
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2020–21) తొలి త్రైమాసిక కాలంలో 20 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ1లో రూ.5,568 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.6,659 కోట్లకు పెరిగిందని బ్యాంక్ తెలిపింది. ఆదాయం రూ.32,362 కోట్ల నుంచి రూ.34,453 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరిన్ని వివరాలు... రుణ నాణ్యత మెరుగుపడింది. స్థూల మొండి బకాయిలు 1.40 శాతం నుంచి 1.36 శాతానికి, నికర మొండి బకాయిలు 0.43 శాతం నుంచి 0.33 శాతానికి తగ్గాయి. కేటాయింపులు రూ.2,614 కోట్ల నుంచి రూ.3,892 కోట్లకు పెరిగాయి. కాగా ఫలితాలపై సానుకూల అంచనాలతో శుక్రవారం ఈ షేర్ ధర బీఎస్‌ఈలో 3% లాభంతో రూ.1,099 వద్ద ముగిసింది.
వారసుడు సొంత సంస్థ నుంచే...
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎమ్‌డీ, సీఈఓ ఆదిత్య పురి త్వరలో రిటైర్‌కాబోతున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లోనే 25 ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తే తన వారసుడయ్యే అవకాశాలున్నాయని ఆదిత్య పురి పేర్కొన్నారు. ఆ వ్యక్తి పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. శశిధర్ జగదీశన్, కైజాద్ బరూచాలు బ్యాంక్ సీఈఓ రేసులో ఉన్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment