న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో పెరిగిపోతున్న మొండిబాకీల సమస్యకి అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలపై దృష్టి సారిస్తోంది. నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసే అవకాశాలు పరిశీలిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), ఐడీబీఐ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఈ విలీనం గానీ సాకారమైన పక్షంలో ఏకంగా రూ. 16.58 లక్షల కోట్ల అసెట్స్‌తో దేశీయంగా రెండో అతి పెద్ద బ్యాంకు ఏర్పాటు కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. బలహీన బ్యాంకులు అనవసర వ్యయాలను తగ్గించుకోవడానికి, నష్టాల్లోని శాఖలను మూసివేయడానికి ఈ విలీనం తోడ్పడగలదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించాయి. ఆయా బ్యాంకుల ఖాతాల్లో పెరిగిపోతున్న మొండిబాకీలను కట్టడి చేసేందుకు కూడా ఇది దోహదపడగలదని ప్రభుత్వం భావిస్తోంది.
మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2017–18)లో ఈ నాలుగు బ్యాంకుల నికర నష్టాలు ఏకంగా రూ. 21,646.38 కోట్ల మేర ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ గ్రూప్‌నకు చెందిన అయిదు అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకును గతేడాది ఏప్రిల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్‌బీఐ) ప్రభుత్వం విలీనం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే కోవలో ఈ నాలుగు బ్యాంకులను కూడా కలపాలన్న ప్రతిపాదనలు పరిశ్రమలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాల విక్రయ యోచన
ఒకవైపు నాలుగు ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై కసరత్తు చేస్తూనే మరోవైపు ఐడీబీఐ బ్యాంకులో 51% వాటాల విక్రయ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. సుమారు రూ. 9,000–10,000 కోట్లకు ఈ వాటాలు కొనుగోలు చేసే వ్యూహాత్మక భాగస్వామి కోసం అన్వేషిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లకు వాటాల విక్రయించే రూపంలో కూడా ఈ డీల్ ఉండొచ్చని పేర్కొన్నాయి.
ఐడీబీఐ బ్యాంకులో వాటాలను 50 శాతం కన్నా దిగువకి తగ్గించుకోవాలని కేంద్రం యోచిస్తోందంటూ 2016 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించడం, ఇటీవల కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ వార్తలకు ఊతమిస్తున్నాయి. బోర్డు సమావేశంలో అదనపు మూలధన సమీకరణకు సంబంధించి ప్రత్యేక తీర్మానాన్ని పరిశీలించనున్నట్లు ఐడీబీఐ బ్యాంకు స్టాక్ ఎక్సే ్చంజీలకు తెలియజేసింది.
అధీకృత మూలధనాన్ని ప్రస్తుతమున్న రూ. 4,500 కోట్ల నుంచి రూ. 8,000 కోట్లకు పెంచుకోవాల్సి ఉంటుందని స్క్రూటినైజర్ ఒక నివేదిక ఇచ్చినట్లు కూడా ఆ తర్వాత పేర్కొంది. అధీకృత మూలధనం పెరిగితే, ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఇన్వెస్టర్లకు 51% లేదా అంతకు మించి వాటాలను విక్రయించడానికి వీలవుతుందనేది పరిశీలకుల అభిప్రాయం. అయితే, ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ వార్తలపై స్పందించడానికి నిరాకరించాయి.
‘ఎన్‌పీఏ’లకు ప్రణాళిక సిద్ధం చేయండి
♦ బ్యాంకులకు పార్లమెంటరీ కమిటీ ఆదేశం
♦ ‘యూపీఏ’ రుణాలపై ఆరా
♦ మొండిబాకీలపైవివరణనిచ్చిన బ్యాంకర్లు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో భారీగా పేరుకుపోతున్న మొండి బాకీలను రాబట్టేందుకు తగిన మార్గదర్శక ప్రణాళికను రూపొందించాలంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు పార్లమెంటరీ కమిటీ ఆదేశించింది. అయితే, కొన్ని సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టినంత మాత్రాన కార్పొరేట్లందరినీ అదే గాటన కట్టరాదని అభిప్రాయపడింది. ఎంపీ వీరప్ప మొయిలీ సారథ్యంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం(ఆర్థిక).. సోమవారం బ్యాంకర్లతో నిర్వహించిన భేటీలో ఈ మేరకు సూచనలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
యూపీఏ ప్రభుత్వాల హయాంలో దూకుడుగా రుణాలిచ్చే ధోరణులే.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబాకీలు భారీగా పెరిగిపోవడానికి దారి తీశాయా అన్న కోణంలో బ్యాంకర్లను కమిటీ సభ్యులు ప్రశ్నించారు. కార్పొరేట్ల మోసాలు, ఎగవేతలతో పెరిగిపోతున్న మొండిబాకీలను భర్తీ చేయడానికి ప్రజాధనాన్ని ఎందుకు ఉపయోగించాల్సి వస్తోందన్నది అర్ధం కాకుండా ఉందంటూ కమిటీలో సభ్యుడైన టీఎంసీ ఎంపీ దినేష్ త్రివేది వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నాయి.
ఎస్‌బీఐ చైర్‌పర్సన్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) డిప్యుటీ చైర్మన్ రజనీష్ కుమార్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఎండీ సునీల్ మెహతా, ఐబీఏ సీనియర్ అడ్వైజర్ అలోక్ గౌతమ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బ్యాంకింగ్ రంగంలో మోసాలు, ఎన్‌పీఏలకు సంబంధించిన వివిధ అంశాల గురించి కమిటీకి వారు వివరించారు.
ఐసీఐసీఐ బ్యాంక్ చందా కొచర్ ప్రస్తావన..
ఐసీఐసీఐ సీఈవో చందా కొచర్‌పై వస్తున్న ఆరోపణలపైనా పార్లమెంటరీ కమిటీలోని కొందరు సభ్యులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కూడా ’ఆశ్రిత పక్షపాతం’ లావాదేవీలు జరుగుతున్నాయన్న కోణంలోనూ ఒక సభ్యుడు ప్రశ్నించారు. వీడియోకాన్‌కు రుణాలివ్వడం ద్వారా తన భర్త దీపక్ కొచర్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా చందా కొచర్ వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment