ఎఫ్‌టీఏలు, సెజ్‌లపై సర్కారు సమీక్ష
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
చెన్నై: దేశంలోని ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు), ఇతర దేశాలతో కుదుర్చుకున్న విదేశీ వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) భారతీయులకు ఏమాత్రం లబ్ధి చేకూర్చాయన్న అంశాన్ని ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘అన్ని ఎఫ్‌టీఏలనూ విశ్లేషించి, అవి ప్రయోజనకరమైనవో కావో తేల్చి, వాటికి చేయాల్సిన సవరణలను నిర్ణయించాల్సిందిగా నా శాఖ అధికారులను ఆదేశించాను.
సెజ్‌లు ఎందుకు సత్ఫలితాలను ఇవ్వలేకపోయాయో పూర్తిస్థాయిలో సమీక్షించాలని చెప్పాను...’ అని ఆమె శనివారం చెన్నైలో మీడియాకు తెలిపారు. ఎఫ్‌టీఏలు, సెజ్‌లకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నిటినీ పునఃసమీక్షించడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టంచేశారు. కొత్త కంపెనీల చట్టంలోని కొన్ని అధికరణలపై వ్యాపారులు, స్టేక్‌హోల్డర్లు ఆందోళన వెలిబుచ్చారనీ, వీటిపై వచ్చే శనివారం న్యూఢిల్లీలో చర్చిస్తామనీ చెప్పారు. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రస్తుత తరుణంలో సబబు కాదని అన్నారు.