![Tariffs Coming on Steel and Aluminium Says Donald Trump](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/trumph.jpg.webp?itok=X6KzlSCy)
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. అనేక కీలక ప్రకటనలు చేశారు. ఇప్పుడు తాజాగా దిగుమతి వస్తువులపై.. దిగుమతి సుంకాలను 25 శాతం పెంచనున్నట్లు సమాచారం. అమెరికాలోకి ప్రవేశించే ఉక్కు, అల్యూమినియంపై ట్యాక్స్ పెంపు జరిగితే.. కెనడా, బ్రెజిల్, మెక్సికో, సౌత్ కొరియా, జపాన్ వంటి దేశాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
ఆదివారం న్యూ ఓర్లీన్స్‌లోని ఎయిర్ ఫోర్స్ వన్‌లో మీడియా ముందు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపుకు సంబంధించిన ప్రకటన చేశారు. ఇది ఇంకా అమల్లోకి రాలేదు.. బహుశా ఒకటి లేదా రెండు రోజుల్లో అమలయ్యే అవకాశం ఉంది. ట్రంప్ విధించనున్న పన్ను ఏ దేశాలను లక్ష్యంగా చేసుకుని విధిస్తున్నారు?.. ఏ దేశాలకు మినహాయింపులు ఉంటాయనే విషయం వెల్లడించలేదు.
ట్రంప్ చేసిన ప్రకటన అన్ని దేశాలకు వర్తిస్తే.. ఇండియాపై కూడా ప్రభావం ఉంటుంది. అమెరికాకు ఇనుము & ఉక్కు వస్తువులను ఎగుమతి చేసే అతిపెద్ద దేశాలలో భారతదేశం ఒకటి కాకపోయినా.. సంవత్సరానికి కేవలం మూడు బిలియన్ల డాలర్ల విలువైన ఎగుమతులు మాత్రమే. అయినప్పటికీ కొంత ప్రభావం ఉంటుందని స్పష్టమవుతోంది.
అమెరికా విధానాలను సహరించని.. దేశాల దిగుమతులపై సుంకాలను పెంచనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. చెప్పినట్లుగానే కొన్ని రోజులకు ముందు చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాల దిగుమతులపై సుంకాలను పెంచేశారు. ఎన్నికల సమయంలో కూడా ట్రంప్ ట్యాక్స్ మీద పదేపదే వ్యాఖ్యానించారు. అమెరికా పరిశ్రమలను రక్షించడానికి, వాణిజ్య సమతుల్యతలను మెరుగుపరచడమే తన ఉద్దేశ్యమని, ఈ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెబుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అధిక సుంకాలు ప్రపంచంలోని చాలా దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఇతర ప్రధాన దేశాలు తప్పకుండా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ దూకుడు ప్రపంచ వ్యాపార నాయకుల ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తోంది. అయితే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment