కార్ల కంపెనీలు.. డీలర్లు అందిస్తున్న డిస్కౌంట్లు, ఆఫర్లు కేక పుట్టిస్తున్నాయి. కొత్త ఏడాది కొత్త మోడల్ కొనుక్కోవచ్చంటూ కొనుగోలుదారులు ఈ నెలలో కార్ల కొనుగోళ్లను వాయిదా వేస్తారు. వారిని ఆకర్షించడం, సంవత్సరాంత నిల్వలను తగ్గించుకోవడం లక్ష్యాలుగా కార్ల కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. వీటితో పాటు ఉచిత బీమా, ఎక్సే్ఛంజ్ బోనస్‌లు, తక్కువ వడ్డీరేట్లకే రుణాలు, యాక్సెసరీలు ఉచితంగా అందించడం, వార్షిక మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో కూడా డిస్కౌంట్లనివ్వడం, బంగారు నాణేలు, హాలిడే ట్రిప్‌లు ఆఫర్ చేయడం, ఉచిత ఈఎంఐ వంటి ఆఫర్లను డీలర్లు అందిస్తున్నారు. కొన్ని కంపెనీలు ‘ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి’ అంటూ ఆకర్షణీయమైన ఆఫర్లు తెచ్చాయి. ప్రాంతాన్ని బట్టి, డీలర్‌ను బట్టి డిస్కౌంట్లు, ఆఫర్లు మారుతుంటాయి. మీకు కనుక బేరమాడే శక్తి బాగా ఉంటే మరింతగా డిస్కౌంట్లు, ఆఫర్లు పొందే అవకాశాలూ ఉన్నాయి. ఏతావాతా రూ.25,000 నుంచి రూ.8.85 లక్షల రేంజ్‌లో డిస్కౌంట్లను కార్ల కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ డిస్కౌంట్లు, ఆఫర్లపై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ...
టాటా మోటార్స్ తగ్గింపు రూ.1.87 లక్షల వరకూ
టాటా మోటార్స్ కంపెనీ రూ.26,000–రూ.1.87 లక్షల వరకూ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. టియాగో, హెక్సాలపై రూ.78,000 వరకూ తగ్గింపులు ఇస్తోంది. మరోవైపు రూ. ఒక్క రూపాయి డౌన్ పేమెంట్‌గా చెల్లించి టాటా కార్లను సొంతం చేసుకునే ఆకర్షణీయ స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది. టాటా ఇండిగో ఈ–సీఎస్ మోడల్‌పై రూ.1.87 లక్షల వరకూ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుండటంతో ఈ కారు ధర రూ.3,15,000కు తగ్గింది. కొనుగోలుదారుడు ఎవరైనా పేటీఎమ్ ద్వారా చెల్లింపులు జరిపితే అదనంగా మరో రూ.10,000 తగ్గింపు లభిస్తుంది. అంటే ఈ కారు రూ.3.05 లక్షలకే లభిస్తుంది.
మారుతీ డిస్కౌంట్ రూ.90,000 వరకూ..
భారత్‌లో అతి పెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ, తన మోడళ్లపై భారీగానే డిస్కౌంట్లను, ఆఫర్లను అందిస్తోంది. ఆల్టో, వ్యాగన్‌ఆర్, స్విఫ్ట్, సియాజ్, సెలెరియో, ఇగ్నిస్, ఎర్టిగ తదితర మోడళ్లపై ఆ కంపెనీ పెద్ద స్థాయిలోనే డిస్కౌంట్లనందిస్తోంది. స్విఫ్ట్‌పై రూ.35,000 వరకూ, సియాజ్ డీజిల్ మోడళ్లపై రూ.90,000 వరకూ డిస్కౌంట్లను అఫర్ చేస్తోంది. అయితే బాగా అమ్ముడయ్యే బాలెనో, బ్రెజా, డిజైర్ వంటి మోడళ్లపై ఈ కంపెనీ ఎలాంటి డిస్కౌంట్లను ఇవ్వడం లేదు.
హ్యుందాయ్ డిసెంబర్ డిలైట్..
కొరియా కంపెనీ హ్యుం దాయ్ ఏకంగా డిస్కౌంట్ల కోసమే ప్రత్యేకంగా డిసెంబర్ డిలైట్ పేరుతో ఒక స్కీమ్‌నే ప్రకటించింది. బాగా అమ్ముడయ్యే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్.. క్రెటాకు మినహా దాదాపు అన్ని మోడళ్లపై ఈ కంపెనీ డిస్కౌంట్లనందిస్తోంది. గ్రాండ్ ఐ10పై రూ.90,000 వరకూ, ఇలీట్ ఐ20పై రూ.55,000 వరకూ డిస్కౌంట్లనందిస్తోంది. అన్ని వేరియంట్లపై రూ.10,000 విలువైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తోంది.
హోండా కార్స్.. ఉచితంగా ఏడాది బీమా
హోండా కార్స్ ఇం డియా.. సిటీ కారు కొనుగోలు చేస్తే, ఏడాది బీమాను ఉచితంగా అందిస్తోంది. సీఆర్–వీ మోడల్‌పై లక్షన్నర వరకూ డిస్కౌంట్‌నిస్తోంది. ఇక జాజ్ కారు కొంటే రూ.30,000 తగ్గింపు లభిస్తుంది. ఏడాది బీమా కూడా ఉచితంగా అందుతుంది. ఒక్క డబ్ల్యూఆర్‌వీ మోడల్‌పై మాత్రం ఎలాంటి తగ్గింపులు లేవు.
ఫోక్స్‌వ్యాగన్ రాయితీ రూ.1.1 లక్షల వరకూ
జర్మనీ కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ రూ.1.1 లక్షల వరకూ డిస్కౌంట్‌నందిస్తోంది. పోలో కారు కొనుగోలు చేస్తే నగదు డిస్కౌంట్‌తో పాటు, ఎక్సే్చంజ్ బోనస్ కూడా కలుపుకొని రూ.60,000 వరకూ తగ్గింపు లభిస్తుంది. వెంటో మోడల్‌కు అయితే రూ.90,000 నగదు డిస్కౌంట్‌ను అందిస్తోంది.
తక్కువ రేటుకే రెనో రుణాలు..
ఫ్రెంచ్ కార్ల కంపెనీ రెనో రూ.10,000 విలువైన ఉచిత యాక్సెసరీలు అందిస్తోంది. క్విడ్ కార్ల కొనుగోళ్ల కోసం 7.99 శాతానికే రుణాలందిస్తోంది. డస్టర్ ఏఎమ్‌టీపై రూ.90,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఏడాదిపాటు ఉచిత బీమాను అందిస్తోంది.
ఆడి తగ్గింపులు రూ.3లక్షలు –8.85 లక్షల రేంజ్‌లో..
జర్మనీ లగ్జరీ కంపెనీ ఆడి కూడా తగ్గింపుల విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ కంపెనీ ఏ3, ఏ4, ఏ6, క్యూ3 మోడళ్ల ధరలను రూ.3 లక్షల నుంచి రూ.8.85 లక్షల రేంజ్‌లో తగ్గించింది. ఆడి రష్ పేరుతో ఒక కొత్త ఆకర్షణీయమైన స్కీమ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆడి కార్లను ఈ నెలలో కొనుగోలు చేసి 2019 నుంచి ఈఎమ్‌ఐలు చెల్లించేలా ఈ స్కీమ్‌ను డిజైన్ చేసింది. ఆడి కంపెనీ లాగానే స్కోడా ఇండియా కూడా ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి పేరుతో ఒక ఆకర్షణీయమైన స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది. కొంత డౌన్ పేమెంట్ చెల్లించి కారును కొనుగోలు చేసిన ఏడాది తర్వాత ఈఎంఐలు చెల్లించే వెసులుబాటు ఈ స్కీమ్ ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment