జోరుగా బ్యాంకుల విలీనాలు..
♦ ప్రతిపాదనల పరిశీలనకు ప్రత్యామ్నాయ యంత్రాంగం
♦ కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ: పటిష్టమైన, భారీ బ్యాంకుల ఏర్పాటు దిశగా మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) విలీన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. విలీన ప్రతిపాదనలను పరిశీలించి, సత్వర నిర్ణయాలు తీసుకునేలా ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏఎం ఏర్పాటు యోచన ద్వారా పీఎస్‌బీల విలీనానికి కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసినట్లు ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘పటిష్టమైన, పోటీతత్వంతో కూడిన బ్యాంకుల ఏర్పాటు దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది‘ అని వివరించింది.
పీఎస్‌బీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు దిగిన మరుసటి రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఏఎం ఏర్పాటు నిర్ణయాన్ని వివరిస్తూ.. విలీనానికి సంబంధించి ఆయా పీఎస్‌బీల బోర్డుల నుంచి వచ్చే ప్రతిపాదనలను ప్రత్యామ్నాయ యంత్రాంగం పరిశీలిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేకం ఉన్నాయి. పటిష్టమైన బ్యాంకుల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటిదాకా జరిపిన విలీనాల అనుభవం సానుకూలంగానే ఉంది‘ అని ఆయన చెప్పారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న రుణ అవసరాలు తీర్చేందుకు, నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా పీఎస్‌బీలు సొంతంగా వనరులను సమకూర్చుకునేందుకు కన్సాలిడేషన్ దోహదపడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే విలీనాలపై కొంత పురోగతి ఉండొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవలే ఎస్‌బీఐలో అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఎస్‌బీఐ కాకుండా 20 పీఎస్‌బీలు ఉన్నాయి. విలీనాల వార్తలతో పీఎస్‌బీల షేర్లు బుధవారం పెరిగాయి. బీఎస్‌ఈ బ్యాంకెక్స్ 1.39% లాభంతో 27,455 వద్ద ముగిసింది.
వ్యాపారాంశాలే ప్రాతిపదిక..
పటిష్టమైన బ్యాంకుల ఏర్పాటు నిర్ణయానికి వ్యాపారపరమైన అంశాలే పూర్తి ప్రాతిపదికని జైట్లీ చెప్పారు. ఈ విలీనాల ఊతంతో.. మార్కెట్లపరంగా వచ్చే షాకులను తట్టుకుని నిల్చేలా బ్యాంకింగ్ వ్యవస్థ సామర్ధ్యం సంతరించుకోగలదని తెలిపారు. కన్సాలిడేషన్ ప్రతిపాదనలు ఆయా బ్యాంకుల బోర్డుల నుంచే రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. విలీన విధివిధానాల రూపకల్పనకు సూత్రప్రాయ ఆమోదం కోసం బ్యాంకుల నుంచి వచ్చే ప్రతిపాదనలను ఏఎం పరిశీలిస్తుందని జైట్లీ చెప్పారు.
పర్యవేక్షణకు మంత్రుల కమిటీ కూడా ఉంటుందని, ఇందులో సభ్యుల ఎంపికపై ప్రధాని తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్ని బ్యాంకుల విలీనాలు ఉండొచ్చన్న విషయంపై ఇదమిత్థంగా ఆయన సంఖ్యేమీ వెల్లడించలేదు. దేశీయంగా బ్యాంకులు కొన్ని ఉన్నా గానీ.. పటిష్టమైనవిగా ఉండాలని 1991లో నరసింహం కమిటీ సిఫార్సు చేసినప్పటికీ.. 2016లో గానీ చర్యలు పూర్తి స్థాయిలో సాకారం కాలేదని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఎస్‌బీఐలో 6 బ్యాంకుల విలీనం రికార్డు సమయంలో జరిగిందని తెలిపింది.
ఉద్యోగాల కోత ఉండదు..
ఈ కన్సాలిడేషన్‌తో ఉద్యోగాల కోత ఉండబోదని ఆర్థిక శాఖ వర్గాలు వివరించాయి. విలీనానంతరం ఉద్యోగుల తొలగింపు వంటి చర్యలేవీ ఉండకుండా ప్రభుత్వం చూస్తుందని పేర్కొన్నాయి. బ్యాంక్ జాతీయీకరణ చట్టానికి లోబడి పీఎస్‌బీల విలీనాలు ఉంటాయని తెలిపాయి. ఏఎం నుంచి సూత్రప్రాయ ఆమోదం వచ్చాక మిగతా నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, షేర్ల బదలాయింపు నిష్పత్తిని నిర్ణయించాల్సి ఉంటుందని వివరించాయి.
అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత విలీనానికి క్యాబినెట్ తుది అనుమతి ఇస్తుంది. మరోవైపు, పీఎస్‌బీల విలీన అంశంపై బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా ఉద్యోగులు సహా అన్ని వర్గాలను సంప్రదించాలని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (ఎన్‌వోబీడబ్ల్యూ) వైస్ ప్రెసిడెంట్ అశ్విని రాణా కోరారు.