హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభం రూ.2,696 కోట్లు
రేట్ల కోత స్వల్పమేనంటున్న బ్యాంక్ చైర్‌పర్సన్
న్యూఢిల్లీ/ముంబై : ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు రూ.2,696 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు సాధించిన నికర లాభం(రూ.2,233 కోట్లు)తో పోల్చితే 21 శాతం వృద్ధి సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పేర్కొంది. గత క్యూ1లో రూ.13,071 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 26 శాతం వృద్ధితో రూ.16,503 కోట్లకు పెరిగిందని వివరించింది. నికర వడ్డీ మార్జిన్లు 4.4 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గాయని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం మాత్రం రూ.5,172 కోట్ల నుంచి 24 శాతం వృద్ధితో రూ.6,389 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
ఇతర ఆదాయం(వడ్డీయేతర ఆదాయం) 33 శాతం వృద్ధితో రూ.2,462 కోట్లకు చేరిందని వివరించింది. స్థూల మొండి బకాయిలు 1.07 శాతం నుంచి 0.95 శాతానికి తగ్గగా, నికర మొండి బకాయిలు 0.27 శాతంగా ఉన్నాయని తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు వరుసగా రెండో క్వార్టర్‌లో కూడా పెరిగాయని బ్యాంక్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆదిత్య పురి చెప్పారు. అయితే తమ బ్యాంక్‌పై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు. ఏడాదిచివరి కల్లా వడ్డీరేట్లు 0.75 శాతం మేర తగ్గే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ ఏడాది గరిష్ట స్థాయి(రూ.1,128)ని తాకి 1.5 శాతం నష్టంతో రూ.1,098 వద్ద ముగిసింది.