సిడ్నీ దుండగుడు.. ఇరానీగా గుర్తింపు!
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సహా పలువురిని కిడ్నాప్ చేసిన దుండగుడిని ఎట్టకేలకు గుర్తించారు. షేక్ మన్ హారొన్ మోనిస్ అనే పాత నేరస్థుడే ఈ పనికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అతడికి ఇప్పటికే చాలా నేరచరిత్ర ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పలు నేరాల్లో ఇంతకుముందు శిక్షలు కూడా అనుభవించాడని ఆ వర్గాలు చెప్పాయి. అతడు ఇరాన్ దేశానికి చెందిన రాడికల్ ముస్లిం నాయకుడని, ఏడుగురు మహిళలను లైంగికంగా వేధించాడని సమాచారం. అఫ్ఘానిస్థాన్ లో ఆస్ట్రేలియన్ బలగాల మోహరింపునకు నిరసనగా ఈ కిడ్నాప్ తతంగానికి పాల్పడినట్లు తెలిసింది. 1996 సంవత్సరంలోనే అతడు ఇరాన్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చినట్లు చెబుతున్నారు.
భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4.10 గంటల సమయంలో 13 మందిని అపహరించిన మోనిస్.. వారిని ఓ కేఫ్లో ఉంచాడు. అయితే వాళ్లలో ఐదుగురు మాత్రం ఎలాగోలా తప్పించుకోగలిగారు. గుంటూరు జిల్లాకు చెందిన అంకిరెడ్డి విశ్వకాంత్ సహా మరికొందరు మాత్రం ఇంకా మోనిస్ అదుపులోనే ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్తోనే తాను చర్చలు జరుపుతానని అతడు డిమాండ్ చేస్తున్నాడు.