విశ్వకాంత్ అంకిరెడ్డి సురక్షితం
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో కిడ్నాపర్ చెరలో బందీగా ఉన్న గుంటూరు జిల్లా వాసి విశ్వకాంత్ అంకిరెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. సాయుధ బలగాలు ఆయనను సురక్షితంగా విడిపించాయి. లింట్డ్ కేఫ్ లో బందీలు ఉన్నవారందరినీ కమెండోలు బయటకు తీసుకొచ్చారు.
మొత్తం 15 మంది బందీలను విడిపించినట్టు సమాచారం. 16 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బందీలను విడిపించారు. వీరిలో భారతీయుడు పుష్పేందు ఘోష్ కూడా ఉన్నారు. సాయుధ కమెండోలు, కిడ్నాపర్ కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని సిడ్నీ పోలీసులు ప్రకటించారు.
కిడ్నాపర్ షేక్ మన్ హారొన్ మోనిస్, మరొక బందీ మృతి చెందినట్టు సమాచారం. విశ్వకాంత్ సురక్షితంగా బయపడ్డారన్న సమాచారంతో గుంటూరు జిల్లాలో ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.