bank mergers
-
బ్యాంకుల విలీనంతో ఖాతాదారుల పరిస్థితి అంతేనా..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల విలీన పరిణామాలతో కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొత్త మార్పుల కారణంగా గతంలో ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కులు బౌన్సయితే చార్జీల భారం పడటం, డివిడెండ్ చెల్లింపులను సక్రమంగా అందకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద బ్యాంకుల్లో విలీనమైన చిన్న బ్యాంకుల కస్టమర్లే ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాత ఎంఐసీఆర్ చెక్కుల స్థానంలో కొత్త వాటిని జారీ చేసేందుకు, డివిడెండ్లు మొదలైనవి చెల్లించాల్సిన సంస్థలకు కొత్తగా మారిన ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలను అందించేందుకు మరింత సమయం పట్టేయనున్నందున విలీన అమలు ప్రక్రియ డెడ్‌లైన్‌ను మరింతగా పొడిగించాలని కోరుతున్నారు. వాస్తవానికి ఇది మార్చి 31తో ముగిసింది. అకౌంట్ల అనుసంధానంలో సమస్యలు.. ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) నాలుగు పీఎస్బీల్లో విలీనం చేసిన ఉత్తర్వులు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంకుల సిస్టమ్స్ మొదలైన వాటి అనుసంధానం, కొత్త ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టం కోడ్ (ఐఎఫ్ఎస్సీ)ని అమల్లోకి తేవడం వంటి అంశాలకు మార్చి 31 డెడ్‌లైన్‌గా ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, అకౌంట్ల అనుసంధానం మొదలుకుని ఇతరత్రా పలు సమస్యలు ఇంకా ఉంటున్నాయని కస్టమర్లు, పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా పెద్ద బ్యాంకుల్లో విలీనమైన చిన్న బ్యాంకుల కస్టమర్లలో చాలా మందికి ఏవో కంపెనీల్లో షేర్లో లేదా బాండ్లలో పెట్టుబడులో ఉండే అవకాశముంది. వాటి మీద డివిడెండ్లు, ఇతరత్రా చెల్లింపులు మొదలుకుని ఐటీ రీఫండ్లు కూడా రావాల్సి ఉండొచ్చు. అయితే, ఐఎఫ్ఎస్సీ కోడ్ మారిపోవడం తదితర పరిణామాల వల్ల ఇలాంటివి పొందడం సమస్యగా మారే అవకాశం ఉంటోంది. పోనీ అలాగని కొత్త మార్పుల గురించి ఆయా సంస్థలకు తెలియజేయాలన్నా చాలా సమయం పట్టేయొచ్చు. ఈ నేపథ్యంలోనే డెడ్‌లైన్‌ను మూడు నెలల పాటు పొడిగించాలని కస్టమర్లు కోరుతున్నారు. ఇక కొత్త మార్పులకు అలవాటు పడేందుకు కూడా ఖాతాదారులకు ఇబ్బందిగా ఉంటోంది. ఉదాహరణకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో విలీనమైన యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఓ కస్టమరు విషయం తీసుకుంటే.. దాదాపు అన్ని లావాదేవీలకు గతంలో ఈ–యూబీఐ యాప్ ఉపయోగించేవారు. కానీ విలీనం తర్వాత ప్రస్తుతం కొత్త యాప్‌ను వినియోగించడం చాలా మటుకు తగ్గించేశారు. యాప్ చాలా సంక్లిష్టంగానే కాకుండా నెమ్మదిగా లోడ్ అవుతుండటం కూడా ఇందుకు కారణమని వివరించారు. ఇక తండ్రి మరణానంతరం ఆయనకు చెందిన సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంటు నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవడానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయడానికి దాదాపు నెల రోజులు పైగా పట్టేసిందని మరో యూబీఐ ఖాతాదారు వాపోయారు. ఇలాంటి సాంకేతిక సమస్యలతో విలీన బ్యాంకుల కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. విలీనం ఇలా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనమయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను విలీనం చేశారు. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు విలీనమయ్యాయి. చదవండి: రిటైల్ రుణాలు.. రయ్రయ్! -
మరో ‘మెగా’ బ్యాంకింగ్ విలీనం!!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో పెరిగిపోతున్న మొండిబాకీల సమస్యకి అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలపై దృష్టి సారిస్తోంది. నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసే అవకాశాలు పరిశీలిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), ఐడీబీఐ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ విలీనం గానీ సాకారమైన పక్షంలో ఏకంగా రూ. 16.58 లక్షల కోట్ల అసెట్స్‌తో దేశీయంగా రెండో అతి పెద్ద బ్యాంకు ఏర్పాటు కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. బలహీన బ్యాంకులు అనవసర వ్యయాలను తగ్గించుకోవడానికి, నష్టాల్లోని శాఖలను మూసివేయడానికి ఈ విలీనం తోడ్పడగలదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించాయి. ఆయా బ్యాంకుల ఖాతాల్లో పెరిగిపోతున్న మొండిబాకీలను కట్టడి చేసేందుకు కూడా ఇది దోహదపడగలదని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2017–18)లో ఈ నాలుగు బ్యాంకుల నికర నష్టాలు ఏకంగా రూ. 21,646.38 కోట్ల మేర ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ గ్రూప్‌నకు చెందిన అయిదు అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకును గతేడాది ఏప్రిల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) ప్రభుత్వం విలీనం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే కోవలో ఈ నాలుగు బ్యాంకులను కూడా కలపాలన్న ప్రతిపాదనలు పరిశ్రమలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాల విక్రయ యోచన ఒకవైపు నాలుగు ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై కసరత్తు చేస్తూనే మరోవైపు ఐడీబీఐ బ్యాంకులో 51% వాటాల విక్రయ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. సుమారు రూ. 9,000–10,000 కోట్లకు ఈ వాటాలు కొనుగోలు చేసే వ్యూహాత్మక భాగస్వామి కోసం అన్వేషిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లకు వాటాల విక్రయించే రూపంలో కూడా ఈ డీల్ ఉండొచ్చని పేర్కొన్నాయి. ఐడీబీఐ బ్యాంకులో వాటాలను 50 శాతం కన్నా దిగువకి తగ్గించుకోవాలని కేంద్రం యోచిస్తోందంటూ 2016 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించడం, ఇటీవల కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ వార్తలకు ఊతమిస్తున్నాయి. బోర్డు సమావేశంలో అదనపు మూలధన సమీకరణకు సంబంధించి ప్రత్యేక తీర్మానాన్ని పరిశీలించనున్నట్లు ఐడీబీఐ బ్యాంకు స్టాక్ ఎక్సే ్చంజీలకు తెలియజేసింది. అధీకృత మూలధనాన్ని ప్రస్తుతమున్న రూ. 4,500 కోట్ల నుంచి రూ. 8,000 కోట్లకు పెంచుకోవాల్సి ఉంటుందని స్క్రూటినైజర్ ఒక నివేదిక ఇచ్చినట్లు కూడా ఆ తర్వాత పేర్కొంది. అధీకృత మూలధనం పెరిగితే, ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఇన్వెస్టర్లకు 51% లేదా అంతకు మించి వాటాలను విక్రయించడానికి వీలవుతుందనేది పరిశీలకుల అభిప్రాయం. అయితే, ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ వార్తలపై స్పందించడానికి నిరాకరించాయి. ‘ఎన్పీఏ’లకు ప్రణాళిక సిద్ధం చేయండి ♦ బ్యాంకులకు పార్లమెంటరీ కమిటీ ఆదేశం ♦ ‘యూపీఏ’ రుణాలపై ఆరా ♦ మొండిబాకీలపైవివరణనిచ్చిన బ్యాంకర్లు న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థలో భారీగా పేరుకుపోతున్న మొండి బాకీలను రాబట్టేందుకు తగిన మార్గదర్శక ప్రణాళికను రూపొందించాలంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు పార్లమెంటరీ కమిటీ ఆదేశించింది. అయితే, కొన్ని సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టినంత మాత్రాన కార్పొరేట్లందరినీ అదే గాటన కట్టరాదని అభిప్రాయపడింది. ఎంపీ వీరప్ప మొయిలీ సారథ్యంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం(ఆర్థిక).. సోమవారం బ్యాంకర్లతో నిర్వహించిన భేటీలో ఈ మేరకు సూచనలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యూపీఏ ప్రభుత్వాల హయాంలో దూకుడుగా రుణాలిచ్చే ధోరణులే.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబాకీలు భారీగా పెరిగిపోవడానికి దారి తీశాయా అన్న కోణంలో బ్యాంకర్లను కమిటీ సభ్యులు ప్రశ్నించారు. కార్పొరేట్ల మోసాలు, ఎగవేతలతో పెరిగిపోతున్న మొండిబాకీలను భర్తీ చేయడానికి ప్రజాధనాన్ని ఎందుకు ఉపయోగించాల్సి వస్తోందన్నది అర్ధం కాకుండా ఉందంటూ కమిటీలో సభ్యుడైన టీఎంసీ ఎంపీ దినేష్ త్రివేది వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నాయి. ఎస్బీఐ చైర్పర్సన్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) డిప్యుటీ చైర్మన్ రజనీష్ కుమార్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎండీ సునీల్ మెహతా, ఐబీఏ సీనియర్ అడ్వైజర్ అలోక్ గౌతమ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బ్యాంకింగ్ రంగంలో మోసాలు, ఎన్పీఏలకు సంబంధించిన వివిధ అంశాల గురించి కమిటీకి వారు వివరించారు. ఐసీఐసీఐ బ్యాంక్ చందా కొచర్ ప్రస్తావన.. ఐసీఐసీఐ సీఈవో చందా కొచర్‌పై వస్తున్న ఆరోపణలపైనా పార్లమెంటరీ కమిటీలోని కొందరు సభ్యులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కూడా ’ఆశ్రిత పక్షపాతం’ లావాదేవీలు జరుగుతున్నాయన్న కోణంలోనూ ఒక సభ్యుడు ప్రశ్నించారు. వీడియోకాన్‌కు రుణాలివ్వడం ద్వారా తన భర్త దీపక్ కొచర్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా చందా కొచర్ వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
జోరుగా బ్యాంకుల విలీనాలు..
♦ ప్రతిపాదనల పరిశీలనకు ప్రత్యామ్నాయ యంత్రాంగం ♦ కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ: పటిష్టమైన, భారీ బ్యాంకుల ఏర్పాటు దిశగా మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) విలీన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. విలీన ప్రతిపాదనలను పరిశీలించి, సత్వర నిర్ణయాలు తీసుకునేలా ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏఎం ఏర్పాటు యోచన ద్వారా పీఎస్‌బీల విలీనానికి కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసినట్లు ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘పటిష్టమైన, పోటీతత్వంతో కూడిన బ్యాంకుల ఏర్పాటు దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది‘ అని వివరించింది. పీఎస్‌బీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు దిగిన మరుసటి రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఏఎం ఏర్పాటు నిర్ణయాన్ని వివరిస్తూ.. విలీనానికి సంబంధించి ఆయా పీఎస్‌బీల బోర్డుల నుంచి వచ్చే ప్రతిపాదనలను ప్రత్యామ్నాయ యంత్రాంగం పరిశీలిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేకం ఉన్నాయి. పటిష్టమైన బ్యాంకుల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటిదాకా జరిపిన విలీనాల అనుభవం సానుకూలంగానే ఉంది‘ అని ఆయన చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న రుణ అవసరాలు తీర్చేందుకు, నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా పీఎస్‌బీలు సొంతంగా వనరులను సమకూర్చుకునేందుకు కన్సాలిడేషన్ దోహదపడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే విలీనాలపై కొంత పురోగతి ఉండొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవలే ఎస్బీఐలో అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఎస్బీఐ కాకుండా 20 పీఎస్‌బీలు ఉన్నాయి. విలీనాల వార్తలతో పీఎస్‌బీల షేర్లు బుధవారం పెరిగాయి. బీఎస్ఈ బ్యాంకెక్స్ 1.39% లాభంతో 27,455 వద్ద ముగిసింది. వ్యాపారాంశాలే ప్రాతిపదిక.. పటిష్టమైన బ్యాంకుల ఏర్పాటు నిర్ణయానికి వ్యాపారపరమైన అంశాలే పూర్తి ప్రాతిపదికని జైట్లీ చెప్పారు. ఈ విలీనాల ఊతంతో.. మార్కెట్లపరంగా వచ్చే షాకులను తట్టుకుని నిల్చేలా బ్యాంకింగ్ వ్యవస్థ సామర్ధ్యం సంతరించుకోగలదని తెలిపారు. కన్సాలిడేషన్ ప్రతిపాదనలు ఆయా బ్యాంకుల బోర్డుల నుంచే రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. విలీన విధివిధానాల రూపకల్పనకు సూత్రప్రాయ ఆమోదం కోసం బ్యాంకుల నుంచి వచ్చే ప్రతిపాదనలను ఏఎం పరిశీలిస్తుందని జైట్లీ చెప్పారు. పర్యవేక్షణకు మంత్రుల కమిటీ కూడా ఉంటుందని, ఇందులో సభ్యుల ఎంపికపై ప్రధాని తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్ని బ్యాంకుల విలీనాలు ఉండొచ్చన్న విషయంపై ఇదమిత్థంగా ఆయన సంఖ్యేమీ వెల్లడించలేదు. దేశీయంగా బ్యాంకులు కొన్ని ఉన్నా గానీ.. పటిష్టమైనవిగా ఉండాలని 1991లో నరసింహం కమిటీ సిఫార్సు చేసినప్పటికీ.. 2016లో గానీ చర్యలు పూర్తి స్థాయిలో సాకారం కాలేదని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఎస్బీఐలో 6 బ్యాంకుల విలీనం రికార్డు సమయంలో జరిగిందని తెలిపింది. ఉద్యోగాల కోత ఉండదు.. ఈ కన్సాలిడేషన్‌తో ఉద్యోగాల కోత ఉండబోదని ఆర్థిక శాఖ వర్గాలు వివరించాయి. విలీనానంతరం ఉద్యోగుల తొలగింపు వంటి చర్యలేవీ ఉండకుండా ప్రభుత్వం చూస్తుందని పేర్కొన్నాయి. బ్యాంక్ జాతీయీకరణ చట్టానికి లోబడి పీఎస్‌బీల విలీనాలు ఉంటాయని తెలిపాయి. ఏఎం నుంచి సూత్రప్రాయ ఆమోదం వచ్చాక మిగతా నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, షేర్ల బదలాయింపు నిష్పత్తిని నిర్ణయించాల్సి ఉంటుందని వివరించాయి. అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత విలీనానికి క్యాబినెట్ తుది అనుమతి ఇస్తుంది. మరోవైపు, పీఎస్‌బీల విలీన అంశంపై బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా ఉద్యోగులు సహా అన్ని వర్గాలను సంప్రదించాలని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (ఎన్వోబీడబ్ల్యూ) వైస్ ప్రెసిడెంట్ అశ్విని రాణా కోరారు.