ఎగుమతుల్లో వెనుకబడ్డ ఏపీ: ఫియో
ఎఫ్‌టీఏను ఉపయోగించుకోవడం లేదు
సాక్షి, అమరావతి: వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్ని (ఎఫ్‌టీఏ)లను వినియోగించుకోవడంలో మన ఎగుమతిదారులు వెనుకబడిపోతున్నారని, ఇప్పటివరకు ఇండియా 27 దేశాలతో ఎఫ్‌టీఏ ఒప్పందాలను కుదుర్చుకుంటే.. ఈ దేశాలకు జరుగుతున్న వాటా 22 శాతం కూడా లేదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌స(ఫియో) తెలిపింది. సోమవారం షార్జాకి చెందిన సైఫ్ జోన్ సంస్థ ఏర్పాటు చేసిన రోడ్‌షోలో ఫియో దక్షిణ విభాగం డెరైక్టర్‌జనరల్ ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ సముద్ర ఉత్పత్తులు, టెక్స్‌టైల్, గ్రానేట్, వ్యవసాయ వంటి ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఎగుమతుల్లో బాగా వెనుకబడి ఉందన్నారు.
2015-16 ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 2%(సుమారు రూ.36,500 కోట్లు) మాత్రమేనన్నారు. చిన్న ఎగుమతిదారులకు షార్జా ఇంటర్నేషనల్ ఫ్రీ జోన్ (సైఫ్ జోన్) ముఖద్వారంగా ఉంటుందని, దీన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. సైఫ్ జోన్ డెరైక్టర్ సాద్ అల్ మజౌరీ మాట్లాడుతూ తమ జోన్ నుంచి ఎగుమతి చేస్తే పన్నుల భారం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ చాంబర్స్ ప్రధాన కార్యదర్శి పొట్లూరి భాస్కర రావు మాట్లాడుతూ వ్యవసాయం, మెరైన్ ఉత్పత్తులకు ఏపీ నాయకత్వం వహించనుందన్నారు.