బ్యాంకులకు ‘ఉక్కు’ సంకెళ్లు..!
♦ ఎన్‌పీఏలుగా మారనున్నమరో రూ. 50 వేల కోట్ల రుణాలు
♦ స్టీల్ రంగానికి ప్రత్యేక ఫండింగ్ ఏజెన్సీ
♦ ఏర్పాటు చేయాలంటున్న బ్యాంకులు
♦ కొత్త రుణాలు ఇవ్వడం సాధ్యం కాదని గగ్గోలు
కొండలా పేరుకుపోతున్న మొండిబకాయిలతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న దేశీ బ్యాంకింగ్ రంగానికి ఇప్పుడు ‘స్టీల్’ భయం పట్టుకుంది. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం, ధర పతనంతో తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన ఇనుము-ఉక్కు రంగ కంపెనీలు బ్యాంకర్లకు దడ పుట్టిస్తున్నాయి. ఎందుకంటే.. రానున్న కాలంలో ఈ రంగానికి ఇచ్చిన రుణాల్లో దాదాపు మరో రూ.50 వేల కోట్ల రుణాలు మొండిబకాయిలు(ఎన్‌పీఏ)లుగా మారనున్నట్లు అంచనా.
ఆర్థిక సంవత్సరం ముగియడంతో భారీగా రుణాలు తీసుకున్న ఉక్కు కంపెనీల నుంచి బకాయిలు వసూలు చేసుకోవడంపై బ్యాంకులు దృష్టిసారిస్తున్నాయి. అవసరమైతే వాటిని డిఫాల్టర్ల జాబితాలో చేర్చేందుకు సైతం సమాయత్తమవుతున్నాయి. దీనివల్ల ప్రొవిజనింగ్ కేటాయింపులు పెరిగిపోయి బ్యాంకుల లాభాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయినప్పటికీ.. ఆర్‌బీఐ, ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు బ్యాంకులు రికవరీ ప్రక్రియను ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోపక్క, తీవ్ర అనిశ్చితిలో ఉన్న స్టీల్ రంగానికి ఇకపై తాము కొత్తగా రుణాలిచ్చే పరిస్థితి లేదని కూడా బ్యాంకర్లు స్పష్టం చేస్తుండటం గమనార్హం.
ఈ త్రైమాసికంలోనే...
స్టీల్ రంగ రుణాలకు సంబంధించి ఎన్‌పీఏలుగా మారనున్న రూ.50 వేల కోట్లను చాలా వరకూ ఈ ఏడాది(2016-17) తొలి త్రైమాసికంలో తమ ఖాతా పుస్తకాల్లో మొండిబకాయిలుగా చూపనున్నాయి. కొన్ని బ్యాంకులు మాత్రం కొన్ని స్టీల్ రుణాలను గతేడాది ఆఖరి త్రైమాసికం(క్యూ4)లోనే ఎన్‌పీఏలుగా పరిగణించినట్లు సమాచారం. భారీ రుణ భారంతో ఇప్పటికే ఉన్న భూషణ్ స్టీల్, ఎస్సార్, విసా స్టీల్, ఎలక్ట్రో స్టీల్ వంటి కొన్ని కంపెనీలతో ఇప్పటికే బ్యాంకర్లు చర్చలు జరిపినట్లు ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఇందులో చాలా వరకూ కంపెనీలకు ఇచ్చిన రుణాలను బ్యాంకులు 5/25 స్కీమ్ కింద పునర్‌వ్యవస్థీకరించడం గమనార్హం.
ఆర్‌బీఐ 2014లో తీసుకొచ్చిన ఈ స్కీమ్ ప్రకారం ఏదైనా కంపెనీకి ఇచ్చిన రుణాలను బ్యాంకులు అవసరమైతే మరో 25 ఏళ్ల వరకూ పొడిగించే అవకాశం ఉంటుంది. అయితే, ప్రతి ఐదేళ్లకోసారి వడ్డీరేట్లను సవరించే షరతు విధిస్తారు. దీనివల్ల రుణ గ్రహీతలకు రీపేమెంట్ సులభం అవడమే కాకుండా చెల్లించాల్సిన కిస్తీ(ఇన్‌స్టాల్‌మెంట్) మొత్తం కూడా తగ్గుతుంది. గతేడాది డిసెంబర్ నాటికి మొత్తం బ్యాంకుల పునర్‌వ్యవస్థీకరణ రుణాల్లో 21 శాతం(దాదాపు రూ.54,051 కోట్లు) ఇనుము-ఉక్కు రంగ కంపెనీలవే. 2015 సెప్టెంబర్ చివరివరకూ చూస్తే స్టీల్ రంగం స్థూల ఎన్‌పీఏలు 8.4 శాతం కాగా, వచ్చే ఏడాది మార్చికల్లా ఇవి 12 శాతానికి ఎగబాకవచ్చని అంచనా. దేశవ్యాప్తంగా ఇప్పుడు అత్యధికంగా రుణభారం ఉన్న రంగం కూడా ఇదే కావడం గమనార్హం.
ప్రత్యేక ఏజెన్సీయే శరణ్యం...
రానున్న కాలంలో తాము ఇక స్టీల్ రంగానికి రుణాలివ్వడం అసాధ్యమని... అందువల్ల ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. విద్యుత్ రంగానికి రుణకల్పన కోసం ఏర్పాటు చేసిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్‌సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్‌ఈసీ) తరహాలో స్టీల్ రంగానికి కూడా ఒక ఫండింగ్ ఏజెన్సీని నెలకొల్పే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని ఎస్‌బీఐ ఎండీ బి. శ్రీరామ్ ఇటీవల ఒక నోట్‌లో అభిప్రాయపడ్డారు.
ఎందుకంటే 2025 నాటికి ఈ రంగం వార్షిక ఉత్పాదక సామర్థ్యం 300 మిలియన్ టన్నులకు చేరాలన్న లక్ష్యం సాకారమవ్వాలంటే.. రూ.10 లక్షల కోట్ల రుణాలు అవసరమవుతాయన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. స్టీల్ రంగాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం కనీస దిగుమతి ధర(ఎంఐపీ), రక్షణాత్మక దిగుమతి సుంకం వంటి చర్యలు తీసుకుంటోందని.. దీనివల్ల పరిశ్రమకు కొంత ప్రయోజనం ఉంటున్నప్పటికీ, ఉక్కు వినియోగ రంగాలైన ఆటోమొబైల్, గృహోపకరణాలు, ఇంజినీరింగ్ కంపెనీల మార్జిన్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు ఎస్‌బీఐ నోట్ ప్రస్తావించింది.
ఇనుము-ఉక్కు రంగం పరిస్థితి ఇదీ
♦ బ్యాంకుల మొత్తం రుణాలు: రూ. 3 లక్షల కోట్లు
♦ మొండిబకాయిలుగా మారిన రుణాల పరిమాణం: 27 శాతం
♦ బ్యాంకుల మొత్తం రుణాల్లో స్టీల్ రంగం వాటా: 4.7 శాతం
♦ మొత్తం ఎన్‌పీఏల్లో దీని వాటా: 6.9%