2016 నాటికి ఎఫ్‌టీఏపై చర్చలు పూర్తి
న్యూఢిల్లీ: సమగ్ర ఆర్థిక సహకారానికి ఉద్దేశించి భారత్‌తో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై చర్చలు 2016 నాటికల్లా ఒక కొలిక్కి రాగలవని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడులను పెంచుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. భారత పర్యటనలో భాగంగా పరిశ్రమ ప్రముఖులతో జరిగిన విందు సమావేశంలో అబాట్ ఈ విషయాలు తెలిపారు. 2012-13లో ద్వైపాక్షిక వాణిజ్యం 15 బిలియన్ డాలర్ల స్థాయిలో జరిగింది.
వర్ధమాన ప్రజాస్వామ్య సూపర్‌పవర్‌గా ఎదుగుతున్న భారత్‌ని అలక్ష్యం చేయరాదని, ఇక్కడ పెట్టుబడులు మరింత పెంచుకోవాలని అబాట్ ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలకు సూచించారు. అటు అదానీ మైనింగ్ తమ దేశంలో తలపెట్టిన ప్రాజెక్టును పరోక్షంగా ప్రస్తావిస్తూ.. అంతా సవ్యంగా సాగితే వచ్చే ఏడాదికల్లా ఇది ప్రారంభం కావొచ్చన్నారు. ఆస్ట్రేలియన్ బొగ్గు ఊతంతో వచ్చే అర్ధశతాబ్దం పాటు 10 కోట్ల పైచిలుకు భారతీయులకు విద్యుత్ వెలుగులు ఇవ్వడానికి సాధ్యపడుతుందని చెప్పారు. మరోవైపు, ఆస్ట్రేలియా సంస్థలు చేసుకున్న మైనింగ్ లీజు దరఖాస్తులకు అనుమతుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేస్తామని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు.