FTA
-
భారీగా తగ్గనున్న చాక్లెట్లు, వాచీల ధర..! మరిన్నింటిపై ప్రభావం.. కారణం..
యూరప్‌లోని నాలుగు దేశాల కూటమి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంది. దీని ప్రకారం వచ్చే 15 ఏళ్లలో దేశంలోకి రూ.8.3 లక్షల కోట్ల కచ్చిత పెట్టుబడులకూ హామీ లభించింది. తద్వారా పది లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగనుంది. ఈ ఒప్పందంతో ప్రధానంగా స్విస్ వాచీలు, పాలిష్ చేసిన వజ్రాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, గోడ గడియారాల వంటివి ప్రస్తుతం కంటే తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం రానుంది. ఈఎఫ్‌టీఏలో స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లిక్టన్స్టైన్, నార్వే సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇవి ఐరోపా సమాఖ్యలో భాగం కాదు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన సమాఖ్య. కెనడా, చిలీ, చైనా, మెక్సికో, కొరియా వంటి 40 భాగస్వామ్య దేశాలతో ఈఎఫ్టీఏ ఇప్పటివరకు 29 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఎఫ్‌టీఏలో పెట్టుబడుల హామీకీ చట్టబద్దత లభించడం ఇదే తొలిసారి. ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది. ఉపయోగాలివే.. దేశీయంగా తయారవుతున్న ఉత్పత్తులన్నింటినీ, సుంకాలు లేకుండా ఈఎఫ్టీఏ దేశాల్లో విక్రయించుకోవచ్చు. ప్రాసెస్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకూ సుంకాల్లో రాయితీలు లభిస్తాయి. మన ఉత్పత్తులపై ఈ ఏడాది జనవరి నుంచే స్విట్జర్లాండ్ సుంకాలను తొలగించింది. భారత్ కూడా ఈఎఫ్టీఏ ఉత్పత్తుల్లో 95.3 శాతానికి మినహాయింపు ఇస్తోంది. అక్కడ నుంచి బంగారం మనదేశంలోకి అధికంగా దిగుమతి అవుతున్నా, కస్టమ్స్ సుంకం (15%) విషయంలో మినహాయింపు ఇవ్వలేదు. బౌండ్‌రేటు (అత్యంత అనుకూల దేశాలుగా పరిగణించి ఇచ్చేది)ను మాత్రం 1% తగ్గించి, 39%గా ఉంచింది. ఐరోపా సమాఖ్యకు చేరేందుకు భారత కంపెనీలు స్విట్జర్లాండ్‌ను బేస్‌గా వినియోగించుకోవచ్చు. ప్రెసిషన్ ఇంజినీరింగ్, హెల్త్ సైన్సెస్, పునరుత్పాదక ఇంధనం, వినూత్నత-పరిశోధనల్లో సాంకేతిక సహకారం సులువవుతుంది. మారనివి ఇవే.. డెయిరీ, సోయా, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులను మాత్రం మినహాయింపుల జాబితాలో చేర్చలేదు. అందువల్ల వీటికి సుంకాల్లో రాయితీలు అమలు కావు. ఇదీ చదవండి: విద్యుత్ వాహనాలతో వాతావరణ కాలుష్యం..! స్విట్జర్లాండ్ నుంచి భారత్ ఎక్కువగా బంగారం (12.6 బి.డాలర్లు), యంత్రాలు (409 మి.డాలర్లు), ఔషధాలు (309 మి.డాలర్లు), కోకింగ్ అండ్ స్టీమ్ కోల్ (380 మి.డాలర్లు), ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్లు, ఆర్థోపెడిక్ అప్లియెన్సెస్ (296 మి.డాలర్లు), వాచీలు (211.4 మి.డాలర్లు), సోయాబీన్ ఆయిల్ (202 మి.డాలర్లు) చాక్లెట్లు (7 మి.డాలర్లు) తదితర వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. రసాయనాలు, రత్నాభరణాలు, కొన్ని రకాల టెక్స్టైల్స్, దుస్తులను మనదేశం ఎగుమతి చేస్తోంది. -
పన్ను ఎగవేత ఆరోపణలు: శాంసంగ్‌కు షాక్!
సాక్షి,\న్యూఢిల్లీ: దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్ చిక్కుల్లో పడింది. పన్ను ఎగవేత ఆరోపణలతో శాంసంగ్ కార్యాలయాలలో అధికారులు దాడులు నిర్వహించారు. కస్టమ్స్ సుంకం ఎగవేత ఆరోపణలపై ఆధారాలను సేకరించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. కానీ దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయా లేదా అనే దానిపై స్పష్టత లేదు. నెట్ వర్కింగ్ కార్యకలాపాలు నిర్వహించే న్యూఢిల్లీ, ముంబైలోని శాంసంగ్ ఆఫీసులపై డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవలే శాంసంగ్ కంపెనీ నెట్ వర్క్ పరికరాలను అక్రమంగా దిగుమతి దిగుమతి చేసుకుందనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దక్షిణ కొరియాతో పాటు, వియత్నాంలో తయారు చేసిన టెలికం పరికరాలు, ఇతర ఉత్పత్తులపై స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) కింద సంస్థకు కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు ఉంది. అందులో భాగంగా టెలికం సేవలు, నెక్ట్స్ జెన్ వైర్ లెస్ నెట్ వర్క్ ల డెవలప్ మెంట్, ఆధునికీకరణ, విస్తరణ వంటి విషయాల్లో పరస్పర సహకారం కోసం భారత్, దక్షిణ కొరియాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అయితే ఎఫ్‌టిఎయేతర దేశంలో తయారన పరికరాలను దక్షిణ కొరియా లేదా వియత్నాం గుండా తరలించిందనేది ప్రభుత్వానికి అందిన విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో సోదాలు అధికారులు సోదాలు నిర్వహించారు. ఇదే నిజమని తేలితే సరఫరా చేసిన సంబంధిత పరికరాలపై కస్టమ్స్ సుంకం విధించవచ్చు. మరోవైపు డీఆర్ఐఅధికారులు సోదాలపై శాంసంగ్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.వాల్యూమ్ పరంగా దేశంలో అతిపెద్ద 4జీ విక్రయ సంస్థ శాంసంగ్. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ప్రత్యేకమైన 4 జీ పరికరాల ప్రొవైడర్‌గా శాంసంగ్ ఉంది. -
ఈయూతో యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కూటమితో యునైటెడ్ కింగ్డమ్(యూకే) భారీ ఒప్పందం కుదుర్చుకుంది. పోస్ట్–బ్రెగ్జిట్‌స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్‌టీఏ) ఇరు వర్గాలు గురువారం ఖరారు చేసుకున్నాయి. ఇందుకు తుది గడువు డిసెంబర్ 31 కాగా, వారం రోజుల ముందే ఒప్పందం కుదరడం విశేషం. ఇందుకు బెల్జియంలోని బ్రస్సెల్స్ నగరం వేదికగా మారింది. ఇది అతిపెద్ద ద్వైపాక్షిక ఒప్పందమని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఈ అగ్రిమెంట్ పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో బహిర్గతం కానున్నాయి. ఒక స్వతంత్ర వాణిజ్య దేశంగా ఇకపై తమకు ఎన్నో కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇతర భాగస్వామ్య దేశాలతో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి మార్గం సుగమమైందని యూకే అధికార వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. జీరో టారిఫ్‌లు, జీరో కోటాల ఆధారంగా ఈయూతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి. దీంతో ధనం, సరిహద్దులు, చట్టాలు, వాణిజ్యం, సముద్ర జలాలపై తమ ఆధిపత్యం మళ్లీ తిరిగి వస్తుందని తెలిపాయి. ఒక్కమాటలో చెప్పాలంటే 2021 జనవరి 1వ తేదీన తాము పూర్తిగా రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛ పొందుతామని స్పష్టం చేశాయి. ఇదొక పారదర్శక, బాధ్యతాయుతమైన ఒప్పందమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వన్‌డెర్ లెయెన్ అభివర్ణించారు. ఈయూకు యూకే దీర్ఘకాలిక భాగస్వామ్య దేశమని గుర్తుచేశారు. ఈయూ నుంచి విడిపోవడం కొంత బాధాకరమే అయినప్పటికీ, ఇది భవిష్యత్తు వైపు దృష్టి సారించాల్సిన సమయమన్నారు. ప్రధాని బోరిస్ హర్షం పోస్ట్–బ్రెగ్జిట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం పట్ల యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ద డీల్ ఈజ్ డన్’ అంటూ ఒక మెసేజ్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అనంతరం 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని తన నివాసం వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బ్రిటిష్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని చెప్పారు. అతి పెద్ద ఒప్పందాన్ని నేడు ఖరారు చేసుకున్నామని, ప్రజలు కోరుకున్నదే జరిగిందని తెలిపారు. మన ఉత్పత్తులు, వస్తువులను ఇకపై ఈయూ మార్కెట్లలో ఎలాంటి టారిఫ్‌లు, నియంత్రణల భారం లేకుండా విక్రయించుకోవచ్చని అన్నారు. తద్వారా యూకేలో కొత్త ఉద్యోగాలను, గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్లను సృష్టించావచ్చని పేర్కొన్నారు. 1973 తర్వాత తొలిసారిగా మన సముద్ర జలాలపై పూర్తి నియంత్రణతో యూకే ఒక స్వతంత్ర తీరప్రాంతం ఉన్న దేశంగా మారుతుందని తెలిపారు. సముద్ర జలాల్లో చేపల వేటపై యథాతథ స్థితి ఒప్పందం మరో ఐదున్నరేళ్లు మాత్రమే అమల్లో ఉంటుందని, ఆ తర్వాత మన జాలర్లు మన సముద్ర జలాల్లో ఎన్ని చేపలయినా పట్టుకోవచ్చని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. యూకే ఎప్పటికీ యూరప్‌తో సాంస్కృతికంగా, చరిత్రకంగా, వ్యూహాత్మకంగా, భౌగోళికంగా అనుసంధానమైన ఉంటుందని ఉద్ఘాటించారు. బ్రిటిష్ ఎంపీలు డిసెంబర్ 30న సమావేశమై, ఈ ఒప్పందానికి ఆమోదం తెలుపుతారని పేర్కొన్నారు. -
నల్లకుబేరుల జాబితా అందింది!
న్యూఢిల్లీ/బెర్న్: భారతీయ పౌరులు విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి రప్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. తమ బ్యాంకుల్లో భారత పౌరుల ఖాతాల వివరాలతో కూడిన మొట్టమొదటి జాబితాను స్విట్జర్లాండ్ ప్రభుత్వం సోమవారం భారత్‌కు అందజేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని పంచుకునేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టీఏ)తో అంగీకారం కుదుర్చుకున్న 75 దేశాల్లో భారత్ కూడా ఒకటి. రెండో జాబితాను ఒప్పందం ప్రకారం 2020 సెప్టెంబర్‌లో అందజేస్తామని ఎఫ్‌టీఏ అధికారి తెలిపారు. 2018లో కుదిరిన ఆటోమేటిక్ ఎక్సే్ఛంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్(ఏఈఓఐ) ఒప్పందం ప్రకారం ప్రస్తుతం మనుగడలో ఉన్న, 2018లో మూసివేసిన అకౌంట్ల వివరాలు ఇందులో ఉన్నాయి. అయితే, ఎన్ని అకౌంట్లు, ఆ అకౌంట్లలో ఎంతమొత్తం ఆస్తులున్నదీ వెల్లడించేందుకు ఎఫ్‌టీఏ నిరాకరించింది. ఇవి భారతీయ పౌరులుగా గుర్తింపు పొంది, వాణిజ్య, ఇతర అవసరాలకు వాడుతున్న అకౌంట్లు మాత్రమే. ఎఫ్‌టీఏ తెలిపిన వివరాల్లో చాలామటుకు వ్యాపారులతోపాటు, అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆగ్నేయ ఆసియా దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులవేనని పలువురు అధికారులు అంటున్నారు. ఈ సమాచారాన్ని భారత ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచాల్సి ఉంటుందని తెలిపింది. రిటర్నుల దాఖలు సమయంలో పన్ను చెల్లింపుదారులు విదేశాల్లోని తమ ఆర్థిక ఖాతాల వివరాలను సరిగ్గా సమర్పిస్తున్నారా లేదా అనేది దీని ద్వారా రూఢి చేసుకోవచ్చని ఎఫ్‌టీఏ తెలిపింది. ఎఫ్‌టీఏ అందజేసిన సమాచారంలోని.. ఖాతాదారుల డిపాజిట్లు, లావాదేవీలు, సంపాదన, పెట్టుబడులు, తదితర వివరాలుంటాయి. వీటి సాయంతో బయటకు వెల్లడించని ఆస్తులున్న వారిపై చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశముందని నిపుణులు అంటున్నారు. కాగా, నల్లధనం వెలికితీతకు ప్రపంచదేశాలు ప్రయత్నాలు ప్రారంభించడం, స్విట్జర్లాండ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరడంతో దాదాపు 100 మంది భారతీయ కుబేరులు 2018కి ముందే తమ ఖాతాలను రద్దు చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఖాతాదారుల్లో ఎక్కువ మంది వ్యాపారులేనని అంటున్నారు. కేంద్రం ప్రత్యేకంగా ప్రస్తావించిన కొందరి ఖాతాదారుల వివరాలను అందజేసే విషయమై ఆగస్టులో స్విస్ బృందం భారత్‌కు వచ్చి, ఆయా వివరాల గోప్యతకు హామీ పొందింది. ఎఫ్‌టీఏలో భారత్ సభ్యత్వం అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని పంచుకునేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్న 75 దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఎఫ్‌టీఏ కింద 65 సభ్య దేశాలకు చెందిన 31 లక్షల అకౌంట్ల వివరాలను ఇప్పటి వరకు స్విస్ ప్రభుత్వం అందజేసింది. ఆయా దేశాల నుంచి 24 లక్షల మంది ఖాతాదారుల సమాచారాన్ని సేకరించింది. -
ఐఎల్ఎఫ్ఎస్ పరిష్కార ప్రణాళికపై కసరత్తు
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను (ఐఎల్ఎఫ్ఎస్) గాడిన పెట్టే దిశగా కొత్త బోర్డు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పరిష్కార ప్రణాళిక రూపకల్పన, అమలు కోసం మూడు సంస్థలను అడ్వైజర్లుగా నియమించింది. ఆర్ప్‌వుడ్ క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్ సంస్థలను ఆర్థిక అంశాలు.. ఇతరత్రా లావాదేవీల సలహాదారులుగా (ఎఫ్‌టీఏ), అల్వారెజ్ అండ్ మార్సల్ (ఏఅండ్ఎం) సంస్థను పునర్వ్యవస్థీకరణపై అడ్వైజరుగా నియమించినట్లు కంపెనీ తెలిపింది. వివిధ విభాగాల విక్రయం, వేల్యుయేషన్స్ మదింపు తదితర అంశాలపై రెండు ఎఫ్‌టీఏలు పనిచేస్తాయని వివరించింది. మరోవైపు గ్రూప్ కంపెనీల్లో అన్ని స్థాయుల్లో రోజువారీ లిక్విడిటీ పరిస్థితుల నిర్వహణ, నియంత్రణ అంశాలను ఏఅండ్ఎం పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే టర్న్ అరౌండ్ వ్యూహాన్ని రూపొందించే బాధ్యతలను కూడా ఏఅండ్ఎంకు ఐఎల్ఎఫ్ఎస్ అప్పగించింది. దాదాపు రూ.91,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థలు పలు రుణాల చెల్లింపుల్లో డిఫాల్టయ్యాయి. ఈ పరిణామాలు స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేయడం, మరిన్ని ప్రతికూల పరిణామాలను నివారించేందుకు గ్రూప్ అజమాయిషీ బాధ్యతలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడం తెలిసిందే. -
మెడికల్ వీసాల డేటా ఉందా?: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: మెడికల్ వీసా ద్వారా భారత్‌కు వచ్చి వైద్య సేవలు పొందుతున్నవారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. మెడికల్ వీసా ద్వారా విదేశాల నుంచి భారత్‌కు వచ్చి 2016లో 2,01,333మంది వైద్య సేవలు పొందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, 2014, 2015లలో వరుసగా 75,688మంది, 1,34,344మంది వచ్చి వైద్య సేవలు పొందారని తెలిపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వీ విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో విదేశీయులకు ఇచ్చే మెడికల్ వీసాలు, రెండో దశలో భాగంగా ఆయా రాష్ట్రాల తీర ప్రాంతాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతానికి మంజూరు చేసిన పోలీస్ స్టేషన్లు, జెట్టీలపై పర్యాటకశాఖ, కేంద్ర హోంశాఖల నుంచి వివరాలు కోరారు. ఇందులో మెడికల్ వీసాలపై అడిగిన ప్రశ్నకు పర్యాటక మంత్రిత్వశాఖ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. అలాగే, మెడికల్ పర్యాటకాన్ని మరింత పెంపొందించేందుకు మెడికల్ వీసాల అందజేత ప్రక్రియలో వేగాన్ని పెంచినట్లు కూడా పేర్కొంది. వైద్యపరమైన సేవలకోసం విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఈ మెడికల్ వీసా కార్యక్రమాన్ని మరిత విస్తృతం చేస్తున్నామని వెల్లడిచింది. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్, ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సూచించిన విధంగా ఆయా కేసులను బట్టి వీసా గడువు ఆరు నెలల వరకు పొడిగించే అవకాశం ఉందని చెప్పారు. ఎమర్జెన్సీ మెడికల్ వీసాలపై 48గంటల్లో దరఖాస్తును పరిశీలిస్తామని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతంలో పోలీస్ స్టేషన్ల వివరాలపై.. ఫేజ్-2లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతంలో కొత్తగా 15 పోలీస్ స్టేషన్లు మంజూరు చేశామని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఇందులో 11 స్టేషన్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు వెల్లడించింది. అలాగే, ఏడు జెట్టీలను మంజూరు చేశామని వాటిల్లో ఇప్పటి వరకు ఒక్కటీ ఇంకా నిర్మాణం ప్రారంభంకాలేదని తెలిపింది. అలాగే, మత్యకారులు ఉపయోగించే పడవలకు నావిగేషన్, కమ్యునికేషన్ సాంకేతిక పరిజ్ఞానంవంటివి కచ్చితంగా ఉండాలా వద్దా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా కేంద్రం స్పష్టతనిచ్చింది. -
‘అమెరికాకు స్థిర వీసా విధానముండాలి’
న్యూఢిల్లీ: అమెరికా వీసా విధానంలో స్థిరత్వం, పారదర్శకత ఉండాలని భారత్ పేర్కొంది. అలాంటి వాతావరణంలోనే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని తెలిపింది. భారత పర్యటనకొచ్చిన అమెరికా కాంగ్రెస్ సభ్యులతో సోమవారం ఈ విషయాలపై సమగ్రంగా చర్చించినట్లు వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి విడుదల సందర్భంగా ఆమె మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం కుదురుకునే దాకా వేచి చూస్తున్నామని కాంగ్రెస్ సభ్యులు చెప్పినట్లు మంత్రి తెలిపారు. వీసా సంబంధ సమస్యల పరిష్కారంలో రెండు పార్టీలకు చెందిన సభ్యులు కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఈయూ ప్రతినిధులతో జరిగిన సమావేశం గురించి అడిగినపుడు... స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ), ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బీఐటీ)పై వారితో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ రెండు అంశాలపై భారత వైఖరిని వారికి స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఎఫ్‌టీఏపై తదుపరి విడత చర్చలకు ఎలాంటి కాలపరిమితి లేదని, వీలైనంత త్వరగానే ప్రారంభమవుతాయని చెప్పారు. -
డ్వా'మాయ'!
నీటి యాజమాన్య సంస్థలో ఎఫ్టీఏలకు పదోన్నతులు సీనియార్టీ జాబితా విడుదల చేసిన ఎస్ఆర్డీఎస్ గోప్యంగా ఉంచిన అధికారులు అనంతపురం టౌన్ : జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో సిబ్బందికి ఏపీఓలుగా పదోన్నతులు కల్పిస్తూ విడుదలైన సీనియార్టీ జాబితాను వెల్లడించకుండా కొందరు అధికారులు మాయ చేస్తున్నారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో కనీసం జాబితాను ప్రదర్శించిన దాఖలా లేదు. ఎఫ్టీఏలకు ఉద్యోగోన్నతి : ఉపాధి హామీ, సమగ్ర వాటర్‌షెడ్ పథకం కింద జిల్లాలో 560 మంది ఎఫ్‌టీఏ (స్థిరకాల ఉద్యోగులు)లు పని చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లు (సీఓ) 135 మంది, టెక్నికల్ అసిస్టెంట్లు (టీఏ) 284 మంది ఉన్నారు. వీరిలో కొందరికి ఉద్యోగోన్నతి కల్పిస్తూ సీనియార్టీ జాబితాను గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఎస్ఆర్డీఎస్) సెక్రటరీ కె.ప్రభాకర్ చౌదరి విడుదల చేశారు. సీనియార్టీ జాబితాలో ఉన్నది వీరే : – ఏపీఓగా ఉన్న చిన్న మద్దులేటి, సీడీ–సీఎల్ఆర్సీగా ఉన్న టీడీ రామమూర్తి, ప్లాంటేషన్ మేనేజర్‌గా ఉన్న ఎస్.మధుబాబు ఏపీడీ పోస్టుకు అర్హులు. – కంప్యూటర్ ఆపరేటర్లు హరిప్రసాద్, కుమ్మర ఆదెప్ప, పుట్లూరు సుజాత, పి.శివయ్య, సాకే నారాయణస్వామి, నాగేశ్వరయ్య, లలితదేవి, టీఏలుగా ఉన్న మాదెప్ప, శ్రీనివాసులు ఏపీఓ పోస్టుకు అర్హులు. – కంప్యూటర్ ఆపరేటర్ వేణుగోపాల్ హెచ్ఆర్ మేనేజర్ పోస్టుకు, మేనేజర్ డీబీటీ పోస్టుకు అర్హుడు. – అడిషనల్ డీఆర్పీ పోస్టుకు కంప్యూటర్ ఆపరేటర్లు రహంతుల్లా, అనిల్‌కుమార్, రామచంద్రారావు, టెక్నికల్ అసిస్టెంట్లు అమ్రేశ్, వేణుగోపాల్‌రెడ్డి õఅర్హులు. – సీడీ–సీఎల్ఆర్సీ పోస్టుకు టెక్నికల్ అసిస్టెంట్ మాదెప్ప, ఈసీ పోస్టుకు జేఈ మధుసూదన్‌రెడ్డి అర్హులు. – టెక్నికల్ అసిస్టెంట్లు రవీంద్రనాథ్, వెంకటేశ్వర్లు, చక్రపాణి శ్రీధర్, జితేంద్ర, నాగముణి కుమార్, హెచ్ఎన్ సుధాకర్, లక్ష్మినారాయణమ్మ, సురేశ్‌బాబు, అరుణ, దామోదరప్రసాద్, రాజు, దినేశ్, నారాయణస్వామి, గీత, బీబీ హజారా, నాగవేణిలు జేఈగా పదోన్నతులకు అర్హులు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ : సీనియార్టీ జాబితాను గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన హెచ్ఆర్ఎంఎస్ (హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం) వెబ్‌సైట్‌లోని వివరాల ఆధారంగా రూపొందించారు. వాస్తవానికి డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్సే కాకుండా వారి పనితీరును కూడా పరిగణలోకి తీసుకోవాలి. గతంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా? కేసులేమైనా ఉన్నాయా? పెనాల్టీ విధించారా? దిగమింగిన సొమ్మును రికవరీ చేశారా? అన్న వివరాలు పొందుపరచాలి. కానీ ఇలాంటి వివరాలేవీ ప్రస్తుత జాబితాలో లేవు. జాబితాను ప్రదర్శిస్తే ఇతరుల నుంచి అభ్యంతరాలు వస్తాయన్న కారణంగానే అంతా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. -
ఎగుమతుల్లో వెనుకబడ్డ ఏపీ: ఫియో
ఎఫ్‌టీఏను ఉపయోగించుకోవడం లేదు సాక్షి, అమరావతి: వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్ని (ఎఫ్‌టీఏ)లను వినియోగించుకోవడంలో మన ఎగుమతిదారులు వెనుకబడిపోతున్నారని, ఇప్పటివరకు ఇండియా 27 దేశాలతో ఎఫ్‌టీఏ ఒప్పందాలను కుదుర్చుకుంటే.. ఈ దేశాలకు జరుగుతున్న వాటా 22 శాతం కూడా లేదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స(ఫియో) తెలిపింది. సోమవారం షార్జాకి చెందిన సైఫ్ జోన్ సంస్థ ఏర్పాటు చేసిన రోడ్‌షోలో ఫియో దక్షిణ విభాగం డెరైక్టర్జనరల్ ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ సముద్ర ఉత్పత్తులు, టెక్స్టైల్, గ్రానేట్, వ్యవసాయ వంటి ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఎగుమతుల్లో బాగా వెనుకబడి ఉందన్నారు. 2015-16 ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 2%(సుమారు రూ.36,500 కోట్లు) మాత్రమేనన్నారు. చిన్న ఎగుమతిదారులకు షార్జా ఇంటర్నేషనల్ ఫ్రీ జోన్ (సైఫ్ జోన్) ముఖద్వారంగా ఉంటుందని, దీన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. సైఫ్ జోన్ డెరైక్టర్ సాద్ అల్ మజౌరీ మాట్లాడుతూ తమ జోన్ నుంచి ఎగుమతి చేస్తే పన్నుల భారం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ చాంబర్స్ ప్రధాన కార్యదర్శి పొట్లూరి భాస్కర రావు మాట్లాడుతూ వ్యవసాయం, మెరైన్ ఉత్పత్తులకు ఏపీ నాయకత్వం వహించనుందన్నారు. -
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతోలాభమెంత..?
కేంద్రం ఉన్నత స్థాయి సమావేశం న్యూఢిల్లీ: వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల(ఎఫ్‌టీఏ) వల్ల భారత్‌కన్నా ఇతర దేశాలకే ఎక్కువ లాభం జరుగుతోందన్న వార్తల నేపథ్యంలో మంగళవారం కేంద్రం దీనిపై ఒక అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ, ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణ్యం, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, వాణిజ్య కార్యదర్శి రీటా తియోటియా తదితర ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం భారత్ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పనలకు సంబంధించి ఎఫ్‌టీఏల ప్రభావంపై సమగ్రంగా చర్చించింది. మరిన్ని వివరాలు చూస్తే... ⇒ ఎఫ్‌టీఏల పనితీరుపై సీఈఏ అరవింద్ సుబ్రమణ్యం ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ⇒ ఎఫ్‌టీఏలపై సమీక్ష నిరంతర ప్రక్రియలో ఒకటని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఎగుమతుల వృద్ధికి సంబంధించి రూపాయి విలువ తగ్గింపు అంశంపై ఏదైనా చర్చ జరిగిందా అన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ, ‘అలాంటి ప్రతిపాదనే లేదు. నేను దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు’ అని అన్నారు. ⇒ ఉపాధి అవకాశాలపై ఎఫ్‌టీఏల ప్రభావంపై సంబంధిత పారిశ్రామిక వర్గాల అభిప్రాయాలను తీసుకోవాలని సమావేశం నిర్ణయించినట్లు సమాచారం. ⇒ ఎగుమతుల వృద్ధి క్షీణ ధోరణిపై ఆందోళనగా ఉన్న వాణిజ్య మంత్రిత్వశాఖ దీని నిరోధానికి త్రిముఖ వ్యూహం అవలంబించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో ఒకటి అత్యుత్తమ ఎక్స్ఛేంజ్ రేటు రూపకల్పన. రెండు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రవాణా రేట్లలో సవరణలు, వీసా వ్యవస్థ సరళీకరణ మూడవది. -
పన్ను సమాచార మార్పిడికి భారత్ ఓకే
బీజింగ్: ఇతర దేశాలతో పన్ను సంబంధిత అంశాల సమాచార మార్పిడి కోసం భారత్.. ‘మల్టీలేటరల్ కాంపిటెంట్ అథారిటీ అగ్రిమెంట్’పై సంతకం చేసింది. చైనా, ఇజ్రాయెల్, కెనడా, ఐలాండ్, న్యూజిలాండ్ దేశాలు కూడా ఒప్పందంపై సంతకాలు చేసినవాటిలో ఉన్నాయి. ఇక్కడ జరుగుతోన్న పదవ ఫోరమ్ ఆన్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టీఏ) సదస్సులో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ ఒప్పందంలో భాగస్వాములైన దేశాలు వాటి వాటి పన్ను నివేదికలను పరస్పరం ఒకదానితో మరొకటి మార్చుకోవచ్చని ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (ఓఈసీడీ) తెలిపింది. ఆయా దేశాలు పన్ను వ్యవస్థ మెరుగుదలకు పర స్పరం సహకరించుకోవచ్చని పేర్కొంది. -
ఇద్దరు నల్ల కుబేరుల పేర్లు వెల్లడి
బెర్న్: స్నేహలత సాహ్ని, సంగీత సాహ్ని.. ఈ ఇద్దరు మహిళలకు స్విస్ బ్యాంక్‌లో అకౌంట్లున్నాయి. అయితే వీరి పుట్టిన తేదీ వివరాలు మినహా, మరే వివరాలను స్విట్జర్లాండ్ వెల్లడించలేదు. నల్ల కుబేరుల పేర్ల వెల్లడిలో భాగంగా స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టీఏ) ఈ రెండు పేర్లను బయటపెట్టింది. అయితే వారి వివరాలను భారత ప్రభుత్వానికి వెల్లడించకూడదనుకుంటే, 30 రోజుల్లోగా ఫెడరల్ అడ్మినిస్ట్రేషన్ కోర్టుకు వీరు అప్పీల్ చేసుకోవచ్చని ఎఫ్‌టీఏ తెలిపింది. వీరిరువురి పేర్లతో పాటు బ్రిటిష్, స్పెయిన్, రష్యాలకు చెందిన నల్ల కుబేరుల పేర్లను ఎఫ్‌టీఏ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్‌లకు చెందిన వారి ఇనిషియెల్స్ మాత్రమే వెల్లండించింది కానీ పూర్తి వివరాలను బయటపెట్టలేదు. మొత్తం మీద 40 మంది వివరాలను స్విస్ ఫెడరల్ గెజిట్‌లో ప్రచురించారు. భవిష్యత్తులో మరింత మంది వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. -
2016 నాటికి ఎఫ్‌టీఏపై చర్చలు పూర్తి
న్యూఢిల్లీ: సమగ్ర ఆర్థిక సహకారానికి ఉద్దేశించి భారత్‌తో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై చర్చలు 2016 నాటికల్లా ఒక కొలిక్కి రాగలవని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడులను పెంచుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. భారత పర్యటనలో భాగంగా పరిశ్రమ ప్రముఖులతో జరిగిన విందు సమావేశంలో అబాట్ ఈ విషయాలు తెలిపారు. 2012-13లో ద్వైపాక్షిక వాణిజ్యం 15 బిలియన్ డాలర్ల స్థాయిలో జరిగింది. వర్ధమాన ప్రజాస్వామ్య సూపర్‌పవర్‌గా ఎదుగుతున్న భారత్‌ని అలక్ష్యం చేయరాదని, ఇక్కడ పెట్టుబడులు మరింత పెంచుకోవాలని అబాట్ ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలకు సూచించారు. అటు అదానీ మైనింగ్ తమ దేశంలో తలపెట్టిన ప్రాజెక్టును పరోక్షంగా ప్రస్తావిస్తూ.. అంతా సవ్యంగా సాగితే వచ్చే ఏడాదికల్లా ఇది ప్రారంభం కావొచ్చన్నారు. ఆస్ట్రేలియన్ బొగ్గు ఊతంతో వచ్చే అర్ధశతాబ్దం పాటు 10 కోట్ల పైచిలుకు భారతీయులకు విద్యుత్ వెలుగులు ఇవ్వడానికి సాధ్యపడుతుందని చెప్పారు. మరోవైపు, ఆస్ట్రేలియా సంస్థలు చేసుకున్న మైనింగ్ లీజు దరఖాస్తులకు అనుమతుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేస్తామని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. -
ఎఫ్‌టీఏలు, సెజ్‌లపై సర్కారు సమీక్ష
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి చెన్నై: దేశంలోని ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు), ఇతర దేశాలతో కుదుర్చుకున్న విదేశీ వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) భారతీయులకు ఏమాత్రం లబ్ధి చేకూర్చాయన్న అంశాన్ని ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘అన్ని ఎఫ్టీఏలనూ విశ్లేషించి, అవి ప్రయోజనకరమైనవో కావో తేల్చి, వాటికి చేయాల్సిన సవరణలను నిర్ణయించాల్సిందిగా నా శాఖ అధికారులను ఆదేశించాను. సెజ్‌లు ఎందుకు సత్ఫలితాలను ఇవ్వలేకపోయాయో పూర్తిస్థాయిలో సమీక్షించాలని చెప్పాను...’ అని ఆమె శనివారం చెన్నైలో మీడియాకు తెలిపారు. ఎఫ్‌టీఏలు, సెజ్‌లకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నిటినీ పునఃసమీక్షించడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టంచేశారు. కొత్త కంపెనీల చట్టంలోని కొన్ని అధికరణలపై వ్యాపారులు, స్టేక్హోల్డర్లు ఆందోళన వెలిబుచ్చారనీ, వీటిపై వచ్చే శనివారం న్యూఢిల్లీలో చర్చిస్తామనీ చెప్పారు. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రస్తుత తరుణంలో సబబు కాదని అన్నారు.