Companies Act
-
కట్టుతప్పితే కఠిన చర్యలే ఇక!
న్యూఢిల్లీ: కార్పొరేట్ పరిపాలనా ప్రమాణాలను పటిష్టపరచడం, రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడం, దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం వంటి లక్ష్యాలుగా కేంద్రం రూపొందించిన కంపెనీల చట్టం సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. వర్షకాల సమావేశాల్లో ఇదే బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించినందున చట్టరూపం దాల్చనుంది. గత యూపీఏ సర్కారు తీసుకొచ్చిన కంపెనీల చట్టం, 2013లో మోదీ సర్కారు దాదాపు 40కు పైగా సవరణలను ప్రతిపాదించింది. ఇదే చట్టంలో మోదీ సర్కారు లోగడ కూడా ఓ సారి సవరణలు చేయడం గమనార్హం. బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి సమాధానం ఇచ్చారు. తాజా సవరణలతో దేశంలో కార్పొరేట్ పరిపాలన మెరుగ్గా మారుతుందని, వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. ప్రక్రియలు, నిబంధనల అమలు సులభంగా మారుతుందన్నారు. కంపెనీలు తమ లాభాల్లోంచి నిర్ణీత మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించాలన్న నిబంధనలు (సీఎస్ఆర్) పాటించని కంపెనీలకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినట్లు చెప్పారు. -
డిస్కౌంట్లు కేక.. కారు చౌక
కార్ల కంపెనీలు.. డీలర్లు అందిస్తున్న డిస్కౌంట్లు, ఆఫర్లు కేక పుట్టిస్తున్నాయి. కొత్త ఏడాది కొత్త మోడల్ కొనుక్కోవచ్చంటూ కొనుగోలుదారులు ఈ నెలలో కార్ల కొనుగోళ్లను వాయిదా వేస్తారు. వారిని ఆకర్షించడం, సంవత్సరాంత నిల్వలను తగ్గించుకోవడం లక్ష్యాలుగా కార్ల కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. వీటితో పాటు ఉచిత బీమా, ఎక్సే్ఛంజ్ బోనస్‌లు, తక్కువ వడ్డీరేట్లకే రుణాలు, యాక్సెసరీలు ఉచితంగా అందించడం, వార్షిక మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో కూడా డిస్కౌంట్లనివ్వడం, బంగారు నాణేలు, హాలిడే ట్రిప్‌లు ఆఫర్ చేయడం, ఉచిత ఈఎంఐ వంటి ఆఫర్లను డీలర్లు అందిస్తున్నారు. కొన్ని కంపెనీలు ‘ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి’ అంటూ ఆకర్షణీయమైన ఆఫర్లు తెచ్చాయి. ప్రాంతాన్ని బట్టి, డీలర్‌ను బట్టి డిస్కౌంట్లు, ఆఫర్లు మారుతుంటాయి. మీకు కనుక బేరమాడే శక్తి బాగా ఉంటే మరింతగా డిస్కౌంట్లు, ఆఫర్లు పొందే అవకాశాలూ ఉన్నాయి. ఏతావాతా రూ.25,000 నుంచి రూ.8.85 లక్షల రేంజ్లో డిస్కౌంట్లను కార్ల కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ డిస్కౌంట్లు, ఆఫర్లపై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... టాటా మోటార్స్ తగ్గింపు రూ.1.87 లక్షల వరకూ టాటా మోటార్స్ కంపెనీ రూ.26,000–రూ.1.87 లక్షల వరకూ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. టియాగో, హెక్సాలపై రూ.78,000 వరకూ తగ్గింపులు ఇస్తోంది. మరోవైపు రూ. ఒక్క రూపాయి డౌన్ పేమెంట్‌గా చెల్లించి టాటా కార్లను సొంతం చేసుకునే ఆకర్షణీయ స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది. టాటా ఇండిగో ఈ–సీఎస్ మోడల్‌పై రూ.1.87 లక్షల వరకూ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుండటంతో ఈ కారు ధర రూ.3,15,000కు తగ్గింది. కొనుగోలుదారుడు ఎవరైనా పేటీఎమ్ ద్వారా చెల్లింపులు జరిపితే అదనంగా మరో రూ.10,000 తగ్గింపు లభిస్తుంది. అంటే ఈ కారు రూ.3.05 లక్షలకే లభిస్తుంది. మారుతీ డిస్కౌంట్ రూ.90,000 వరకూ.. భారత్‌లో అతి పెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ, తన మోడళ్లపై భారీగానే డిస్కౌంట్లను, ఆఫర్లను అందిస్తోంది. ఆల్టో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, సియాజ్, సెలెరియో, ఇగ్నిస్, ఎర్టిగ తదితర మోడళ్లపై ఆ కంపెనీ పెద్ద స్థాయిలోనే డిస్కౌంట్లనందిస్తోంది. స్విఫ్ట్‌పై రూ.35,000 వరకూ, సియాజ్ డీజిల్ మోడళ్లపై రూ.90,000 వరకూ డిస్కౌంట్లను అఫర్ చేస్తోంది. అయితే బాగా అమ్ముడయ్యే బాలెనో, బ్రెజా, డిజైర్ వంటి మోడళ్లపై ఈ కంపెనీ ఎలాంటి డిస్కౌంట్లను ఇవ్వడం లేదు. హ్యుందాయ్ డిసెంబర్ డిలైట్.. కొరియా కంపెనీ హ్యుం దాయ్ ఏకంగా డిస్కౌంట్ల కోసమే ప్రత్యేకంగా డిసెంబర్ డిలైట్ పేరుతో ఒక స్కీమ్‌నే ప్రకటించింది. బాగా అమ్ముడయ్యే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్.. క్రెటాకు మినహా దాదాపు అన్ని మోడళ్లపై ఈ కంపెనీ డిస్కౌంట్లనందిస్తోంది. గ్రాండ్ ఐ10పై రూ.90,000 వరకూ, ఇలీట్ ఐ20పై రూ.55,000 వరకూ డిస్కౌంట్లనందిస్తోంది. అన్ని వేరియంట్లపై రూ.10,000 విలువైన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తోంది. హోండా కార్స్.. ఉచితంగా ఏడాది బీమా హోండా కార్స్ ఇం డియా.. సిటీ కారు కొనుగోలు చేస్తే, ఏడాది బీమాను ఉచితంగా అందిస్తోంది. సీఆర్–వీ మోడల్‌పై లక్షన్నర వరకూ డిస్కౌంట్‌నిస్తోంది. ఇక జాజ్ కారు కొంటే రూ.30,000 తగ్గింపు లభిస్తుంది. ఏడాది బీమా కూడా ఉచితంగా అందుతుంది. ఒక్క డబ్ల్యూఆర్వీ మోడల్‌పై మాత్రం ఎలాంటి తగ్గింపులు లేవు. ఫోక్స్‌వ్యాగన్ రాయితీ రూ.1.1 లక్షల వరకూ జర్మనీ కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ రూ.1.1 లక్షల వరకూ డిస్కౌంట్నందిస్తోంది. పోలో కారు కొనుగోలు చేస్తే నగదు డిస్కౌంట్‌తో పాటు, ఎక్సే్చంజ్ బోనస్ కూడా కలుపుకొని రూ.60,000 వరకూ తగ్గింపు లభిస్తుంది. వెంటో మోడల్‌కు అయితే రూ.90,000 నగదు డిస్కౌంట్‌ను అందిస్తోంది. తక్కువ రేటుకే రెనో రుణాలు.. ఫ్రెంచ్ కార్ల కంపెనీ రెనో రూ.10,000 విలువైన ఉచిత యాక్సెసరీలు అందిస్తోంది. క్విడ్ కార్ల కొనుగోళ్ల కోసం 7.99 శాతానికే రుణాలందిస్తోంది. డస్టర్ ఏఎమ్టీపై రూ.90,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఏడాదిపాటు ఉచిత బీమాను అందిస్తోంది. ఆడి తగ్గింపులు రూ.3లక్షలు –8.85 లక్షల రేంజ్లో.. జర్మనీ లగ్జరీ కంపెనీ ఆడి కూడా తగ్గింపుల విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ కంపెనీ ఏ3, ఏ4, ఏ6, క్యూ3 మోడళ్ల ధరలను రూ.3 లక్షల నుంచి రూ.8.85 లక్షల రేంజ్లో తగ్గించింది. ఆడి రష్ పేరుతో ఒక కొత్త ఆకర్షణీయమైన స్కీమ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆడి కార్లను ఈ నెలలో కొనుగోలు చేసి 2019 నుంచి ఈఎమ్ఐలు చెల్లించేలా ఈ స్కీమ్‌ను డిజైన్ చేసింది. ఆడి కంపెనీ లాగానే స్కోడా ఇండియా కూడా ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి పేరుతో ఒక ఆకర్షణీయమైన స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది. కొంత డౌన్ పేమెంట్ చెల్లించి కారును కొనుగోలు చేసిన ఏడాది తర్వాత ఈఎంఐలు చెల్లించే వెసులుబాటు ఈ స్కీమ్ ఇస్తోంది. -
