‘యాక్సిస్’కు మొండి బకాయిల దెబ్బ..
• క్యూ2లో లాభం 83% తగ్గుదల
• రూ.319 కోట్లుగా నమోదు
ముంబై: మొండి బకాయిలకు అధిక కేటాయింపులతో యాక్సిక్ బ్యాంకు లాభం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 83 శాతం క్షీణించింది. రూ.319 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసిక కాలంలో బ్యాంకు రూ.1,915 కోట్ల లాభాన్ని ఆర్జించడం గమనార్హం. తాజా త్రైమాసికంలో మొండి బకాయిలకు కేటాయింపులు 5 రెట్లు పెరిగి రూ. 3,623 కోట్లకు చేరడం...బ్యాంకు లాభాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆదాయం మాత్రం గతేడాది ఇదే కాలంలో పోలిస్తే రూ.12,001 కోట్ల నుంచి రూ.13,698 కోట్లకు పెరిగింది. స్థూల ఎన్‌పీఏలు 4.17 శాతం, నికర ఎన్‌పీఏలు 2.02 శాతానికి పెరిగిపోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
నికర వడ్డీ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.4,514 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం రూ.4,062 కోట్లుగా ఉండడం గమనార్హం. నికర వడ్డీ మార్జిన్ మాత్రం 3.64 శాతానికి తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలోనూ బ్యాంకు లాభం 52 శాతం క్షీణించి రూ.1,875 కోట్లకు పరిమితం అయింది. ఈ మేరకు యాక్సిక్ బ్యాంకు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకు ‘వాచ్‌లిస్ట్’లో ఉన్న వసూలు కాని రుణాలు 32 శాతానికి తగ్గాయి. ఇవి రూ.13,789 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు త్రైమాసికంలో వాచ్‌లిస్ట్‌లో వున్న రుణాల్లో రూ. 7,288 కోట్లు ఎన్‌పీఏలుగా మారిపోవడంతో సెప్టెంబర్ త్రైమాసికంలో వాచ్‌లిస్ట్‌లో వున్న రుణాల మొత్తం తగ్గింది.