్థిరంగా దాని పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేసుకోగలిగింది. భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వ్యాపారంలో 90లలో సిటీ బ్యాంక్ ఆధిపత్యం ఉండేది. ఆ తర్వాత దేశీయ ప్రైవేట్ బ్యాంకులు విస్తరించడంతో విదేశీ బ్యాంకులు మార్కెట్ వాటాను కోల్పోయాయి.
Comments
Please login to add a commentAdd a comment