దేశీ కరెన్సీకి...‘యువాన్’ కష్టాలు
చైనా కరెన్సీ దెబ్బకి మరింత కనిష్టానికి రూపాయి
32 పైసలు డౌన్; 65.10 వద్ద క్లోజ్
ముంబై : చైనా కరెన్సీ యువాన్ డీవేల్యుయేషన్ ప్రభావాలతో రూపాయి కుదేలవుతోంది. వరుసగా ఏడో సెషన్లోనూ క్షీణించి కీలకమైన 65 మార్కు దిగువకి పడిపోయింది. గురువారం డాలర్‌తో పోలిస్తే దేశీ కరెన్సీ మారకం విలువ 32 పైసలు తగ్గి 65.10 వద్ద ముగిసింది. 2013 సెప్టెంబర్ తర్వాత రూపాయి ఈ స్థాయికి క్షీణించడం ఇదే తొలిసారి. 2013 సెప్టెంబర్ 6న రూపాయి 65.24 వద్ద ముగిసింది. మొత్తం మీద ఏడు సెషన్లలో రూపాయి మారకం విలువ 136 పైసలు (2.13 శాతం) మేర పతనమైంది. డీవేల్యుయేషన్‌తో చైనా కరెన్సీ యువాన్ విలువ మంగళవారం దాదాపు 1.9 శాతం, బుధవారం 1.6 శాతం, గురువారం మరో 1.1 శాతం క్షీణించి ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే 6.4గా ట్రేడవుతోంది.
గురువారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 64.78తో పోలిస్తే కొంత మెరుగ్గా 64.72 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఈక్విటీ మార్కెట్లు కొంత మెరుగుపడి, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడంతో ఒక దశలో 64.63 గరిష్టాన్ని కూడా తాకింది. కానీ, ఆ తర్వాత బ్యాంకులు, దిగుమతి సంస్థల నుంచి కొత్తగా డాలర్లకు డిమాండ్ రావడంతో రూపాయి క్షీణించింది. ఇంట్రాడేలో 64.63-65.23 శ్రేణిలో రూపాయి తిరుగాడింది. డాలర్‌తో పోలిస్తే స్పాట్ మార్కెట్లో రూపాయి ఇక 64.70-65.70 శ్రేణిలో తిరుగాడవచ్చని వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు.
యువాన్ డీవేల్యుయేషన్ ప్రమాదకరం ..
చైనా తమ కరెన్సీ విలువను తగ్గిస్తుండటం చాలా ప్రమాదకరమైన, అనూహ్యమైన పరిణామమని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ ఆదిత్య పురి వ్యాఖ్యానించారు. ఏవైనా తక్షణ దిద్దుబాటు చర్యలు లేకపోతే.. దీనివల్ల ఎగుమతుల్లో చైనాతో పోటీపడే మిగతా దేశాలు కూడా తమ కరెన్సీలను డీవేల్యూ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఆయన చెప్పారు. మరోవైపు, మార్కెట్లు ఇప్పటికే కొంత స్థిరపడ్డాయని, భారతదేశం ఎగుమతులు దెబ్బతినకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని కొటక్ మహీంద్రా బ్యాంక్ చైర్మన్ ఉదయ్ కొటక్ ధీమా వ్యక్తం చేశారు.
వడ్డీ రేట్లు తగ్గితే మంచిది..
ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి పరోక్షంగా పేర్కొన్నారు. అమెరికా, యూరప్ మొదలైన చోట్ల వడ్డీ రేట్లు అంతగా లేకపోవడం, భారత్‌లో అధిక వడ్డీ రేట్లు ఉండటం ఇన్వెస్టర్లు ఇటువైపు ఆకర్షితులవుతున్నారని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.