2 లక్షల పైన కంపెనీలపై ప్రభుత్వం వేటు
సాక్షి, న్యూఢిల్లీ : షెల్ కంపెనీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. 2.09 లక్షలకు పైగా సంస్థలను ప్రభుత్వం డీరిజిస్టర్ చేసింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు వీటిని డీరిజిస్టర్ చేస్తున్నట్టు మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక ఆ కంపెనీల బ్యాంకు అకౌంట్లను నియంత్రిస్తూ చర్యలు కూడా ప్రారంభించింది. ఈ కంపెనీలు చట్టబద్ధంగా పునరుద్దరించబడే వరకు ఈ సంస్థల బ్యాంకు అకౌంట్లను ఆపరేట్ చేయడానికి వీలు లేదంటూ ప్రభుత్వం ఆదేశించింది. '' కంపెనీల యాక్ట్ సెక్షన్ 248(5) కింద 2,09,032 పేర్లను రిజిస్టర్ కంపెనీల నుంచి తొలగించాం. వీటి ప్రస్తుత డైరెక్టర్లు, అధికారిక సంతకాలు ఇక మాజీ డైరెక్టర్లు, మాజీ అధికారిక సంతకాలుగా మారాయి'' అని అధికారిక ప్రకటన వెలువడింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న కంపెనీల చట్టం సెక్షన్ 248 ప్రకారం పలు కారణాలచే కంపెనీల పేర్లను రిజిస్టర్ జాబితా నుంచి తొలగించే అధికారం ఉందని ప్రభుత్వం తెలిపింది. నిలిపివేయబడినవి(స్ట్రక్ ఆఫ్) నుంచి యాక్టివ్‌లోకి వీటి స్టేటస్‌లోకి మారినప్పుడు మాత్రమే వీటిని చట్టబద్ధంగా మళ్లీ పునరుద్ధరించడం జరుగుతుందని చెప్పింది. నిలిపివేయబడ్డ ఈ కంపెనీల బ్యాంకు అకౌంట్ల ఆపరేషన్లను నియంత్రించే చర్యలు కూడా తీసుకోబడుతున్నాయని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. -
కంపెనీల చట్టానికి సవరణలపై నోటిఫికేషన్
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు, మోసాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు ఉద్దేశించి కొత్త కంపెనీల చట్టం 2013లో పలు సవరణలను కేంద్రం నోటిఫై చేసింది. బోర్డుల తీర్మానాలు, అన్క్లెయిమ్డ్ డివిడెండ్ల వినియోగం, సంస్థల ఏర్పాటు తదితర సవరణలు ఇందులో ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు కోసం కనీస మూలధనం రూ. 1 లక్ష, ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటుకు రూ. 5 లక్షలు ఉండాలన్న నిబంధనను కొత్త కంపెనీల చట్టం తొలగించింది. సమీకరించిన డిపాజిట్లను, వాటిపై వడ్డీని గడువులోగా చెల్లించని కంపెనీలపై రూ. 1 కోటి నుంచి రూ. 10 కోట్ల దాకా జరిమానా పడనుంది. అలాగే, కంపెనీ అధికారులకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. -
వ్యాపార నిబంధనలు సరళం
కంపెనీల చట్టానికి మరోసారి సవరణలు... కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర... న్యూఢిల్లీ : భారత్‌లో వ్యాపార కార్యకలాపాలను మరింత సులువు చేసేవిధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా కంపెనీల చట్టం-2013లో సవరణ ప్రతిపాదనలకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) బుదవారం ఆమోదం తెలిపింది. దేశంలో కొత్తగా ఏదైనా కంపెనీ లేదా సంస్థ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు లేదా రుణ సమీకరణకు ముందు తప్పనిసరిగా ప్రభుత్వానికి డిక్లరేషన్‌ను సమర్పించాలన్న నిబంధనను కంపెనీల చట్టం నుంచి తొలగించాలన్నది తాజా సవరణల్లో ప్రధానమైనది. కాగా, మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక కంపెనీల చట్టంలో రెండోసారి సవరణ జరుగుతుండటం గమనార్హం. అదేవిధంగా ఈ చట్టంలోని నిబంధనల నుంచి మినహాయింపులు లేదా మార్పుచేర్పులకు సంబంధించి తుది ఉత్తర్వులను వేగవంతం చేసేందుకు వీలుకల్పించే ప్రతిపాదనలు కూడా కొత్త సవరణల్లో ఉన్నాయి. కేబినెట్ ఆమోదించిన ఈ ప్రతిపాదనలను కంపెనీల చట్టం(సవరణ) బిల్లు-2014లో చేర్చనున్నారు. దీనికి గతేడాది డిసెంబర్లో లోక్‌సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం వ్యాపారాలకు అత్యంత అనువైన దేశాల్లో భారత్ 142వ స్థానంలో ఉందని.. దీన్ని టాప్-50 లోకి తీసుకురావడమే లక్ష్యంగా అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. గ్యాస్ క్షేత్రాల అభివృద్ధికి కొత్త పాలసీ... సహజవాయువు నిక్షేపాల వెలికితీత, క్షేత్రాల అభివృద్ధి విషయంలో కంపెనీలకు వెసులుబాటు కల్పించేందుకు ఉద్దేశించిన కొత్త పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనివల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీలకు చెందిన 12 సమస్యాత్మక గ్యాస్ క్షేత్రాల(కేజీ-డీ6 సహా) అభివృద్ధికి మార్గం సుగమం కానుంది. ఈ క్షేత్రాల్లో నిక్షేపాల విలువ ప్రస్తుత ధరల ప్రకారం దాదాపు రూ. లక్ష కోట్లుగా అంచనా. కంపెనీలు తమ వద్దనున్న క్షేత్రాలను సొంత రిస్కులతో అభివృద్ధి చేసుకోవడానికి కొత్త పాలసీ అనుమతిస్తుంది. అదేవిధంగా నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) నిర్దేశించినట్లుగా క్షేత్రాల అభివృద్ధికి ముందు నిక్షేపాల ధ్రువీకరణ పరీక్షలన్నీ చేసి.. ఆ తర్వాత అందుకయ్యే మొత్తం వ్యయాన్ని ఆదాయాల నుంచి వెనక్కితీసుకోవడానికి వీలయ్యే ఆప్షన్‌ను కూడా పాలసీ కల్పిస్తుంది. డీజీహెచ్ క్లియరెన్సులు లేక నిలిచిపోయిన 12 గ్యాస్ క్షేత్రాల్లో ఆరు రిలయన్స్‌వి కాగా, 5 ఓఎన్జీసీకి చెందినవి. -
ఫైలింగ్స్‌లో విఫలమైన కంపెనీలకు ఊరట
న్యూఢిల్లీ: కంపెనీల చట్టం ప్రకారం వార్షిక స్టాట్యూటరీ ఫైలింగ్స్‌లో విఫలమైన వందలాది కంపెనీలకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. ఈ ఫైలింగ్స్‌కు ఆగస్టు 15 నుంచీ అక్టోబర్ 15 వరకూ రెండు నెలలు గడువునిచ్చింది. ఈ మేరకు ‘కంపెనీ లా సెటిల్మెంట్ స్కీమ్ 2014’ పేరుతో ప్రభుత్వం బుధవారం ఒక పథకాన్ని ప్రకటించింది. తమ వార్షిక స్టాట్యూటరీ ఫైలింగ్స్ (వార్షిక రిటర్న్స్, బ్యాలెన్స్ షీట్స్)లో విఫలమైనవారు ఈ పథకాన్ని వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఆ ఆఫర్ ఉపయోగించుకునే కంపెనీలపై ఎటువంటి చట్టపరమైన చర్యలూ ఉండబోవని ప్రభుత్వం పేర్కొంది. కార్యకలాపాలు నిర్వహించని కంపెనీలు సైతం సులభతరమైన రీతిలో ఈ విషయాన్ని ఒకే ఒక్క అప్లికేషన్, ‘తగ్గించిన’ స్వల్పస్థాయి ఫీజుతో తెలియజేసుకోవచ్చని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. జూన్ నాటికి రిజిస్టరైన కంపెనీల సంఖ్య 14.02 లక్షలు కాగా, వీటిలో దాదాపు 9.74 లక్షల వరకూ మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయి. దాదాపు 1.42 లక్షల కంపెనీలు క్రియాశీలకంగా పనిచేయని కంపెనీల జాబితాలోకి వెళ్లాయి. వరుసగా మూడేళ్లు తమ వార్షిక ఫైలింగ్స్ దాఖలు చేయని కంపెనీలు ఈ కోవలోకి చేరుతాయి. -
ఆర్ఈఐటీ నిబంధనల మార్పునకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఆర్ఈఐటీ)ల నిబంధనలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే బాటలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన సలహాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా వీటి ఆస్తుల కనీస పరిమాణాన్ని రూ. 1,000 కోట్ల నుంచి రూ. 500 కోట్లకు తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతోపాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అధిక రిస్క్‌ల నేపథ్యంలో తొలి దశకింద పెద్ద ఇన్వెస్టర్లకు మాత్రమే వీటిలో పెట్టుబడులకు అవకాశాన్ని కల్పించేందుకు ప్రతిపాదించింది. వెరసి కనీస పెట్టుబడి పరిమితిని రూ. 2 లక్షలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లతోపాటు, దేశీ బీమా సంస్థలు, పెన్షన్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్ తదితరాలు వీటిలో ఇన్వెస్ట్‌చేసేందుకు వీలు కల్పించింది. ఆర్ఈఐటీ నిబంధనలతోపాటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్స్)లకు సంబంధించిన మార్గదర్శకాలకు కూడా ఈ నెల 10న(ఆదివారం) జరగనున్న సమావేశంలో బోర్డు ఆమోదముద్ర వేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఇన్ఫ్రా రంగానికి అవసరమయ్యే రూ. 65 లక్షల కోట్ల పెట్టుబడుల సమీకరణకు వీలు కల్పించే యోచనతో ఇన్విట్స్కు తెరలేపింది. సెబీ బోర్డు సమావేశానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యే అవకాశముంది. జైట్లీ ప్రకటించిన సాధారణ బడ్జెట్లో రియల్టీ, ఇన్ఫ్రా ట్రస్ట్‌లలో పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. -
కంపెనీల చట్టంపై కేంద్రం సమీక్ష
21న సమావేశం: నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ: కొత్తగా రూపొందించిన 2013 కంపెనీల చట్టంపై ఉన్న ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటామని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. తద్వారా చట్టానికి సవర ణలు అవసరమా లేదా అనే విషయాన్ని నిర్దారిస్తామని ఒక చానెల్ తెలి పారు. చట్టానికి సవవరణలు చేయాలని గత కొన్ని నెలలుగా డిమాండ్లు వస్తున్నాయని, అవసరమైతే నిబంధనలను సరళతరం చేయడం, మార్పులు చేపట్టడం వంటి అంశాలపై దృష్టిపెడతామని చెప్పారు. ఈ విషయమై ఈ నెల 21న సంబంధిత వర్గాలతో సమావేశాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. రైల్వేలో ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపుపై కసరత్తు రైల్వే రంగంలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించడంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ కసరత్తు ప్రారంభించింది. హై స్పీడ్ ట్రెయిన్ సిస్టమ్స్, రవాణా కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడంలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించే దిశగా ముసాయిదా క్యాబినెట్ నోట్ సిద్ధం చేసింది. దీనిపై చర్చించేందుకు మంత్రిత్వ శాఖలకు పంపింది. రైల్వే రంగం వృద్ధికి తోడ్పడేలా ఏయే విభాగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించవచ్చనే అవకాశాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ మినహా రైల్వే రంగంలో ఎఫ్‌డీఐలకు ఏ రూపంలోనూ అనుమతి లేదు. -
ఎఫ్‌టీఏలు, సెజ్‌లపై సర్కారు సమీక్ష
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి చెన్నై: దేశంలోని ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు), ఇతర దేశాలతో కుదుర్చుకున్న విదేశీ వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) భారతీయులకు ఏమాత్రం లబ్ధి చేకూర్చాయన్న అంశాన్ని ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘అన్ని ఎఫ్టీఏలనూ విశ్లేషించి, అవి ప్రయోజనకరమైనవో కావో తేల్చి, వాటికి చేయాల్సిన సవరణలను నిర్ణయించాల్సిందిగా నా శాఖ అధికారులను ఆదేశించాను. సెజ్‌లు ఎందుకు సత్ఫలితాలను ఇవ్వలేకపోయాయో పూర్తిస్థాయిలో సమీక్షించాలని చెప్పాను...’ అని ఆమె శనివారం చెన్నైలో మీడియాకు తెలిపారు. ఎఫ్‌టీఏలు, సెజ్‌లకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నిటినీ పునఃసమీక్షించడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టంచేశారు. కొత్త కంపెనీల చట్టంలోని కొన్ని అధికరణలపై వ్యాపారులు, స్టేక్హోల్డర్లు ఆందోళన వెలిబుచ్చారనీ, వీటిపై వచ్చే శనివారం న్యూఢిల్లీలో చర్చిస్తామనీ చెప్పారు. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రస్తుత తరుణంలో సబబు కాదని అన్నారు. -
15 కోట్లతో ఐసీఎస్ఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంపెనీ సెక్రటరీల ఉపాధికి విఘాతం కలిగించే విధంగా ఉన్న కొత్త కంపెనీల చట్టంలోని నిబంధనలకు త్వరలోనే సవరణలు జరగనున్నాయని, దీనికి ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపిందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) జాతీయ అధ్యక్షుడు ఆర్.శ్రీధరన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త కంపెనీల చట్టంలోని దొర్లిన లోపాలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పెలైట్ అంగీకరించారని, వీటిని తప్పక సరిచేస్తానని హామీ ఇచ్చారన్నారు. కొత్త కంపెనీల చట్టంలో ప్రైవేటు కంపెనీలు, రూ.10 కోట్ల లోపు చెల్లింపు మూలధనం ఉన్న పబ్లిక్ కంపెనీలకు కీ మేనేజరియల్ పెర్సనల్ (కేఎంపీ) నుంచి మినహాయింపు ఇవ్వడంతో అనేకమంది కంపెనీ సెక్రటరీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనను సవరించనుండటంతో కంపెనీ సెక్రటరీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటీకి దేశం డిమాండ్‌కు తగ్గట్టుగా కంపెనీ సెక్రటరీలు లేక కొరతను ఎదుర్కొంటోందని శ్రీధరన్ తెలిపారు. హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ రూ.15 కోట్లతో హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేస్తున్నట్లు ఐసీఎస్ఐ ప్రకటించింది. నెల రోజుల్లో పనులు ప్రారంభించి రెండేళ్లలో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు శ్రీధరన్ తెలిపారు. ముంబై తర్వాత రెండో కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది.