ఉత్పాదకత ఉంటేనే సూక్ష్మ రుణాలు | HDFC Bank aims to grow share of rural biz to 50% in 5 years | Sakshi
Sakshi News home page

ఉత్పాదకత ఉంటేనే సూక్ష్మ రుణాలు

Published Sat, Oct 5 2013 2:51 AM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM

ఉత్పాదకత ఉంటేనే సూక్ష్మ రుణాలు

ఉత్పాదకత ఉంటేనే సూక్ష్మ రుణాలు

ఆంధ్రప్రదేశ్‌లో మైక్రో ఫైనాన్స్ సంస్థలు రుణాలిచ్చేటప్పుడు ఉత్పాదకతను విస్మరించాయని, వినియోగవస్తువులకు విరివిగా రుణాలివ్వటం వల్లే జనం అప్పుల ఊబిలో కూరుకుపోయారని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్య పురి స్పష్టం చేశారు. ఒక రుణాన్ని తీర్చడానికి మరో రుణం తీసుకోవడం వంటి చర్యల వల్ల వారు రుణ ఊబిలో కూరుకుపోయారని, తాము తొలుత ఉత్పాదకతపై ఒక స్పష్టతకు వచ్చిన తరవాతే వారికి రుణాలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. తమ బ్యాంకు చేపట్టిన సస్టెయినబుల్ లైవ్లీహుడ్ ఇనీషియేటివ్ (ఎస్‌ఎల్‌ఐ) కార్యక్రమం కింద ఇప్పటిదాకా 20 లక్షల మందికి రుణాలిచ్చినట్లు పురి తెలియచేశారు. ఈ సందర్భంగా రాజస్థాన్ రాజధాని జైపూర్ శివారు గ్రామం చోములో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న కోటి కుటుంబాల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టామని పురి చెప్పారు. తమ బ్యాంకుకు చక్కని ఆర్థిక మూలాలతో పాటు మంచి మనసు కూడా ఉందని ఈ కార్యక్రమం నిరూపిస్తుందని చెప్పారు.
 
  గ్రామీణ రుణాలకు సంబంధించి 2003 నుంచి వివిధ ఫార్ములాలను అనుసరిస్తూ... ఒక దశలో బిజినెస్ కరస్పాండెంట్లను కూడా నియమించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు... 2010 నుంచి ఎస్‌ఎల్‌ఐ ద్వారా వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఎస్‌ఎల్‌ఐ కింద గ్రామాలను ఎంపిక చేసుకొని అక్కడ సొంత సిబ్బందిని పంపి, వారి ద్వారా గ్రామస్తులకు ఆర్థిక సూత్రాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమంలో ఒక భాగం. తరువాత వారికి ఏయే అంశాలపై అవగాహన ఉందో తెలుసుకున్నాక, రుణంతో పాటు అవసరాన్ని బట్టి వారికి ఆయా అంశాల్లో ఉచిత శిక్షణ కూడా అందచేస్తారు. స్వయం సహాయక సంఘాలను, జాయింట్ లయబిలిటీ గ్రూపుల్ని ఏర్పాటు చేసి... ఆయా గ్రూపులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారు. తద్వారా వారు తీసుకున్న రుణాన్ని ఉత్పాదకత కోసం ఉపయోగించే వీలుంటుంది. ఇలా చేయటం వల్ల తగిన ఆదాయం వస్తుంది కాబట్టి తిరిగి చెల్లించడానికి వారికెలాంటి ఇబ్బందీ ఉండదని ఆదిత్యపురి చెప్పారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధుల్ని చోము దగ్గరి ఫతేపురా గ్రామానికి తీసుకెళ్లి, అక్కడ మహిళా సంఘాలు పొందుతున్న శిక్షణను, రుణ వితరణ విధానాన్ని చూపించారు. బృందాలతో ప్రత్యక్షంగా మాట్లాడించారు.
 
 రుణం తీసుకోవాలనుకుంటున్న మహిళా గ్రూపుల్ని మొదట తాము ఆర్థిక సూత్రాలపై చైతన్యవంతం చేస్తామని, సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని వాయిదా చెల్లించడంతో పాటు కొంత మొత్తాన్ని ప్రతినెలా రికరింగ్ డిపాజిట్ చేసుకునేలా తామే సేవింగ్స్, ఆర్‌డీ ఖాతాలన్నీ కూడా వారి పేరిట తెరుస్తామని హెచ్‌డీఎఫ్‌సీ ఎస్‌ఎల్‌ఐ విభాగ అధిపతి మనోహర రాజ్ చెప్పారు. దానివల్ల ఆయా మహిళలు కొన్నాళ్లపాటు దాచుకున్నాక అవసరమైన వస్తువులను కొనుక్కునే అవకాశం ఉంటుందని చెప్పారాయన. గ్రామంలో మహిళలతో మాట్లాడినప్పుడు తాము నెలకు రూ.4,000 నుంచి రూ.4,500 వరకు సంపాదిస్తున్నామని, దాన్లో రూ.1,300 వాయిదా చెల్లించడానికి పోగా మిగిలిన దాంట్లో కనీసం నెలకు రూ.1,000 వరకు పొదుపు చేయగలుతున్నట్లు చెప్పారు. తదనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆదిత్య పురి, భారతదేశంలో కార్పొరేట్లు, అధికాదాయం కలిగిన వ్యక్తులను మినహాయిస్తే  గ్రామాల్లో ఉంటూ ఏ రుణం లభ్యమయ్యే అవకాశం లేనివారే ఎక్కువన్నారు. అత్యధిక సంఖ్యలో  ఉన్న ఈ వర్గం కోసమే తాము ఎస్‌ఎల్‌ఐని ఆరంభించామని, వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో ఎస్‌ఎల్‌ఐ కార్యక్రమం కూడా బ్రేక్ ఈవెన్ దశకు చేరుకుంటుందని చెప్పారాయన. ప్రస్తుతం దేశంలోని 24 రాష్ట్రాల్లో 439 క్లస్టర్లలో ఎస్‌ఎల్‌ఐ సేవలు అందుతున్నట్లు చెప్పారు.
 
 20 లక్షలమందికి రుణాలు
 ఇప్పటిదాకా 20 లక్షల మందికి ఎస్‌ఎల్‌ఐ పథకం కింద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రుణాలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా 20 లక్షల ఖాతాదారైన చోము గ్రామానికి చెందిన సజ్నాదేవిని ఆదిత్యపురి, బ్యాంకు సీనియర్ అధికారులు అభినందించారు. తనకు ఇప్పటిదాకా బ్యాంకు అంటే తెలియదని, తొలిసారి తాను ఎస్‌ఎల్‌ఐ పథకం కింద రుణం తీసుకున్నాక దాంతో ఆవుల్ని కొనుగోలు చేశానని, ప్రస్తుతం పొదుపు కూడా చేయగలుగుతున్నానని సజ్నాదేవి చెప్పారు. రుణం తిరిగి చెల్లించడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదని, ఒకవేళ ఆవు మరణించినా దానికి బీమా ఉందని, తన కుటుంబంలోని భార్యాభర్తలిద్దరికీ కూడా బీమా సౌకర్యం కల్పించారని విలేకరులడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారామె.

 జైపూర్ నుంచి మంథా రమణమూర్తి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement