ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను (ఐఎల్‌ఎఫ్‌ఎస్) గాడిన పెట్టే దిశగా కొత్త బోర్డు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పరిష్కార ప్రణాళిక రూపకల్పన, అమలు కోసం మూడు సంస్థలను అడ్వైజర్లుగా నియమించింది. ఆర్ప్‌వుడ్ క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్ సంస్థలను ఆర్థిక అంశాలు.. ఇతరత్రా లావాదేవీల సలహాదారులుగా (ఎఫ్‌టీఏ), అల్వారెజ్ అండ్ మార్సల్ (ఏఅండ్‌ఎం) సంస్థను పునర్‌వ్యవస్థీకరణపై అడ్వైజరుగా నియమించినట్లు కంపెనీ తెలిపింది.
వివిధ విభాగాల విక్రయం, వేల్యుయేషన్స్ మదింపు తదితర అంశాలపై రెండు ఎఫ్‌టీఏలు పనిచేస్తాయని వివరించింది. మరోవైపు గ్రూప్ కంపెనీల్లో అన్ని స్థాయుల్లో రోజువారీ లిక్విడిటీ పరిస్థితుల నిర్వహణ, నియంత్రణ అంశాలను ఏఅండ్‌ఎం పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే టర్న్ అరౌండ్ వ్యూహాన్ని రూపొందించే బాధ్యతలను కూడా ఏఅండ్‌ఎంకు ఐఎల్‌ఎఫ్‌ఎస్ అప్పగించింది. దాదాపు రూ.91,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ సంస్థలు పలు రుణాల చెల్లింపుల్లో డిఫాల్టయ్యాయి. ఈ పరిణామాలు స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేయడం, మరిన్ని ప్రతికూల పరిణామాలను నివారించేందుకు గ్రూప్ అజమాయిషీ బాధ్యతలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment