ఆస్ట్రేలియా నూతన ప్రధానమంత్రి మాల్కం టర్న్బుల్
- ఆస్ట్రేలియాలో మరోసారి మారిన రాజకీయసమీకరణాలు
- లిబరల్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో ఓడి పదవి కోల్పోయిన టోనీ అబాట్.. నూతన ప్రధానిగా మాల్కమ్ టర్న్బుల్
ప్రపంచంలోనే ధనిక దేశాల జాబితాలో టాప్ 10లో ఒకటైన ఖండదేశం ఆస్ట్రేలియాలో గడిచిన రెండేళ్లుగా అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది గంటల కిందట (సోమవారం సాయంత్రం) ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ పదవి కోల్పోవడం తప్పనిసరి కావటం ఆ పరిణామాలకు పరాకాష్ట.
గడిచిన రెండేళ్లలో ఆస్ట్రేలియాకు ముగ్గురు ప్రధానులు మారారు. (లేబర్ పార్టీలో నాయకత్వ మార్పుతో 2013లో జూలీ గిలార్డ్ ప్రధాని పదవిని కోల్పోయారు. ఆమె స్థానంలో కెవిన్ రూడ్ అత్యున్నత పదవిని చేపట్టారు. ఆ తర్వాత కొద్ది నెలలకే సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. లిబరల్ పార్టీ విజయం సాధించింది. టోనీ అబాట్ ప్రధానిగా ప్రమాణం చేశారు) ఇప్పుడు అబాట్ స్థానంలో గద్దెనెక్కనున్న మాల్కం టర్న్ బుల్ తో కలిపితే ఆ సంఖ్య నాలుగుకు చేరుతుంది. అబాట్ ఉన్నపళంగా ఎందుకు దిగిపోవాల్సి వచ్చిందంటే..
తాను నేతృత్వం వహిస్తున్న లిబరల్ పార్టీ నాయకత్వ పోటీలో ఓడిపోయినందున అబాట్ ప్రధాని పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ప్రధాన మంత్రి లాంటి అత్యున్నత పదవి చేపట్టే వ్యక్తే.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి కూడా నాయకుడిగా ఉండాలనేది ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న రాజకీయ నియమం.
లేబర్ పార్టీని ఓడించి 2013లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న లిబరల్ పార్టీకి టోనీ అబాట్ నాయకుడు. అలా ఆయన ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడంతోపాటు ఆర్థికంగా దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో అబాట్ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఆయన నాయకత్వంపై తిరుగుబాటు మొదలైంది.
అబాట్ క్యాబినెట్ లో కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేసిన మాల్కం టర్న్ బుల్... వైరి వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 18న జరిగిన లిబరల్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో 54- 44 ఓట్ల తేడాతో అబాట్ పై మాల్కం విజయం సాధించారు. దీంతో అబాట్ పదవి నుంచి వైదొలగక తప్పలేదు.'టోనీ అబాట్ గవర్నర్ కు రాజీనామాలేఖ సమర్పించడమే ఆలస్యం.. నేను ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తాను' అని మాల్కం టర్న్ బుల్ సోమవారం కాన్ బెర్రాలో విలేకరులతో అన్నారు.
ఫైటర్.. టర్న్బుల్..
న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి వ్యాపారవేత్తగానూ విజయం సాధించిన మాల్కం టర్న్ బుల్.. లిబరల్ పార్టీలో చేరి అనతికాలంలోనే ఉన్నతస్థాయికి ఎదిగారు. 2008-09లో ప్రతిపక్ష నేతగా లేబర్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. గే వివాహ చట్టం, వాతావరణ మార్పులు తదితర అంశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీతో మొట్టికాయలు తిన్నారు. కమ్యూనికేషన్ల మంత్రిగా ఉంటూనే అబాట్ తీరును నిరసించారు. సమర్థ నాయకత్వం లేనిదే ఆస్ట్రేలియా మనుగడ సాధించలేదన్న వాదనతో పార్టీని మెప్పించి ప్రధాన మంత్రి పదవికి అర్హత సాధించారు. నిజానికి 2013లోనే మాల్కం ప్రధాని కావల్సింది. కానీ ఒక్క ఓటు తేడాతో టోనీ అబాట్ లిబరల్ పార్టీ అధ్యక్షుడిగా గెలవడంతో ఛాన్స్ మిస్ అయింది.