ద్రవ్యోల్బణం పెరుగుతోంది..ఖర్చులూ పెరుగుతున్నాయి..ఇలాంటి సందర్భంలో బ్యాంకులు రుణాలు ఇస్తాయంటే ఎందుకు తీసుకోకుండా ఉంటారు..అయితే వాటిని తిరిగి చెల్లించేపుడు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. దాంతో బ్యాంకుల వద్ద మొండి బకాయిలు పోగవుతున్నాయి. అలా ఒక్క ఐడీబీఐ బ్యాంకు వద్దే ఏకంగా రూ.6,151 కోట్లు పేరుకుపోయాయి. ఆ లోన్లను రికవరీ చేసేందుకు బ్యాంకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఇటీవల ఆ బకాయిలను విక్రయానికి పెట్టింది. వాటిని కొనుగోలు చేసేందుకు ఓంకార అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్‌సీ) గరిష్ఠంగా రూ.652 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తాకథనాలు వెలువడ్డాయి.
వార్తా నివేదికల ప్రకారం..ఐడీబీఐ బ్యాంకు తన వద్ద పోగైన రూ.6,151 కోట్ల మొండి బకాయిలను విక్రయించాలని గతంలోనే నిర్ణయించుకుంది. దాంతో ప్రభుత్వ అధీనంలోని నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌తోపాటు ఇతర కంపెనీలు బిడ్డింగ్ వేశాయి. తాజాగా ఓంకార అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్‌సీ) ఆ మొండి బకాయిలను దక్కించుకునేందుకు గరిష్ఠంగా రూ.652 కోట్లు(మొత్తంలో 10.5 శాతం) ఆఫర్ చేసింది.
బ్యాంకుల్లో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారి సంఖ్య పెరుగుతోంది. వాటిని వసూలు చేసేందుకు ప్రభుత్వం నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఏఆర్‌సీఎల్)ను ప్రతిపాదించింది. ఇది బిడ్డింగ్‌లో తక్కువ ధరకు బ్యాంకుల నుంచి మొండి బకాయిలను దక్కించుకుంటుంది. అనంతరం రుణ గ్రహీతల నుంచి పూర్తి సొమ్మును వసూలు చేస్తోంది. తాజాగా ఎన్‌ఏఆర్‌సీఎల్‌తోపాటు బిడ్డింగ్‌లో పాల్గొన్న ఓంకార ఏఆర్‌సీ అధికమొత్తంలో చెల్లించేందుకు సిద్ధమైంది.
ఇదీ చదవండి: రిటైర్‌మెంట్ ప్రకటించిన గౌతమ్ అదానీ!
ఐడీబీఐ బ్యాంకులో గరిష్ఠంగా ఎల్‌ఐసీకు 49.24 శాతం వాటా ఉంది. వీటిని 26 శాతానికి తగ్గించేందుకు మే 2021లో క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 2022లో ఆసక్తిగల సంస్థలు, వ్యక్తుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు కోరింది. ఇటీవల వెలువడిన రాయిటర్స్ నివేదిక ప్రకారం..ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, ఎమిరేట్స్ ఎన్‌బీడీ, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బిడ్డర్లుగా ఆమోదించింది. ఈ బ్యాంకులో ఎల్‌ఐసీ తర్వాత గరిష్ఠంగా ప్రభుత్వానికి 45 శాతం వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment