జీ20 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఒబామాతో కరచాలనం చేస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్
వచ్చే ఐదేళ్లలో ప్రపంచ జీడీపీపై జీ20 దేశాధినేతల తీర్మానం
ఇన్‌ఫ్రాలో భారీ పెట్టుబడులు, వాణిజ్యం పెంపుతోనే సాధ్యం
బ్రిస్బేన్: రానున్న ఐదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ)కి 2 లక్షల కోట్ల డాలర్లను అదనంగా జతచేయాలని జీ20 దేశాధినేతలు నిర్దేశించారు. ఇందుకోసం మౌలిక సదుపాయాల రంగంలో భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యాన్ని గణనీయంగా పెంచడం వంటి చర్యలు చేపట్టాలని తీర్మానించారు. ఆదివారమిక్కడ జీ20 సదస్సు ముగింపు సందర్భంగా విడుదల చేసిన 3 పేజీల ప్రకటనలో ఈ అంశాలను పొందుపరిచారు.
అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలకు చెందిన 20 దేశాల కూటమే జీ20. ప్రపంచ ఆర్థిక వృద్ధిని పెంచడం, మెరుగైన జీవన ప్రమాణాలు, నాణ్యమైన ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు జీ20 ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర అగ్రనేతలు స్పష్టం చేశారు. ‘2018 కల్లా ప్రపంచ జీడీపీకి కనీసం మరో 2% వృద్ధిని జోడించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో 2 లక్షల కోట్ల డాలర్లు జతవుతుంది. మిలియన్లకొద్దీ ఉద్యోగాలను సృష్టించొచ్చు’ అని పేర్కొన్నారు. 2012 గణాంకాల ప్రకారం ప్రపంచ జీడీపీ విలువ 85 లక్షల కోట్ల డాలర్లు. ఇందులో జీ20 దేశాల వాటా 85% కావడం గమనార్హం.
సమీకృత అభివృద్ధిపై దృష్టి...
‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తగిన డిమాండ్ లేక అవస్థలుపడుతోంది. వృద్ధి పెంపునకు సరఫరాపరమైన అడ్డంకులను తొలగించాలి. ఫైనాన్షియల్ మార్కెట్లు, భౌగోళిక రాజకీయపరమైన ఉద్రిక్తతలు వంటి రిస్కులు పొంచిఉన్నాయి. ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి అంతర్జాతీయ సంస్థలు, వృద్ధికి ఊతమిచ్చేందుకు మేమంతా కట్టుబడి ఉన్నాం. పటిష్టమైన, స్థిరమైన, సమతూకంతోకూడిన వృద్ధితో పాటు ఉద్యోగాల కల్పన కోసం మరిన్ని చర్యలు తీసుకుంటాం.
నిర్మాణాత్మక సంస్కరణలు, ప్రైవేటు రంగ వ్యాపార కార్యకలాపాల పెంపు వంటి చర్యలను అమలు చేయనున్నాం. ఇవన్నీ సమీకృత అభివృద్ధితో పాటు ఆర్థిక అసమానతలు, పేదరికాన్ని తగ్గించేందుకు తోడ్పడతాయి’ అని ప్రకటనలో దిగ్గజ నేతలు పేర్కొన్నారు. 2020 కల్లా పురుషులు, మహిళా ఉద్యోగుల మధ్య వ్యత్యాసాన్ని 25% మేర తగ్గించాలని జీ20 పేర్కొంది. తద్వారా 10 కోట్లకుపైగా మహిళా ఉద్యోగులు జతయ్యేలా చూడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
2017కి ఆటోమేటిక్ పన్నుల సమాచార వ్యవస్థ
పన్ను ఎగవేతలకు అడ్డుకట్టవేయడం కోసం సభ్య దేశాల మధ్య ఆటోమేటిక్‌గా పన్ను సంబంధ సమాచారాన్ని పంచుకునే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు జీ20 నాయకులు పేర్కొన్నారు. 2017కల్లా లేదంటే 2018 చివరినాటికి ఇది అందుబాటులోకి రావచ్చని ఒక ప్రకటనలో వెల్లడించారు. నల్లధనం జాడ్యానికి చెక్ చెప్పేందుకు ప్రపంచదేశాల సహకారం కోసం భారత్ పదేపదే అంతర్జాతీయ స్థాయిలో గొంతెంతున్న నేపథ్యంలో జీ20 సదస్సు దీనిపై దృష్టిపెట్టడం గమనార్హం. అదేవిధంగా కార్పొరేట్ కంపెనీల లాభాల తరలింపునకు చెక్ చెప్పడానికి కూడా తగిన కార్యాచరణను రూపొందిచాలని జీ20 దేశాలు నిర్ణయించాయి. 2015కల్లా ఇది ఖరారు కావచ్చని భావిస్తున్నారు.
గ్లోబల్ ఇన్‌ఫ్రా హబ్ ఏర్పాటుకు అంగీకారం...
ప్రపంచస్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు జీ20 నేతలు అంగీకరించారు. అంతర్జాతీయ సంస్థలు, అభివృద్ధి బ్యాంకులు, ప్రైవేటు రంగం, ప్రభుత్వాలు తమ ఆలోచనలు, నైపుణ్యాలను పంచుకునే వేదికగా, పెట్టుబడులకు అడ్డంకులు లేకుండా చేయడమే ఈ హబ్ ముఖ్యోద్దేశం. సిడ్నీలో దీన్ని నెలకొల్పనున్నారు. పెట్టుబడులను ఈ రంగంలోకి తీసుకొచ్చేందుకు మార్గాల అన్వేషణ, ఇన్‌ఫ్రా మార్కెట్ల నిర్వహణ, ఫైనాన్సింగ్‌ను మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఆయా దేశాల మధ్య సహకారాన్ని పెంచడానికి హబ్ తోడ్పాటునందిస్తుంది. నాలుగేళ్ల నిర్దేశిత కాలవ్యవధిని ఇందుకు నిర్ధేశించారు. ఈ హబ్ ద్వారా 2030 నాటికి గ్లోబల్ ఇన్‌ఫ్రా రంగంలో మరో 2 లక్షల కోట్ల డాలర్ల నిధులను ప్రవహింపజేసేందుకు వీలవుతుందని జీ20 దేశాలకు చెందిన బీ20 వ్యాపార దిగ్గజాల బృందం అంచనా వేసింది.
రెమిటెన్స్‌ల చార్జీలను 5 శాతానికి తగ్గించాలి...
ప్రవాశీయులు విదేశాల నుంచి స్వదేశానికి పంపే డబ్బు(రెమిటెన్స్) విషయంలో విధిస్తున్న చార్జీలను తగ్గించేందుకు కృషిచేస్తామని జీ20 హామీనిచ్చింది. ప్రపంచ సగటు రెమిటెన్స్ వ్యయాన్ని 5 శాతానికి తగ్గించేందుకు పటిష్టమైన , ఆచరణాత్మక చర్యలు చేపట్టాలని పేర్కొంది. కొన్ని దేశాల్లో రెమిటెన్స్‌లపై గరిష్టంగా 10 శాతం వరకూ చార్జీలు విధిస్తుండటాన్ని కూడా జీ20 ప్రస్తావించింది. సమీకృత ఆర్థికాభివృద్ధిని పెంచే చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. భారత్, ఇతర వర్ధమాన దేశాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని ఈ అంశాన్ని సదస్సు తన ప్రకటనలో చేర్చడం గమనార్హం. గతేడాది 71 బిలియన్ డాలర్ల రెమిటెన్సులతో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది.