Tony Abbott
-
హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. అదానీకి పెరిగిపోతున్న దేశాధినేతల సపోర్ట్!
అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ తోసిపుచ్చారు. రెగ్యులేటర్లు ఈ విషయాన్ని పరిశీలిస్తారని, తనకు సంబంధించినంత వరకు ఆస్ట్రేలియాపై అదానీ గ్రూప్ చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. ‘‘ఆరోపణలు చేయడం చాలా తేలిక. ఏదో ఆరోపణ చేసినంత మాత్రాన అది నిజం కాదు. నేరం రుజువయ్యే వరకు మీరు నిర్దోషే’’ అని చెప్పే న్యాయ సూత్రాల గురించి ప్రస్తావించారు. అదానీ గ్రూప్‌పై హిండెన్ బర్గ్ చేస్తున్న ఆరోపణలపై భారత్‌కు చెందిన ఓ మీడియా సంస్థతో టోనీ అబాట్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాపై అదానీ గ్రూప్ చూపిన విశ్వాసానికి కృతజ్ఞుడను. తన దేశంలో బిలియన్ల డాలర్ల విలువైన అదానీ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ విధంగా అన్నారు. ఆ పెట్టుబడులతో ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు, సంపద సృష్టించామని చెప్పారు. అంతేకాదు ఆస్ట్రేలియా నుంచి అదానీ దిగుమతి చేసుకున్న బొగ్గు సహాయంతో.. భారత్‌లో నిరంతరం విద్యుత్తును అందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తన వంతు సాయం చేశారని గౌతమ్ అదానీపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాంటి అదానీ గ్రూప్‌పై అసంబద్ధమైన ఆరోపణలు చేయడం సరికాదని, హిండెన్ బర్గ్ చేస్తున్న అసత్య ఆరోపణల్ని ఖండిస్తున్నట్లు టోనీ అబాట్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్‌పై మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే సంచలన వ్యాఖ్యలు! అదానీ అండగా టోనీ అబాట్ కాగా,2015లో అబాట్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆస్ట్రేయాలియాలో అదానీ కార్మైకేల్ సంస్థ బొగ్గు గనుల్ని వెలికితీసేందుకు పూనుకుంది. ఆ బొగ్గు వెలికి తీతపై స్థానిక కోర్టు తీవ్రంగా ఖండించింది. గనుల పర్యావరణ అనుమతులను రద్దు చేసింది. దీన్ని ఖండించిన అబాట్ ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకు న్యాయపరమైన అడ్డంకులు సృష్టించడం వల్ల విస్తృతస్థాయి ప్రయోజనాలు దెబ్బతింటాయంటూ అదానీ గ్రూప్‌కు అండగా నిలిచారు. ఎట్టకేలకు 2019లో అదానీ గ్రూప్‌నకు తుది అనుమతులు లభించాయి. అక్కడి నుంచి వెలికితీసిన బొగ్గునే ఇప్పుడు అదానీ గ్రూప్ భారత్‌కు సరఫరా చేస్తోంది. -
రెండేళ్లలో నలుగురు ప్రధానులు!
- ఆస్ట్రేలియాలో మరోసారి మారిన రాజకీయసమీకరణాలు - లిబరల్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో ఓడి పదవి కోల్పోయిన టోనీ అబాట్.. నూతన ప్రధానిగా మాల్కమ్ టర్న్‌బుల్ ప్రపంచంలోనే ధనిక దేశాల జాబితాలో టాప్ 10లో ఒకటైన ఖండదేశం ఆస్ట్రేలియాలో గడిచిన రెండేళ్లుగా అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది గంటల కిందట (సోమవారం సాయంత్రం) ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ పదవి కోల్పోవడం తప్పనిసరి కావటం ఆ పరిణామాలకు పరాకాష్ట. గడిచిన రెండేళ్లలో ఆస్ట్రేలియాకు ముగ్గురు ప్రధానులు మారారు. (లేబర్ పార్టీలో నాయకత్వ మార్పుతో 2013లో జూలీ గిలార్డ్ ప్రధాని పదవిని కోల్పోయారు. ఆమె స్థానంలో కెవిన్ రూడ్ అత్యున్నత పదవిని చేపట్టారు. ఆ తర్వాత కొద్ది నెలలకే సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. లిబరల్ పార్టీ విజయం సాధించింది. టోనీ అబాట్ ప్రధానిగా ప్రమాణం చేశారు) ఇప్పుడు అబాట్ స్థానంలో గద్దెనెక్కనున్న మాల్కం టర్న్ బుల్ తో కలిపితే ఆ సంఖ్య నాలుగుకు చేరుతుంది. అబాట్ ఉన్నపళంగా ఎందుకు దిగిపోవాల్సి వచ్చిందంటే.. తాను నేతృత్వం వహిస్తున్న లిబరల్ పార్టీ నాయకత్వ పోటీలో ఓడిపోయినందున అబాట్ ప్రధాని పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ప్రధాన మంత్రి లాంటి అత్యున్నత పదవి చేపట్టే వ్యక్తే.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి కూడా నాయకుడిగా ఉండాలనేది ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న రాజకీయ నియమం. లేబర్ పార్టీని ఓడించి 2013లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న లిబరల్ పార్టీకి టోనీ అబాట్ నాయకుడు. అలా ఆయన ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడంతోపాటు ఆర్థికంగా దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో అబాట్ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఆయన నాయకత్వంపై తిరుగుబాటు మొదలైంది. అబాట్ క్యాబినెట్ లో కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేసిన మాల్కం టర్న్ బుల్... వైరి వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 18న జరిగిన లిబరల్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో 54- 44 ఓట్ల తేడాతో అబాట్ పై మాల్కం విజయం సాధించారు. దీంతో అబాట్ పదవి నుంచి వైదొలగక తప్పలేదు.'టోనీ అబాట్ గవర్నర్ కు రాజీనామాలేఖ సమర్పించడమే ఆలస్యం.. నేను ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తాను' అని మాల్కం టర్న్ బుల్ సోమవారం కాన్ బెర్రాలో విలేకరులతో అన్నారు. ఫైటర్.. టర్న్‌బుల్.. న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి వ్యాపారవేత్తగానూ విజయం సాధించిన మాల్కం టర్న్ బుల్.. లిబరల్ పార్టీలో చేరి అనతికాలంలోనే ఉన్నతస్థాయికి ఎదిగారు. 2008-09లో ప్రతిపక్ష నేతగా లేబర్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. గే వివాహ చట్టం, వాతావరణ మార్పులు తదితర అంశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీతో మొట్టికాయలు తిన్నారు. కమ్యూనికేషన్ల మంత్రిగా ఉంటూనే అబాట్ తీరును నిరసించారు. సమర్థ నాయకత్వం లేనిదే ఆస్ట్రేలియా మనుగడ సాధించలేదన్న వాదనతో పార్టీని మెప్పించి ప్రధాన మంత్రి పదవికి అర్హత సాధించారు. నిజానికి 2013లోనే మాల్కం ప్రధాని కావల్సింది. కానీ ఒక్క ఓటు తేడాతో టోనీ అబాట్ లిబరల్ పార్టీ అధ్యక్షుడిగా గెలవడంతో ఛాన్స్ మిస్ అయింది. -
దించకుండా బీరు తాగిన ప్రధాని
సిడ్నీ: ప్రోత్సహించాలే కానీ ఏడు సెకండ్లలో కూడా బీరు దించకుండా తాగొచ్చని నిరూపించాడు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్. రూల్స్ ఫుట్ బాల్ ఆటగాళ్లు సిడ్ని పబ్ లో ఇచ్చిన విందులో అందరి హర్షధ్వానాల మధ్య టోనీ గ్లాసు దించకుండా బీరు లాగించారు. జనాలతో కిక్కిరిసిన బార్ లో టోనీ గ్లాసుని దించకుండా బీరుని తాగిన దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. టోనీ చేసిన ఈ ప్రయత్నం కొందరికి ఆనందాన్నిస్తే మరికొందరికి చిరాకు తెప్పించింది. ఆస్ట్రేలియాలో అమితంగా మద్యం సేవిస్తున్నారని విమర్శించిన ప్రధానే ఇలా అందరి ముందు తాగడం ఏంటని.. చూసిన వాళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. -
ఆస్ట్రేలియాలో మరో దారుణం
-
ఆస్ట్రేలియాలో మరో దారుణం: 8 మంది చిన్నారుల మృతి
మెల్బోర్న్ : సిడ్నీలోని కేఫ్ ఘటన, పాకిస్థాన్ పెషావర్‌లో చిన్నారుల నరమేధం మనోఫలకంపై నుంచి చెరగక ముందే ఆస్ట్రేలియాలోని సౌత్ క్వీన్స్ ల్యాండ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. సౌత్ క్వీన్స్‌ల్యాండ్‌లోని కెయిర్న్స్ పట్టణంలోని ఓ ఇంటిలో మహిళ (34) తీవ్రంగా గాయపడినట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ ఇంటి ఆవరణలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఎనిమిది మంది చిన్నారులను మృతదేహలను గుర్తించారు. ఆ మృతదేహలన్నీ ఏడాదిన్నర వయస్సు గల చిన్నారుల నుంచి 15 సంవత్సరాల వయస్సు గల వారివి ఉన్నాయని చెప్పారు. పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు ఆ మృతదేహాలపై గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా సోదరులుగా భావిస్తున్నామని చెప్పారు. గాయపడిన మహిళ ఆరోగ్యం పరిస్థతి ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ ఇంటిని అణువణువు తనిఖీ చేస్తున్నారు. అలాగే ఇంటి పరిసరాల్లోని వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఉల్కిపడింది. దేశం ప్రస్తుతం క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటుందని ప్రధాని టోని అబ్బాట్ తెలిపారు. ఈ దారుణంపై మాట్లాడేందుకు మాటలు రావడం లేదన్నారు. -
సిడ్నీ ఆగంతకుల చెరలో గుంటూరు టెకీ
న్యూఢిల్లీ: సిడ్నీలో ఓ కేఫ్ లో కి ఆగంతకులు చొరబడి కొంతమందిని బందీలుగా నిర్భందించిన అంశం కలకలం సృష్టిస్తోంది. ఐఎస్ఐఎస్ఐ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నఆగంతకులు సోమవారం ఉదయం మార్టిన్ ప్లేస్‌లోని ఓ కేఫ్‌లో ప్రవేశించి అందులో ఉన్న కొంతమందిని బందీలుగా నిర్భందించారు. వారిలో ఒక భారతీయ ఇంజనీర్ కూడా బందీగా చిక్కుకున్నాడు. ఆయనను గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పిడుగురాళ్ల మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన విశ్వకాంత్ అంకిరెడ్డి ఈ బందీలలో ఉన్నట్లు తాజాగా తెలిసింది. ఆయన అక్కడ ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేస్తున్నారు. విశ్వకాంత్ కూడా ఆగంతకుల చిక్కుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ మేరకు తమకు సమాచారం కూడా అందిందని ఆయన స్పష్టం చేశారు. బందీలుగా పట్టుబడిన వారిని విడిపించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది. ఇప్పటికే అధికారులు వారితో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, తాము ప్రధాని టోనీ అబాట్ తో మాట్లాడాలని ఆగంతకులు డిమాండ్ చేస్తున్నారు. -
సిడ్నీలో భారత కాన్సులేట్ మూసివేత
న్యూఢిల్లీ:ఆస్ట్రేలియా నగరం సిడ్నీలో ఓ కేఫ్‌లో ఆగంతకులు రెచ్చిపోవడంతో అక్కడి భారత కాన్సులేట్ ను మూసివేశారు.కా న్సులేట్ సిబ్బందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సిడ్నీలోని డిప్యూటీ కన్సల్ జనరల్ వినోద్ బాహాదే తెలిపారు. నగరంలోని మార్టిన్ ప్లేస్‌లోని కేఫ్ లో13 మందిని ఆగంతకులు నిర్బంధిండంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కేఫ్ చుట్టుముట్టి నిర్బంధంలో ఉన్నవారిని విడిపించేందుకు యత్నిస్తోంది. దీనిలో భాగంగా అక్కడి భారీగా పోలీస్ బలగాలను మోహరించి బందీలుగా పట్టుబడిన వారిని విడిపించేందుకు యత్నిస్తున్నారు. లోపల ఉన్న దుండగుల వద్ద ఉన్న జెండాల్లో అరబిక్ అక్షరాలను బట్టి వాళ్లు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా పోలీసులు భావిస్తున్నారు. ఆగంతుకుల చెరనుంచి ముగ్గురు తప్పించుకుని సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. -
సిడ్నీలో హైటెన్షన్, రెచ్చిపోయిన ఆగంతకులు
సిడ్నీ : ఆస్ట్రేలియా సిడ్నీలో ఆగంతకులు రెచ్చిపోయారు. దాంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. నగరంలోని మార్టిన్ ప్లేస్‌లోని ఓ కేఫ్‌లో 13మందిని ఆగంతకులు నిర్బంధించారు. దాంతో పోలీసులు కేఫ్ చుట్టుముట్టి నిర్బంధంలో ఉన్నవారిని విడిపించేందుకు యత్నిస్తున్నారు. దుండగుల అదుపులో డజన్ల సంఖ్యలో వ్యక్తులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఒపెరా హౌస్ ను ఖాళీ చేయించారు. లోపల ఉన్న దుండగుల వద్ద ఉన్న జెండాల్లో అరబిక్ అక్షరాలను బట్టి వాళ్లు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని టోనీఅబాట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఆయన సమీక్షించారు. జాతీయ భద్రతా దళాలను సంఘటనా స్థలానికి పంపినట్లు తెలిపారు. మరోవైపు జాతీయ భద్రతా దళాలు అక్కడకు చేరుకుని... చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేయించారు. నిర్బంధంలో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకురావటమే తమ లక్ష్యమన్నారు. సిడ్ని నగరంపై ఏ విమానాలు తిరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. భద్రతా బలగాలు సిడ్ని వ్యాపార కేంద్రాన్ని చుట్టుముట్టాయి. -
‘ఫైనల్ మన మధ్యే జరగాలి’
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ ప్రధాని టోనీ అబాట్‌తో కలిసి చారిత్రక మెల్బోర్న్ క్రికెట్ మైదానాన్ని (ఎమ్సీజీ) సందర్శించారు. వారితో పాటు భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, వీవీఎస్ లక్ష్మణ్, ఆసీస్ మాజీ ఆటగాళ్లు డీన్ జోన్స్, కాస్ప్రోవిజ్, స్టీవ్‌వా, అలెన్ బోర్డర్, మెక్‌గ్రాత్‌లు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా నెగ్గిన ప్రపంచకప్‌లతో పాటు 2015 ప్రపంచకప్‌తో వారు ఫోటోలు దిగారు. ఈసారి ప్రపంచకప్ ఫైనల్‌కు ఎమ్సీజీ సరైన వేదికని, ఆ మ్యాచ్‌లో భారత్, ఆసీస్ తలపడాలని మోదీ ఆకాంక్షించారు. మహాత్మ గాంధీ చరకాతో కూడిన మెమెంటోతో పాటు, ప్రపంచకప్ గెలిచిన జట్టు కెప్టెన్లు కపిల్, ధోని, తన సంతకాలతో కూడిన మూడు బంతులను ఆసీస్ సారథులకు బహుకరించారు. ఇతర అంశాల్లో కూడా ఆస్ట్రేలియన్ల క్రీడా నైపుణ్యాన్ని చూసి నేర్చుకోవాలన్నారు. ఇరు దేశాల క్రీడా విశ్వవిద్యాలయాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. నరేంద్ర మోదీ, మెల్బోర్న్ క్రికెట్ మైదానా, టోనీ అబాట్, -
మోదీ సోదరుడిలాంటి వారు: ఆస్ట్రేలియా ప్రధాని
మెల్బోర్న్: విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులనే గాక దేశాధినేతలను సైతం ఆకట్టుకుంటున్నారు. మోదీ తనకు సోదరుడి లాంటి వారని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ వ్యాఖ్యానించడం విశేషం. ఆస్ట్రేలియాలో మోదీ, టోనీ అత్యంత సన్నిహితుల్లా మెలిగారు. వీరిద్దరూ కలసి పాల్గొన్న కార్యక్రమాల్లో టోనీ పలుమార్లు 'నరేంద్ర, నేను' అని సంబోధించారు. జి-20 సదస్సు సందర్బంగా మోదీ టోనీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ కలసి సెల్ఫీ కూడా దిగారు. మోదీ మంగళవారం ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఫిజీ బయల్దేరారు. 'నా చిరస్మరణీయ ఆస్ట్రేలియా పర్యటన ఈ రోజుతో ముగిసింది. ఇక సరికొత్త అధ్యాయం మొదలైంది' అని మోదీ అన్నారు. -
కాన్బెర్రా నుంచి మెల్బోర్న్కు మోదీ
మెల్బోర్న్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ మెల్బోర్న్ చేరుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన ప్రత్యేక విమానంలో కాన్బెర్రా నుంచి మెల్బోర్న్ విచ్చేశారు. అంతకు ముందు కాన్బెర్రాలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ ఎబాట్, మోదీ మధ్య మంగళవారం శిఖరాగ్ర చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సామాజిక భద్రత, ఖైదీల మార్పిడి, డ్రగ్స్‌పై పోరు...తదితర అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. సాంస్కృతిక, పర్యాటక రంగాలపై కూడా ఇరుదేశాల మధ్య అవగాహనా ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది. కాగా అబాట్‌తో చర్చల అనంతరం ఆస్ట్రేలియా పార్లమెంట్‌నుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని టోనీ ఎబాట్ చారిత్రక రికార్డు పత్రాలను మోదీతో పంచుకున్నారు. మోదీ తన ప్రసంగం అనంతరం బ్రిటన్ పార్లమెంట్ నేతలను పరిచయం చేసుకున్నారు. కాగా మోదీ రాత్రికి మెల్బోర్న్ నుంచి ఫిజి పర్యటనకు బయల్దేరతారు. ఆయన పదిరోజుల్లో మూడు దేశాల్లో పర్యటించటం విశేషం. -
2 లక్షల కోట్ల డాలర్లు పెంచాలి..
వచ్చే ఐదేళ్లలో ప్రపంచ జీడీపీపై జీ20 దేశాధినేతల తీర్మానం ఇన్ఫ్రాలో భారీ పెట్టుబడులు, వాణిజ్యం పెంపుతోనే సాధ్యం బ్రిస్బేన్: రానున్న ఐదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ)కి 2 లక్షల కోట్ల డాలర్లను అదనంగా జతచేయాలని జీ20 దేశాధినేతలు నిర్దేశించారు. ఇందుకోసం మౌలిక సదుపాయాల రంగంలో భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యాన్ని గణనీయంగా పెంచడం వంటి చర్యలు చేపట్టాలని తీర్మానించారు. ఆదివారమిక్కడ జీ20 సదస్సు ముగింపు సందర్భంగా విడుదల చేసిన 3 పేజీల ప్రకటనలో ఈ అంశాలను పొందుపరిచారు. అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలకు చెందిన 20 దేశాల కూటమే జీ20. ప్రపంచ ఆర్థిక వృద్ధిని పెంచడం, మెరుగైన జీవన ప్రమాణాలు, నాణ్యమైన ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు జీ20 ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర అగ్రనేతలు స్పష్టం చేశారు. ‘2018 కల్లా ప్రపంచ జీడీపీకి కనీసం మరో 2% వృద్ధిని జోడించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో 2 లక్షల కోట్ల డాలర్లు జతవుతుంది. మిలియన్లకొద్దీ ఉద్యోగాలను సృష్టించొచ్చు’ అని పేర్కొన్నారు. 2012 గణాంకాల ప్రకారం ప్రపంచ జీడీపీ విలువ 85 లక్షల కోట్ల డాలర్లు. ఇందులో జీ20 దేశాల వాటా 85% కావడం గమనార్హం. సమీకృత అభివృద్ధిపై దృష్టి... ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తగిన డిమాండ్ లేక అవస్థలుపడుతోంది. వృద్ధి పెంపునకు సరఫరాపరమైన అడ్డంకులను తొలగించాలి. ఫైనాన్షియల్ మార్కెట్లు, భౌగోళిక రాజకీయపరమైన ఉద్రిక్తతలు వంటి రిస్కులు పొంచిఉన్నాయి. ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి అంతర్జాతీయ సంస్థలు, వృద్ధికి ఊతమిచ్చేందుకు మేమంతా కట్టుబడి ఉన్నాం. పటిష్టమైన, స్థిరమైన, సమతూకంతోకూడిన వృద్ధితో పాటు ఉద్యోగాల కల్పన కోసం మరిన్ని చర్యలు తీసుకుంటాం. నిర్మాణాత్మక సంస్కరణలు, ప్రైవేటు రంగ వ్యాపార కార్యకలాపాల పెంపు వంటి చర్యలను అమలు చేయనున్నాం. ఇవన్నీ సమీకృత అభివృద్ధితో పాటు ఆర్థిక అసమానతలు, పేదరికాన్ని తగ్గించేందుకు తోడ్పడతాయి’ అని ప్రకటనలో దిగ్గజ నేతలు పేర్కొన్నారు. 2020 కల్లా పురుషులు, మహిళా ఉద్యోగుల మధ్య వ్యత్యాసాన్ని 25% మేర తగ్గించాలని జీ20 పేర్కొంది. తద్వారా 10 కోట్లకుపైగా మహిళా ఉద్యోగులు జతయ్యేలా చూడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. 2017కి ఆటోమేటిక్ పన్నుల సమాచార వ్యవస్థ పన్ను ఎగవేతలకు అడ్డుకట్టవేయడం కోసం సభ్య దేశాల మధ్య ఆటోమేటిక్‌గా పన్ను సంబంధ సమాచారాన్ని పంచుకునే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు జీ20 నాయకులు పేర్కొన్నారు. 2017కల్లా లేదంటే 2018 చివరినాటికి ఇది అందుబాటులోకి రావచ్చని ఒక ప్రకటనలో వెల్లడించారు. నల్లధనం జాడ్యానికి చెక్ చెప్పేందుకు ప్రపంచదేశాల సహకారం కోసం భారత్ పదేపదే అంతర్జాతీయ స్థాయిలో గొంతెంతున్న నేపథ్యంలో జీ20 సదస్సు దీనిపై దృష్టిపెట్టడం గమనార్హం. అదేవిధంగా కార్పొరేట్ కంపెనీల లాభాల తరలింపునకు చెక్ చెప్పడానికి కూడా తగిన కార్యాచరణను రూపొందిచాలని జీ20 దేశాలు నిర్ణయించాయి. 2015కల్లా ఇది ఖరారు కావచ్చని భావిస్తున్నారు. గ్లోబల్ ఇన్ఫ్రా హబ్ ఏర్పాటుకు అంగీకారం... ప్రపంచస్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు జీ20 నేతలు అంగీకరించారు. అంతర్జాతీయ సంస్థలు, అభివృద్ధి బ్యాంకులు, ప్రైవేటు రంగం, ప్రభుత్వాలు తమ ఆలోచనలు, నైపుణ్యాలను పంచుకునే వేదికగా, పెట్టుబడులకు అడ్డంకులు లేకుండా చేయడమే ఈ హబ్ ముఖ్యోద్దేశం. సిడ్నీలో దీన్ని నెలకొల్పనున్నారు. పెట్టుబడులను ఈ రంగంలోకి తీసుకొచ్చేందుకు మార్గాల అన్వేషణ, ఇన్ఫ్రా మార్కెట్ల నిర్వహణ, ఫైనాన్సింగ్‌ను మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఆయా దేశాల మధ్య సహకారాన్ని పెంచడానికి హబ్ తోడ్పాటునందిస్తుంది. నాలుగేళ్ల నిర్దేశిత కాలవ్యవధిని ఇందుకు నిర్ధేశించారు. ఈ హబ్ ద్వారా 2030 నాటికి గ్లోబల్ ఇన్ఫ్రా రంగంలో మరో 2 లక్షల కోట్ల డాలర్ల నిధులను ప్రవహింపజేసేందుకు వీలవుతుందని జీ20 దేశాలకు చెందిన బీ20 వ్యాపార దిగ్గజాల బృందం అంచనా వేసింది. రెమిటెన్స్‌ల చార్జీలను 5 శాతానికి తగ్గించాలి... ప్రవాశీయులు విదేశాల నుంచి స్వదేశానికి పంపే డబ్బు(రెమిటెన్స్) విషయంలో విధిస్తున్న చార్జీలను తగ్గించేందుకు కృషిచేస్తామని జీ20 హామీనిచ్చింది. ప్రపంచ సగటు రెమిటెన్స్ వ్యయాన్ని 5 శాతానికి తగ్గించేందుకు పటిష్టమైన , ఆచరణాత్మక చర్యలు చేపట్టాలని పేర్కొంది. కొన్ని దేశాల్లో రెమిటెన్స్‌లపై గరిష్టంగా 10 శాతం వరకూ చార్జీలు విధిస్తుండటాన్ని కూడా జీ20 ప్రస్తావించింది. సమీకృత ఆర్థికాభివృద్ధిని పెంచే చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. భారత్, ఇతర వర్ధమాన దేశాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని ఈ అంశాన్ని సదస్సు తన ప్రకటనలో చేర్చడం గమనార్హం. గతేడాది 71 బిలియన్ డాలర్ల రెమిటెన్సులతో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. -
భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం
అణు ఒప్పందంపై ఇరు దేశాల సంతకాలు అణు విద్యుత్ రంగంలో యురేనియం కొరత తగ్గినట్లే రెండేళ్లలో ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు అందనున్న యురేనియం ప్యాకేజీ న్యూఢిల్లీ: భారత్-ఆస్ట్రేలియాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ శుక్రవారం కీలక పౌర అణు ఒప్పందా న్ని కుదుర్చుకున్నాయి. దీనిద్వారా విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న భారత్‌కు అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన యురేనియంను ఆస్ట్రేలియా సరఫరా చేయనుంది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ శుక్రవారం ఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అణు ఒప్పందం సహా నాలుగు ఒప్పందాలపై ఇరుదేశాలూ సంతకాలు చేశాయి. రెండు దేశాల మధ్యా రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరువురు ప్రధానులూ నిర్ణయించారు. మూడో వంతు యురేనియం అక్కడే... ప్రపంచ వ్యాప్తంగా వెలికితీయగల యురేనియం వనరుల్లో మూడో వంతు ఒక్క ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. ఆ దేశం ఏటా 7,000 టన్నుల యురేనియంను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. అయితే భారత్‌పై యురేనియం ఎగుమతులు చేయటంపై ఆస్ట్రేలియా గతంలో నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని 2012లో తొలగించటంతో తాజాగా అణు ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులూ సంతకాలు చేశారు. అణు శక్తిని శాంతియుత రంగ అవసరాలకు వినియోగించటం లక్ష్యంగా ఈ ఒప్పందం ఖరారైంది. దీని ప్రకారం భారత్‌కు ఆస్ట్రేలియా సుదీర్ఘ కాలం పాటు యురేనియం సరఫరాతోపాటు, రేడియో ఐసోటోప్ల ఉత్పత్తి, అణు భద్రత, ఇతర రంగాల్లో సహకారం కూడా అందించనుంది. రెండేళ్లలో యురేనియం రాక... దేశంలోని అణు విత్యుత్ ప్లాంట్లలో సుమారు 4,680 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో 2,840 మెగావాట్ల విద్యుత్ దేశీయంగా లభ్యమయే యురేనియంతో ఉత్పత్తి అవుతుండగా.. మిగతా 1,840 మెగావాట్ల విద్యుత్‌ను దిగుమతి చేసుకున్న యురేనియంతో ఉత్పత్తి చేస్తున్నారు. అయితే.. డిమాండ్‌కు తగ్గట్లు యురేనియం సరఫరా లేకపోవటంతో ఈ అణు రియాక్టర్ల నుంచి పూర్తి సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నారు. మరికొన్ని కొత్త అణు విద్యుత్ ప్లాంట్లు నిర్మాణ దిశలో ఉన్నాయి. ఆస్ట్రేలియాతో ఒప్పందం ఫలితంగా యురేనియం కొరత తగ్గిపోనుందని అణు రంగ నిపుణులు చెప్తున్నారు. ఒప్పందం ప్రకారం రెండేళ్లలో ఆస్ట్రేలియా నుంచి తొలి విడత యురేనియం భారత్‌కు అందుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంలో భారత్‌కు తిరుగులేని చరిత్ర ఉందని, భారత్ ఆదర్శవంతమైన అంతర్జాతీయ దేశంగా కొనసాగుతోందని అబ్బాట్ ప్రశంసించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం గురువారం ముంబై చేరుకున్న ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్.. అక్కడ వ్యాపారవేత్తలు, భారత సీఈఓలతో సమావేశమై వాణిజ్య రంగంలో పరస్పర సహకారంపై చర్చించారు. రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిశారు. ఈ సందర్భంగా.. రెండు దేశాల మధ్యా అణు ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో కొత్త అధ్యాయానికి దారితీస్తాయని ప్రణబ్ హర్షం వ్యక్తంచేశారు. అనంతరం రాజ్‌ఘాట్, ఇండియాగేట్లను సందర్శించి మహాత్మాగాంధీ, అమరవీరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత సాయంత్రం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోడీతో టోనీ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా.. అణు ఒప్పందంతో పాటు, సాంకేతిక వృత్తి విద్యా శిక్షణ (టీవీఈటీ), జలవనరుల నిర్వహణ, క్రీడా రంగాల్లోనూ మరో మూడు ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. ఈ సమావేశానంతరం ఇరువురు ప్రధానులూ ఒక సంయుక్త ప్రకటన చేశారు. రక్షణ, భద్రత సహకారం బలోపేతం భారత్, ఆస్ట్రేలియా ఇరు దేశాల ప్రజలూ ఉగ్రవాద బాధితులేనని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన జాయింట్ వర్కింగ్ గ్రూప్ పనితీరును ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరువురూ బలమైన ఆకాంక్ష వెలిబుచ్చారు. 2015లో ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాల ప్రారంభానికి జరుగుతున్న ఏర్పాట్లను ఇరువురూ ఆహ్వానించారు. గాలిపోలి వార్షికోత్సవానికి ఆహ్వానం వచ్చే ఏడాది జరగనున్న గాలపోలి శతవార్షికోత్సవానికి హాజరు కావాల్సిందిగా నరేంద్రమోడీని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల ప్రధానమంత్రుల తరఫున టోనీ ఆహ్వానించారు. ఆ అల్లర్లకు మోడీని తప్పుపట్టరాదు: టోనీ గుజరాత్లో 2002 నాటి అల్లర్లకు నాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీని తప్పుపట్టరాదని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ వ్యాఖ్యానించారు. ఆయనపై అనంతమైన దర్యాప్తులు జరిగాయని, అవన్నీ ఆయనను నిర్దోషిగా చెప్పాయని టోనీ పేర్కొన్నారు. హెడ్‌లైన్స్ టుడే వార్తా చానల్లో కరణ్‌థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకున్న మోడీ, అబాట్ ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌లు శుక్రవారం తమ భేటీ సందర్భంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆస్ట్రేలియా ఉన్నితో చేసిన ‘నెహ్రూ జాకెట్’ను మోడీకి అబాట్ బహూకరించగా ప్రతిగా మోడీ... యోగాపై పుస్తకాన్ని అబాట్‌కు బహూకరించారు. కాగా, తమిళనాడులోని ఆలయాల నుంచి గతంలో చోరీకి గురైన విషయం తెలియక తమ దేశ కళా మందిరాలు కొనుగోలు చేసిన రెండు ప్రాచీన దేవతా విగ్రహాలను మోడీకి అబాట్ అప్పగించారు. ఇందుకుగానూ దేశ ప్రజల తరఫున మోడీ అబాట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 11-12వ శతాబ్దం నాటి నటరాజ కాంస్య విగ్రహంతోపాటు అలాగే 10వ శతాబ్దానికి చెందిన అర్ధనారీశ్వర విగ్రహాన్ని అబ్బాట్ మోడీకి అప్పగించారు. -
2016 నాటికి ఎఫ్‌టీఏపై చర్చలు పూర్తి
న్యూఢిల్లీ: సమగ్ర ఆర్థిక సహకారానికి ఉద్దేశించి భారత్‌తో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై చర్చలు 2016 నాటికల్లా ఒక కొలిక్కి రాగలవని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడులను పెంచుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. భారత పర్యటనలో భాగంగా పరిశ్రమ ప్రముఖులతో జరిగిన విందు సమావేశంలో అబాట్ ఈ విషయాలు తెలిపారు. 2012-13లో ద్వైపాక్షిక వాణిజ్యం 15 బిలియన్ డాలర్ల స్థాయిలో జరిగింది. వర్ధమాన ప్రజాస్వామ్య సూపర్‌పవర్‌గా ఎదుగుతున్న భారత్‌ని అలక్ష్యం చేయరాదని, ఇక్కడ పెట్టుబడులు మరింత పెంచుకోవాలని అబాట్ ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలకు సూచించారు. అటు అదానీ మైనింగ్ తమ దేశంలో తలపెట్టిన ప్రాజెక్టును పరోక్షంగా ప్రస్తావిస్తూ.. అంతా సవ్యంగా సాగితే వచ్చే ఏడాదికల్లా ఇది ప్రారంభం కావొచ్చన్నారు. ఆస్ట్రేలియన్ బొగ్గు ఊతంతో వచ్చే అర్ధశతాబ్దం పాటు 10 కోట్ల పైచిలుకు భారతీయులకు విద్యుత్ వెలుగులు ఇవ్వడానికి సాధ్యపడుతుందని చెప్పారు. మరోవైపు, ఆస్ట్రేలియా సంస్థలు చేసుకున్న మైనింగ్ లీజు దరఖాస్తులకు అనుమతుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేస్తామని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. -
ప్రజాస్వామ్య శక్తిగా భారత్!
ఆస్ట్రేలియా ప్రధాని అబాట్ ముంబై: భారత్ ‘ప్రజాస్వామ్య మహాశక్తి’గా రూపొందుతోందంటూ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ ప్రశంసించారు. కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధిలో దూసుకుపోతూ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోందన్నారు. భారత్‌లో వ్యాపారాభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయన్నారు. భారత్‌లో 2 రోజుల పర్యటనకు వచ్చిన టోనీ అబాట్ గురువారం ముంబైలో తనతో పాటు భారత్ వచ్చిన వ్యాపార, పారిశ్రామిక వేత్తలనుద్దేశించి ప్రసంగించారు. మోడీ చెబుతున్న ‘మేక్ ఇన్ ఇండియా’ తరహా పిలుపును ఆస్ట్రేలియా వాణిజ్యాభివృద్ధి కోసం తానూ ఇచ్చానన్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంత దేశాల మధ్య ఆర్థిక, సామాజిక సంబంధాలకోసం ఉద్దేశించిన ‘న్యూ కొలంబో ప్లాన్’ను ముంబై యూనివర్సిటీలో ప్రారంభించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరువాత సార్కేతర దేశాల నుంచి ఒక ప్రభుత్వాధినేత భారత్ పర్యటనకు రావడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పౌర అణు ఒప్పందం కుదరనుంది. దీని ద్వారా భారత్‌కు యురేనియం ను అమ్మేం దుకు ఆస్ట్రేలియాకు వీలవుతుంది. -
సచిన్ ను కలవనున్న ఆస్ట్రేలియా ప్రధాని
ముంబై: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ ఈ ఉదయం భారత వాణిజ్య రాజధాని ముంబైకి చేరుకున్నారు. రాజభవన్ లో మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావును ఆయన కలిశారు. హోటల్ తాజ్‌మహల్ ప్యాలెస్ వద్ద 26/11 అమరవీరులకు ఆయన నివాళి అర్పించారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను ఆసీస్ ప్రధాని కలవనున్నారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగే కార్యక్రమంలో అబాట్ తో పాటు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ఆడమ్ గిల్ క్రిస్ట్, బ్రెట్ లీ కూడా సచిన్ ను కలుస్తారు. ఈ మధ్యాహ్నం భారత వ్యాపారవేత్తలతో టోనీ అబాట్సమావేశం కానున్నారు. శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో ఆయన భేటీ అవుతారు. -
'ప్రమాదం కానే కాదు.. కుట్రపూరిత చర్యే'
మెల్ బోర్న్: ఉక్రెయిన్ విమాన ప్రమాదంపై రష్యా స్పందించిన తీరుపై ఆస్త్రేలియా ప్రధాని టోని ఆబాట్ మండిపడ్డారు. 28 ఆస్ట్రేలియన్లతోపాటు, 298 మంది మృత్యువాత పడ్డిన విమాన ప్రమాదంపై రష్యా స్పందించిన తీరుపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అసంతృప్తిని వెళ్లగక్కింది. మలేషియా ఎయిర్ లైన్ MH17 కూలిన ఘటన ప్రమాదం కానేకాదని.. అదో నేరపూరిత చర్య అని అబాట్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ విమాన దుర్ఘటనపై ఆస్ట్రేలియా పార్లమెంట్ లో చర్చ చేపట్టారు. విమాన ప్రమాదం ముమ్మాటికి కుట్రపూరిత చర్యే.. ప్రమాదం కాదని స్పీకర్ కు టోని అబాట్ వెల్లడించారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని అబాట్ విజ్క్షప్తి చేశారు. ప్రమాద ఘటనపై రష్యా రాయబారి స్పందించిన తీరుపై ఆయన మండిపడ్డారు. విమానాన్ని కూల్చివేతకు పాల్పడింది రష్యాకు చెందిన తిరుగుబాటుదారులేనని అబాట్ ఆరోపించారు. 295 మందితో అమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు బయల్దేరిన విమానాన్ని గురువారం సాయంత్రం ఉక్రెయిన్ గగనతలంపై పేల్చేవేసిన సంగతి తెలిసిందే. -
ఆస్ట్రేలియా ప్రధానిగా టోనీ అబోట్ ప్రమాణం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా 28వ ప్రధానిగా లిబరల్ పార్టీ నేత టోనీ అబోట్ (55) ప్రమాణస్వీకారం చేశారు. రాజధాని కాన్‌బెర్రాలోని గవర్నమెంట్ హౌస్‌లో గవర్నర్ జనరల్ క్వెంటిన్ బ్రైస్ బుధవారం ఆయన చేత ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు 18 మంది కేబినెట్ మంత్రులుగా, 11 మంది సహాయ మంత్రులుగా, 12 మంది పార్లమెంటరీ కార్యదర్శులుగా ప్రమాణం చేశారు. ‘‘మాకు ఓటు వేయని వారితోపాటు దేశ ప్రజలందరికీ మా అత్యుత్తమ సామర్థ్యం మేరకు సేవ చేస్తామని మేమంతా ప్రమాణం చేశాం. ప్రజాసమస్యలు పరిష్కరిస్తూ విలువలతో కూడిన ప్రభుత్వాన్ని నడుపుతాం’’ అని ప్రమాణస్వీకారం అనంతరం అబోట్ వ్యాఖ్యానించారు.