
న్యూఢిల్లీ: ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో (ఎఫ్‌టీఏ) దిగుమతి సుంకాలు, టారిఫ్‌యేతర అంశాల్లాంటి ప్రధాన వాణిజ్య అవరోధాలపై ముందుగా దృష్టి పెడుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్‌వాల్ తెలిపారు.
సాధారణంగా ఇవి ఓ కొలిక్కి వచ్చేసరికే ఎక్కువ సమయం పట్టేస్తుందని, అప్పటికల్లా అందరికీ ఎఫ్‌టీఏలపై ఆసక్తి తగ్గిపోతుందని ఆయన పేర్కొన్నారు. అందుకే టారిఫ్‌లు, టారిఫ్‌యేతర అడ్డంకులు, నియంత్రణ సంస్థలపరమైన సమస్యలు మొదలైన వాటిని ముందుగా పరిష్కరించుకునే విధానం పాటించడం శ్రేయస్కరమని చెప్పారు.
సీఐఐ నిర్వహించిన ఇండియా–ఎల్‌ఏసీ (లాటిన్ అమెరికా–కరీబియన్) బిజినెస్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా సునీల్ ఈ విషయాలు వివరించారు. భారత్ ఇప్పటికే బ్రెజిల్, పరాగ్వే తదితర దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని, ఎల్‌ఏసీ ప్రాంత దేశాలతో కూడా అవరోధాలను అధిగమించే అవకాశాలను పరిశీలిస్తోందని చెప్పారు.
ప్రపంచ దేశాలు రక్షణాత్మక ధోరణులను తగ్గించుకుని వాణిజ్య వృద్ధికి ఊతమివ్వాలని సూచించారు. ఆటోమొబైల్, మెడికల్ డివైజ్‌లు, ఫార్మా తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునేందుకు అవకాశాలు ఉన్నాయని సునీల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment