సిడ్నీలో హైటెన్షన్, రెచ్చిపోయిన ఆగంతకులు
సిడ్నీ : ఆస్ట్రేలియా సిడ్నీలో ఆగంతకులు రెచ్చిపోయారు. దాంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. నగరంలోని మార్టిన్ ప్లేస్లోని ఓ కేఫ్లో 13మందిని ఆగంతకులు నిర్బంధించారు. దాంతో పోలీసులు కేఫ్ చుట్టుముట్టి నిర్బంధంలో ఉన్నవారిని విడిపించేందుకు యత్నిస్తున్నారు. దుండగుల అదుపులో డజన్ల సంఖ్యలో వ్యక్తులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఒపెరా హౌస్ ను ఖాళీ చేయించారు. లోపల ఉన్న దుండగుల వద్ద ఉన్న జెండాల్లో అరబిక్ అక్షరాలను బట్టి వాళ్లు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా పోలీసులు భావిస్తున్నారు.
కాగా ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని టోనీఅబాట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఆయన సమీక్షించారు. జాతీయ భద్రతా దళాలను సంఘటనా స్థలానికి పంపినట్లు తెలిపారు. మరోవైపు జాతీయ భద్రతా దళాలు అక్కడకు చేరుకుని... చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేయించారు. నిర్బంధంలో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకురావటమే తమ లక్ష్యమన్నారు. సిడ్ని నగరంపై ఏ విమానాలు తిరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. భద్రతా బలగాలు సిడ్ని వ్యాపార కేంద్రాన్ని చుట్టుముట్టాయి.