న్యూఢిల్లీ: సిడ్నీలో ఓ కేఫ్ లో కి ఆగంతకులు చొరబడి కొంతమందిని బందీలుగా నిర్భందించిన అంశం కలకలం సృష్టిస్తోంది. ఐఎస్ఐఎస్ఐ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నఆగంతకులు సోమవారం ఉదయం మార్టిన్ ప్లేస్లోని ఓ కేఫ్లో ప్రవేశించి అందులో ఉన్న కొంతమందిని బందీలుగా నిర్భందించారు. వారిలో ఒక భారతీయ ఇంజనీర్ కూడా బందీగా చిక్కుకున్నాడు. ఆయనను గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పిడుగురాళ్ల మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన విశ్వకాంత్ అంకిరెడ్డి ఈ బందీలలో ఉన్నట్లు తాజాగా తెలిసింది. ఆయన అక్కడ ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేస్తున్నారు.
విశ్వకాంత్ కూడా ఆగంతకుల చిక్కుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ మేరకు తమకు సమాచారం కూడా అందిందని ఆయన స్పష్టం చేశారు. బందీలుగా పట్టుబడిన వారిని విడిపించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది. ఇప్పటికే అధికారులు వారితో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, తాము ప్రధాని టోనీ అబాట్ తో మాట్లాడాలని ఆగంతకులు డిమాండ్ చేస్తున్నారు.