స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతోలాభమెంత..?
కేంద్రం ఉన్నత స్థాయి సమావేశం
న్యూఢిల్లీ: వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల(ఎఫ్‌టీఏ) వల్ల భారత్‌కన్నా ఇతర దేశాలకే ఎక్కువ లాభం జరుగుతోందన్న వార్తల నేపథ్యంలో మంగళవారం కేంద్రం దీనిపై ఒక అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ, ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణ్యం, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, వాణిజ్య కార్యదర్శి రీటా తియోటియా తదితర ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం భారత్ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పనలకు సంబంధించి ఎఫ్‌టీఏల ప్రభావంపై సమగ్రంగా చర్చించింది. మరిన్ని వివరాలు చూస్తే...
⇒ ఎఫ్‌టీఏల పనితీరుపై సీఈఏ అరవింద్ సుబ్రమణ్యం ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు.
⇒ ఎఫ్‌టీఏలపై సమీక్ష నిరంతర ప్రక్రియలో ఒకటని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఎగుమతుల వృద్ధికి సంబంధించి రూపాయి విలువ తగ్గింపు అంశంపై ఏదైనా చర్చ జరిగిందా అన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ, ‘అలాంటి ప్రతిపాదనే లేదు. నేను దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు’ అని అన్నారు.
⇒ ఉపాధి అవకాశాలపై ఎఫ్‌టీఏల ప్రభావంపై సంబంధిత పారిశ్రామిక వర్గాల అభిప్రాయాలను తీసుకోవాలని సమావేశం నిర్ణయించినట్లు సమాచారం.
⇒ ఎగుమతుల వృద్ధి క్షీణ ధోరణిపై ఆందోళనగా ఉన్న వాణిజ్య మంత్రిత్వశాఖ దీని నిరోధానికి త్రిముఖ వ్యూహం అవలంబించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో ఒకటి అత్యుత్తమ ఎక్స్ఛేంజ్ రేటు రూపకల్పన. రెండు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రవాణా రేట్లలో సవరణలు, వీసా వ్యవస్థ సరళీకరణ మూడవది.