భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం | India and Australia seal civil nuclear deal for uranium trade | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం

Published Sat, Sep 6 2014 1:28 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం - Sakshi

భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం

అణు ఒప్పందంపై ఇరు దేశాల సంతకాలు
అణు విద్యుత్ రంగంలో యురేనియం కొరత తగ్గినట్లే
రెండేళ్లలో ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు అందనున్న యురేనియం ప్యాకేజీ

 
న్యూఢిల్లీ: భారత్-ఆస్ట్రేలియాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ శుక్రవారం కీలక పౌర అణు ఒప్పందా న్ని కుదుర్చుకున్నాయి. దీనిద్వారా విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న భారత్‌కు అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన యురేనియంను ఆస్ట్రేలియా సరఫరా చేయనుంది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ శుక్రవారం ఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అణు ఒప్పందం సహా నాలుగు ఒప్పందాలపై ఇరుదేశాలూ సంతకాలు చేశాయి. రెండు దేశాల మధ్యా రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని  పెంపొందించుకోవాలని ఇరువురు ప్రధానులూ నిర్ణయించారు.

మూడో వంతు యురేనియం అక్కడే...

ప్రపంచ వ్యాప్తంగా వెలికితీయగల యురేనియం వనరుల్లో మూడో వంతు ఒక్క ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. ఆ దేశం ఏటా 7,000 టన్నుల యురేనియంను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. అయితే భారత్‌పై యురేనియం ఎగుమతులు చేయటంపై ఆస్ట్రేలియా గతంలో నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని 2012లో తొలగించటంతో తాజాగా అణు ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులూ సంతకాలు చేశారు. అణు శక్తిని శాంతియుత రంగ అవసరాలకు వినియోగించటం లక్ష్యంగా ఈ ఒప్పందం ఖరారైంది. దీని ప్రకారం భారత్‌కు ఆస్ట్రేలియా సుదీర్ఘ కాలం పాటు యురేనియం సరఫరాతోపాటు, రేడియో ఐసోటోప్‌ల ఉత్పత్తి, అణు భద్రత, ఇతర రంగాల్లో సహకారం కూడా అందించనుంది.

రెండేళ్లలో యురేనియం రాక...

దేశంలోని అణు విత్యుత్ ప్లాంట్లలో సుమారు 4,680 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో 2,840 మెగావాట్ల విద్యుత్ దేశీయంగా లభ్యమయే యురేనియంతో ఉత్పత్తి అవుతుండగా.. మిగతా 1,840 మెగావాట్ల విద్యుత్‌ను దిగుమతి చేసుకున్న యురేనియంతో ఉత్పత్తి చేస్తున్నారు. అయితే.. డిమాండ్‌కు తగ్గట్లు యురేనియం సరఫరా లేకపోవటంతో ఈ అణు రియాక్టర్ల నుంచి పూర్తి సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నారు.  మరికొన్ని కొత్త అణు విద్యుత్ ప్లాంట్లు నిర్మాణ దిశలో ఉన్నాయి. ఆస్ట్రేలియాతో ఒప్పందం ఫలితంగా యురేనియం కొరత తగ్గిపోనుందని అణు రంగ నిపుణులు చెప్తున్నారు. ఒప్పందం ప్రకారం రెండేళ్లలో ఆస్ట్రేలియా నుంచి తొలి విడత యురేనియం భారత్‌కు అందుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంలో భారత్‌కు తిరుగులేని చరిత్ర ఉందని, భారత్ ఆదర్శవంతమైన అంతర్జాతీయ దేశంగా కొనసాగుతోందని అబ్బాట్ ప్రశంసించారు.

ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం

రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం గురువారం ముంబై చేరుకున్న ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్.. అక్కడ వ్యాపారవేత్తలు, భారత సీఈఓలతో సమావేశమై వాణిజ్య రంగంలో పరస్పర సహకారంపై చర్చించారు. రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిశారు. ఈ సందర్భంగా.. రెండు దేశాల మధ్యా అణు ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో కొత్త అధ్యాయానికి దారితీస్తాయని ప్రణబ్ హర్షం వ్యక్తంచేశారు. అనంతరం రాజ్‌ఘాట్, ఇండియాగేట్‌లను సందర్శించి మహాత్మాగాంధీ, అమరవీరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత సాయంత్రం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోడీతో టోనీ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా.. అణు ఒప్పందంతో పాటు, సాంకేతిక వృత్తి విద్యా శిక్షణ (టీవీఈటీ), జలవనరుల నిర్వహణ, క్రీడా రంగాల్లోనూ మరో మూడు ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. ఈ సమావేశానంతరం ఇరువురు ప్రధానులూ ఒక సంయుక్త ప్రకటన చేశారు.

రక్షణ, భద్రత సహకారం బలోపేతం

భారత్, ఆస్ట్రేలియా ఇరు దేశాల ప్రజలూ ఉగ్రవాద బాధితులేనని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన జాయింట్ వర్కింగ్ గ్రూప్ పనితీరును ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరువురూ బలమైన ఆకాంక్ష వెలిబుచ్చారు. 2015లో ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాల ప్రారంభానికి జరుగుతున్న ఏర్పాట్లను ఇరువురూ ఆహ్వానించారు.  

గాలిపోలి వార్షికోత్సవానికి ఆహ్వానం

వచ్చే ఏడాది జరగనున్న గాలపోలి శతవార్షికోత్సవానికి హాజరు కావాల్సిందిగా నరేంద్రమోడీని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల ప్రధానమంత్రుల తరఫున టోనీ ఆహ్వానించారు.

ఆ అల్లర్లకు మోడీని తప్పుపట్టరాదు: టోనీ

గుజరాత్‌లో 2002 నాటి అల్లర్లకు నాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీని తప్పుపట్టరాదని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ వ్యాఖ్యానించారు. ఆయనపై అనంతమైన దర్యాప్తులు జరిగాయని, అవన్నీ ఆయనను నిర్దోషిగా చెప్పాయని టోనీ పేర్కొన్నారు. హెడ్‌లైన్స్ టుడే వార్తా చానల్‌లో కరణ్‌థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
బహుమతులు ఇచ్చిపుచ్చుకున్న మోడీ, అబాట్

ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌లు శుక్రవారం తమ భేటీ సందర్భంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆస్ట్రేలియా ఉన్నితో చేసిన ‘నెహ్రూ జాకెట్’ను మోడీకి అబాట్ బహూకరించగా  ప్రతిగా మోడీ... యోగాపై పుస్తకాన్ని అబాట్‌కు బహూకరించారు. కాగా, తమిళనాడులోని ఆలయాల నుంచి గతంలో చోరీకి గురైన విషయం తెలియక తమ దేశ కళా మందిరాలు కొనుగోలు చేసిన రెండు ప్రాచీన దేవతా విగ్రహాలను మోడీకి అబాట్ అప్పగించారు. ఇందుకుగానూ దేశ ప్రజల తరఫున మోడీ అబాట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 11-12వ శతాబ్దం నాటి నటరాజ కాంస్య విగ్రహంతోపాటు అలాగే 10వ శతాబ్దానికి చెందిన అర్ధనారీశ్వర విగ్రహాన్ని అబ్బాట్ మోడీకి అప్పగించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement