ILFS
-
బ్యాంకులపై ‘బెయిల్ అవుట్’ భారం!
హైదరాబాద్: నష్టాల్లో ఉన్న సంస్థల తీవ్ర మొండిబకాయిలు (ఎన్పీఏ) భారీ రాయితీలతో పరిష్కారం ఒకవైపు, యస్ బ్యాంక్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లకు ‘బెయిల్ అవుట్లు’ మరోవైపు... ఇలా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ తీవ్ర సవాళ్లలో కూరుకుపోతోందని యూఎఫ్‌బీయూ (యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్) విమర్శించింది. దీనితోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ (పీఎస్బీ) ప్రైవేటీకరణ, విలీనాల వంటి ప్రతికూల నిర్ణయాలను కేంద్రం తీసుకోవడం తగదని స్పష్టం చేసింది. ఆయా విధానాలకు నిరసనగా ఈ నెల 16, 17 తేదీల్లో సమ్మ తప్పదని పేర్కొంది. ఈ మేరకు యూఎఫ్‌బీయూ కన్వీనర్ బీ రాంబాబు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2021ని యూఎఫ్‌బీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ► 13 కార్పొరేట్ల రుణ బకాయిలు రూ.4,86,800 కోట్లు. అయితే భారీ రాయితీలతో రూ.1,61,820 కోట్లకే రుణ పరిష్కారం జరిగింది. వెరసి బ్యాంకులకు రూ.2,84,980 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ► సంక్షోభంలో ఉన్న ప్రైవేటు రంగ బ్యాంకులను నిధుల పరంగా గట్టెక్కించడానికి (బెయిల్ అవుట్) గతంలోనూ, వర్తమానంలోనూ ప్రభుత్వ రంగ బ్యాంకులనే వినియోగించుకోవడం జరిగింది. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, యునైటెడ్ వెస్ట్రన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కరాద్‌లు ఇందుకు గత ఉదాహరణలుకాగా, ఇప్పుడు యస్‌బ్యాంక్‌ను రక్షించడానికి ప్రభుత్వ రంగ ఎస్బీఐని వినియోగించుకోవడం జరిగింది. ప్రైవేటు రంగ దిగ్గజ ఎన్బీఎఫ్సీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ బెయిల్ అవుట్‌కు ఎస్బీఐ, ఎల్ఐసీలను వినియోగించుకోవడం జరిగింది. ► ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న యోచన సరికాదు. జన్ ధన్, నిరుద్యోగ యువత కోసం ముద్ర, వీధి వ్యాపారుల కోసం స్వధన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన వంటి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల విజయవంతానికి మెజారిటీ భాగస్వామ్యం ప్రభుత్వ రంగ బ్యాంకులదే కావడం గమనార్హం. ► ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల దేశంలోని సామాన్య ప్రజలు, వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. ► బ్యాంకులను ప్రైవేటీకరించే బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే పక్షంలో, బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మెతో ఎటువంటి చర్యలకైనా దిగేందుకు బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు సిద్ధమవుతారు. ప్రైవేటీకరణ విధానం ప్రజల ప్రయోజనాలకు మంచిదికాదు. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణ లాభాలు పటిష్టంగా ఉన్నప్పటికీ, బ్యాంకులు తీవ్రమైన భారీ మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎన్‌పీఏల్లో ప్రధాన వాటా పెద్ద కార్పొరేట్‌దే కావడం గమనార్హం. -
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంస్థపై దివాలా పిటిషన్
సింగపూర్: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐటీఎన్‌ఎల్) విదేశీ అనుబంధ సంస్థ ఐటీఎన్‌ఎల్ ఆఫ్‌షోర్ పీటీఈ లిమిటెడ్‌పై సింగపూర్ కోర్టులో గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్ఎస్బీసీ దివాలా అస్త్రాన్ని ప్రయోగించింది. సంస్థపై ‘వైండింగ్ అప్’ పిటిషన్ దాఖలు చేసింది. రూ.1,000 కోట్లకుపైగా బకాయిలు రాబట్టే క్రమంలో హెచ్ఎస్బీసీ ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లోని ఒక సంస్థపై ఈ తరహా పిటిషన్ దాఖలు కావడం ఇదే తొలిసారి. ఐటీఎన్‌ఎల్ ఆఫ్‌షోర్ పీటీఈ లిమిటెడ్ జారీచేసిన 1,000 మిలియన్ల చైనా యువాన్ల (రూ.1,050 కోట్లకుపైగా) విలువైన బాండ్లలో హెచ్ఎస్బీసీ పెట్టుబడులు పెట్టింది. నిజానికి ఈ బాండ్లు 2021లో మెచ్యూరిటీకి వస్తాయి. -
బ్యాంకింగ్ ‘బాండ్’!
న్యూఢిల్లీ: రుణాల విషయంలో కార్పొరేట్ సంస్థలు మోసాలకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో బ్యాంకులు రూటు మార్చుకుంటున్నాయి. కేవలం రుణాలు జారీ చేయడానికే పరిమితమై పోకుండా, తీసుకున్న రుణాలను కంపెనీలు ఏ విధంగా వినియోగిస్తున్నాయనేది పర్యవేక్షించేందుకు వెలుపలి ఏజెన్సీల సాయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర బ్యాంకులతో కలసి కన్సార్షియం కింద జారీ చేసే రూ.250 కోట్లకు మించిన రుణాల విషయంలో ఏజెన్సీ సేవలను వినియోగించుకోవాలని అనుకుంటున్నాయి. భూషణ్ పవర్ అండ్ స్టీల్ రుణం రూపంలో మోసం చేసినట్టు వెలుగు చూడడం, కంపెనీల ఆర్థిక అంశాలపై కచ్చితమైన సమాచారం విషయంలో రేటింగ్ ఏజెన్సీలు విఫలమవుతున్న నేపథ్యంలో... ఫోరెన్సిక్ ఆడిట్ తరహాలో కంపెనీల ఖాతాలపై సర్వే కోసం ఏజెన్సీలను నియమించుకోవాల్సిన అవసరం ఉందని రెండు అగ్ర స్థాయి ప్రభుత్వరంగ బ్యాంకర్లు తెలిపారు. ప్రస్తుతం అయితే కన్సార్షియం కింద రుణాలను జారీ చేసిన తర్వాత బ్యాంకులు... ప్రధానంగా రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే రేటింగ్‌లు, కంపెనీలు ఇచ్చే సమాచారానికే పరిమితం అవుతున్నాయి. వీటి ఆధారంగానే ఆయా కంపెనీల ఆర్థిక ఆరోగ్యాన్ని అంచనా వేస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) స్థాయిలో చర్చ జరిగిందని, అకౌంటింగ్ సంస్థలను నియమించుకోవడం ఈ ప్రతిపాదనలో భాగమని బ్యాంకరు తెలిపారు. ఇప్పటికే ఐబీఏ 75 సంస్థలను కూడా గుర్తించి బ్యాంకుల స్థాయిలో పంపిణీ చేయడం జరిగినట్టు చెప్పారు. ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో... ‘‘ఇది నూతన యంత్రాంగం. ఇప్పటికే అకౌంటింగ్ సంస్థలను గుర్తించాం. తీసుకున్న రుణాలను కంపెనీలు వినియోగించే తీరుపై ఎప్పటికప్పుడు ఇవి పర్యవేక్షణ నిర్వహిస్తాయి. అలాగే, క్రమం తప్పకుండా బ్యాంకులకు నివేదికల రూపంలో తెలియజేస్తాయి’’ అని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో అశోక్ కుమార్ ప్రధాన్ తెలిపారు. ఇప్పటికైతే తాము అందుకున్న స్టేట్మెంట్స్పై ఎక్కువగా వివరాలు వెల్లడించలేమంటూ... సంబంధిత ఆడిటింగ్ సంస్థలు కంపెనీల పుస్తకాలను పరీక్షిస్తాయని, ఇది ఫోరెన్సిక్ ఆడిట్ తరహాలో ఉంటుందన్నారు. కంపెనీల పుస్తకాల్లోని లోపాలను గుర్తించే విషయంలో రేటింగ్ ఏజెన్సీలు సమర్థవంతంగా వ్యవహరించడం లేదని గతేడాది సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ పరిణామంతో వెలుగు చూసింది. రుణాల చెల్లింపుల్లో ఈ సంస్థ వరుసగా విఫలం కావడం, రేటింగ్ ఏజెన్సీలు ముందుగా ఈ విషయాలను గుర్తించలేకపోయిన విషయం తెలిసిందే. ఖాతాల్లోని ఆర్థిక ఇబ్బందులు రేటింగ్‌ల్లో ప్రతిఫలించకుండా ఉండేందుకు ఐఎల్ఎఫ్ఎస్ సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు, రేటింగ్ ఏజెన్సీల ఉద్యోగులను ప్రలోభపెట్టినట్టు గ్రాంట్ థార్న్టన్ ఫోరెన్సిక్ ఆడిట్లో ప్రాథమికంగా వెలుగు చూసింది. ‘‘పర్యవేక్షణ బాధ్యత అన్నది రేటింగ్ ఏజెన్సీలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటి రేటింగ్‌లు బ్యాంకులతోపాటు వాటాదారులకూ ఎంతో ముఖ్యమైనవి. కానీ, ఇప్పుడున్న విధానంలో ఇది ఫలితాలను ఇవ్వడం లేదు. ఎక్స్టర్నల్ ఏజెన్సీలను నియమించుకోవాలని ఐబీఏ యోచిస్తుండడం వెనుక కారణం ఇదే. భూషణ్ పవర్ మోసం వెలుగు చూడడంతో ఈ విధానాన్ని వెంటనే అమల్లో పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని సిండికేట్ బ్యాంకు ఎండీ, సీఈవో మృత్యుంజయ మహపాత్ర పేర్కొన్నారు. -
ఐఎల్ఎఫ్ఎస్లో 13 వేల కోట్ల అవకతవకలు
న్యూఢిల్లీ: ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపులో రూ.13,000 కోట్ల మేర అక్రమాలు చోటు చేసుకున్నట్టు గ్రాంట్ థార్న్టన్ సంస్థ ఆడిట్లో వెలుగుచూసింది. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపునకు 24 డైరెక్ట్ సబ్సిడరీలతోపాటు, 135 పరోక్ష సబ్సిడరీలున్నాయి. అలాగే, ఆరు జాయింట్ వెంచర్ కంపెనీలు, నాలుగు అసోసియేట్ కంపెనీలతో కూడిన ఈ గ్రూపునకు రూ.94,000 కోట్ల రుణ భారం ఉంది. మంజూరైన రుణాలను గ్రూపు కంపెనీలు అప్పటికే ఉన్న రుణాల చెల్లింపులకు 29 సందర్భాల్లో వినియోగించినట్టు ఆడిటింగ్‌లో తేలింది. ఈ మొత్తం రూ.2,502 కోట్లు అని గ్రాంట్ థార్న్టన్ నివేదిక పేర్కొంది. 2013 ఏప్రిల్ 1 నుంచి 2018 సెప్టెంబర్ 30 వరకు జరిగిన అధిక విలువ లావాదేవీలను ఈ నివేదిక ప్రస్తావించింది. రిస్క్ టీమ్ ప్రతికూల అంచనాలను పేర్కొన్నప్పటికీ రూ. 2,400 కోట్లకు పైగా రుణాలను మంజూరు చేయ డం జరిగినట్టు పేర్కొంది. అక్రమంగా జరిగిన పలు లావాదేవీల మొత్తం రూ.13,290 కోట్లని వెల్లడించింది. స్వల్పకాల అవసరాల కోసం తీసుకున్న రూ.541 కోట్ల రుణాలను దీర్ఘకాల అవసరాల కోసం వినియోగించినట్టు ఈ సంస్థ గుర్తించింది. ‘‘అస్సెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశ వివరాలను సమీక్షించడం ద్వారా నిధుల్లో అంతరాలను గుర్తించాం. ఈ వివరాల ఆధారంగా చూస్తే 2013 మే నుంచి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అప్పటికే తీసుకున్న రుణాల చెల్లింపుల కోసం మరిన్ని రు ణాలను తీసుకునే ఒత్తిడిలో ఉందని తెలిసింది’’ అని గ్రాంట్ థార్న్టన్ నివేదిక పేర్కొంది. 2018 జూలైలో నిధుల పరంగా మరింత ఎక్కువ అంతర ం ఉందని తెలిపింది. ఐఎల్ఎఫ్ఎస్ చైర్మన్ రవి పార్థసార«థి 2018 జూలై 21న రాజీనామా చేయ డం గమనార్హం. గతేడాది ఆగస్టు నుంచి ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపు రుణ చెల్లింపులు చేయలేకపోవడంతో అక్రమాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. -
అనుమతి లేకుండా మొండిబాకీలుగా ప్రకటించొద్దు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇన్ఫ్రా రుణాల సంస్థ ఐఎల్ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థల ఖాతాలను తమ అనుమతి లేకుండా మొండిపద్దుల కింద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రకటించరాదని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఆదేశించింది. సంస్థ రుణ పరిష్కార ప్రణాళిక సజావుగా జరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. దాదాపు రూ. 90,000 కోట్ల పైచిలుకు రుణభారం పేరుకుపోయిన ఐఎల్ఎఫ్ఎస్ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కొత్త మేనేజ్మెంట్.. ఆస్తుల విక్రయ ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రణాళిక అమలు కోసం ట్రిబ్యునల్‌ను కేంద్ర ప్రభుత్వం ఆశ్రయించిన నేపథ్యంలో ఎన్సీఎల్ఏటీ తాజా ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌లో కాస్త మెరుగ్గా ఉన్న 22 కంపెనీలు తమ తమ రుణాల చెల్లింపు ప్రక్రియలను యథావిధిగా కొనసాగించేందుకు ఫిబ్రవరి 11న హియరింగ్‌లో ఎన్సీఎల్ఏటీ అనుమతించింది. అలాగే, రుణ పరిష్కార ప్రక్రియ పర్యవేక్షణకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ నియామకానికి ఆమోదముద్ర వేసింది. -
ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభంపై ఎంక్వైరీ కమిషన్ వేయాలి
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వ్యవహారంపై ప్రత్యేకంగా ఎంౖMð్వరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ ఆర్థికాంశాల స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఈ వివాదంలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల పాత్రపైనా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సీనియర్ కాంగ్రెస్ నేత ఎం వీరప్ప మొయిలీ నేతృత్వంలోని స్థాయీ సంఘం ఈ మేరకు పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. ‘ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. సంక్షోభానికి కొన్నాళ్ల ముందే గ్రూప్ సంస్థలకు ఓవర్ రేటింగ్ ఇచ్చిన రేటింగ్ ఏజెన్సీలతో పాటు గ్రూప్‌లో అతి పెద్ద వాటాదారు ఎల్ఐసీ సహా ఇతరత్రా సంస్థాగత వాటాదారుల పాత్రపైనా విచారణ జరపాల్సిన అవసరం ఉంది‘ అని కమిటీ పేర్కొంది. ఇక, దేశీయంగా ఇన్ఫ్రా ప్రాజెక్టులకు భారీ స్థాయిలో రుణాలిస్తున్న కంపెనీ కావడంతో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కార్యకలాపాలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించింది. కంపెనీలు ఎల్లకాలం ఒకే రేటింగ్ ఏజెన్సీని కొనసాగించేలా కాకుండా ఆడిటర్ల తరహాలో వీటికి కూడా నిర్దిష్ట కాలావధి నిర్దేశించి, రొటేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావొచ్చని పేర్కొంది. -
ఐఎల్ఎఫ్ఎస్ ఖాతాలు మళ్లీ మదింపు
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఖాతాలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మరోసారి మదింపు చేయనుంది. ఈ కేసులో ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఐసీఏఐ అకౌంటింగ్ రీసెర్చ్ ఫౌండేషన్ విభాగం దీన్ని చేపట్టనున్నట్లు ఐసీఏఐ తెలిపింది. 2012–13 నుంచి 2017–18 మధ్య కాలానికి సంబంధించి కంపెనీల చట్టంలోని సెక్షన్ 130 కింద (ఆర్థిక అవకతవకలు) ఐఎల్ఎఫ్ఎస్, ఐఎల్ఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్ ఖాతాలను, ఆర్థిక ఫలితాలను మరోసారి మదింపు చేయాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ జనవరి 1న ఆదేశించడం తెలిసిందే. వీటికి అనుగుణంగానే ఐసీఏఐ తాజాగా ప్రక్రియ చేపట్టనుంది. పాత మేనేజ్మెంట్ హయాంలో పద్దుల్లో అవకతవకలు జరిగాయని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో), ఐసీఏఐ గత నివేదికల్లో సూచనప్రాయంగా వెల్లడించటం తెలిసిందే. ఖాతాల్ని మరోసారి మదించటానికి ఆర్బీఐ, సెబీ వంటి నియంత్రణ సంస్థలు అనుమతించినా.. ఆయా పద్దులు, ఆర్థిక ఫలితాలు కంపెనీ రూపొందించినవేనని, తమకు సంబంధం లేదని ఎస్ఆర్బీసీ అండ్ కో తదితర ఆడిటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎల్ఎఫ్ఎస్ దాదాపు రూ.90,000 కోట్ల మేర బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు బాకీపడింది. 22 సంస్థలపై ఆంక్షల తొలగింపు ఐఎల్ఎఫ్ఎస్ గ్రూప్‌లో కాస్త మెరుగ్గా ఉన్న 22 కంపెనీలు రుణాలపై వడ్డీల చెల్లింపును కొనసాగించేందుకు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) అనుమతించింది. అలాగే గ్రూప్ దివాలా పరిష్కార ప్రక్రియ పర్యవేక్షణకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ నియామకాన్ని కూడా ఆమోదిస్తూ జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ద్విసభ్య బెంచి నిర్ణయం తీసుకుంది. అటు విదేశాల్లో ఏర్పాటైన 133 సంస్థలపైనా మారటోరియం ఎత్తివేసి, దివాలా పరిష్కార ప్రక్రియలో భాగం అయ్యేలా ఉత్తర్వులు ఇచ్చింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ రుణ పరిష్కార ప్రణాళికను కార్పొరేట్ వ్యవహారాల శాఖ గత నెలలో సమర్పించింది. దీని ప్రకారం.. ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉన్న కంపెనీలను ఆకుపచ్చ రంగులోనూ, కొంత తీవ్రత ఉన్న వాటిని కాషాయ రంగు, తీవ్రంగా ఉన్న వాటిని ఎరుపు రంగులోనూ వర్గీకరించింది. ఎరుపు వర్ణంలోనివి కనీసం సీనియర్ సెక్యూర్డ్ రుణదాతలకు కూడా చెల్లింపులు జరపలేని పరిస్థితుల్లో ఉన్నాయి. -
లిక్విడిటీ ఫండ్స్‌కు లాకిన్?
న్యూఢిల్లీ: ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం అనంతరం మార్కెట్లో లిక్విడిటీ (నిధుల లభ్యత) సమస్య నెలకొనడంతో లిక్విడిటీ ఫండ్స్ విషయంలో కఠిన నిబంధనలను తీసుకురావాలని సెబీ యోచిస్తోంది. లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా తీసుకునే వెసులుబాటు ప్రస్తుతం ఉంది. అయితే, స్వల్ప కాలం పాటు లాకిన్ తీసుకురావాలన్నది సెబీ ప్రతిపాదనగా తెలిసింది. 30 రోజులు అంతకంటే ఎక్కువ కాల వ్యవధి కలిగిన బాండ్ల విలువను మార్క్ టు మార్కెట్ చేయడాన్ని కూడా సెబీ తప్పనిసరి చేయాలనుకుంటోంది. ప్రస్తుతం 60 రోజులు, అంతకు మించి కాల వ్యవధి ఉన్న బాండ్లపైనే ఫండ్స్ సంస్థలు మార్క్ టు మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. దీనిపై సెబీ నియమించిన మ్యూచువల్ ఫండ్ అడ్వైజరీ కమిటీ చర్చిస్తుందని, అనంతరం సెబీ సంప్రతింపులు చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలియజేశాయి. సంస్థాగత ఇన్వెస్టర్లపై ప్రభావం లిక్విడ్ ఫండ్స్‌లో స్వల్పకాల లాకిన్ అనేది ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లపై ప్రభావం చూపిస్తుందని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో జిమ్మీ పటేల్ తెలిపారు. అధిక లిక్విడిటీ (అవసరమైన సందర్భాల్లో నిధులను వెనక్కి తీసుకునే వెసులుబాటు) వల్లే ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతుంటారని పేర్కొన్నారు. ‘‘లిక్విడ్ ఫండ్స్‌లో ఎక్కువగా పాల్గొనేది కార్పొరేట్లు, బ్యాంకులు తదితర ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లే. లాకిన్ పీరియడ్ అన్నది వీరిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అదే సమయంలో స్థిరమైన ఎన్ఏవీ వల్ల రిటైల్ ఇన్వెస్టర్లకు లాభం కలుగుతుంది’’ అని బ్యాంక్ బజార్ హెడ్ ఆదిత్య బజాజ్ పేర్కొన్నారు. ఆస్తుల అమ్మక ప్రక్రియను ఆరంభించిన ఐఎల్ఎఫ్ఎస్ భారీ రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపు, ఆస్తుల అమ్మక ప్రక్రియను ఆరంభించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సెక్యూరిటీ సర్వీసెస్, ఐఎస్‌ఎస్‌ఎల్ సెటిల్మెంట్ అండ్ ట్రాన్సాక్షన్ సర్వీసెస్‌లో తనకున్న వాటాలను విక్రయించే ప్రక్రియను మొదలు పెట్టింది. ఆర్ప్‌వుడ్ క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్ సంస్థలను సలహాదారులగా నియమించుకుంది. ఈ మేరకు తాజా ప్రగతిపై కార్పొరేట్ వ్యవహారాల శాఖకు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ నివేదికను సమర్పించింది. గ్రూపు సమస్యల పరిష్కారానికి ప్రతిపాదించిన వాటిల్లో ఆస్తుల విక్రయం ద్వారా నిధుల సమీకరణ కూడా ఒకటి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపు సంస్థలన్నీ కలిపి రూ.94,215 కోట్ల రుణ భారాన్ని కలిగి ఉన్న విషయం గమనార్హం. -
నిబంధనలను అతిక్రమించిన ఐఎల్ఎఫ్ఎస్ ఫైనాన్షియల్
ముంబై: ఐఎల్ఎఫ్ఎస్ అనుబంధ కంపెనీ ఐఎల్ఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్... ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కినట్టు కొత్త బోర్డు పరిశీలనలో వెలుగు చూసింది. కంపెనీ చెల్లించాల్సిన రుణాలు, గ్రూపులోని ఇతర కంపెనీల్లో పెట్టుబడులు 2017–18తో ముగిసిన చివరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఆర్బీఐ అనుమతించిన పరిమితుల కంటే ఎక్కువ ఉన్నట్టు వెల్లడైంది. ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తర్వాత లిక్విడిటీ సమస్య ఏర్పడడంతో, ఎన్‌బీఎఫ్‌సీల కోసం ప్రత్యేకంగా లిక్విడిటీ విండో ప్రారంభించాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిని ఆర్బీఐ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈ సమయంలో నిబంధనల ఉల్లంఘనను ఐఎల్ఎఫ్ఎస్ కొత్త బోర్డు గుర్తించడం గమనార్హం. ‘‘ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సంబంధించి గత మూడు ఆర్థిక సంవత్సరాల ఆర్థిక నివేదికలు, రికార్డులను ప్రాథమికంగా పరిశీలించిన తర్వాత, చెల్లించాల్సిన రుణాలు, గ్రూపు కంపెనీల పెట్టుబడులు 2015–16లో రూ.5,728 కోట్లు, 2016–17లో రూ.5,127 కోట్లు, 2017–18లో రూ.5,490 కోట్ల మేర ఉన్నట్టు గుర్తించాం’’ అని ఉదయ్‌కోటక్ ఆధ్వర్యంలోని నూతన బోర్డు ఎన్సీఎల్టీకి తెలిపింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అనుమతించిన దాని కంటే ఇవి చాలా ఎక్కువని పేర్కొంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపు రుణ భారం రూ.94,000 కోట్లుగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్బీఎఫ్సీ రంగానికి బ్యాంకులు రూ.4 లక్షల కోట్లకు పైగా రుణాలను ఇవ్వగా, ఇందులో 16 శాతం ఐఎల్ఎఫ్ఎస్కు సంబంధించినదేనని కూడా బోర్డు పరిశీలనతో తెలిసింది. రూ.63 కోట్ల చెల్లింపుల్లో ఐఎల్ఎఫ్ఎస్ సబ్సిడరీల వైఫల్యం తీసుకున్న రుణాలపై రూ.63.60 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో ఐఎల్ఎఫ్ఎస్ సబ్సిడరీలు చేతులెత్తేశాయి. ఐఎల్ఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ.61.31 కోట్ల మేర పలు రుణాలపై గురువారం చెల్లించాల్సి ఉండగా, ఇందులో విఫలం అయినట్టు కంపెనీ ప్రకటించింది. క్యాష్ క్రెడిట్/స్వల్పకాల రుణాలు/ టర్మ్ రుణాలపై వడ్డీ చెల్లింపులు చేయలేకపోయినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ ఎన్‌సీడీలపై శుక్రవారం రూ.2.29 కోట్ల వడ్డీ చెల్లించలేకపోయినట్లు తెలిపింది. -
బ్యాంకుల్లోకి రూ.2 లక్షల కోట్ల ‘ఫండ్స్’
ముంబై: ఐఎల్‌అండ్‌ఎఫ్ సంక్షోభం తర్వాత ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ పథకాల నుంచి రూ.2 లక్షల కోట్ల మేర ఉపసంహరించుకోగా... ఇవి బ్యాంకుల్లోకి చేరాయి. ఈ నిధులు ఇతర బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీలు) మద్దతుగా నిలుస్తాయని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ఈ విషయాన్ని ఒక నివేదికలో తెలియజేశారు. ‘‘ఇన్వెస్టర్లు లిక్విడ్ ఫండ్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్ నుంచి ఈ స్థాయిలో నిధులను వెనక్కి తీసుకున్నారు. ఈ స్థాయిలో భారీగా వచ్చిన డిపాజిట్లను బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీల నుంచి నాణ్యమైన ఆస్తుల కొనుగోలుకు వినియోగించే అవకాశముంది. ఎక్కువ శాతం ఇదే జరగొచ్చు కూడా. దీంతో లిక్విడిటీకి సంబంధించిన ఆందోళనలు సమసిపోతాయి’’ అని ఈ నివేదిక పేర్కొంది. బ్యాంకులు ఇప్పటికే ఎన్‌బీఎఫ్‌సీల నుంచి ఆస్తులు కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరించిన విషయాన్ని గుర్తు చేసింది. ఎస్బీఐ అయితే, లిక్విడిటీ సమస్యకు పరిష్కారంగా మూడు రెట్లు అధికంగా రూ.45,000 కోట్ల వరకు ఎన్‌బీఎఫ్‌సీల నుంచి ఆస్తు ల కొనుగోలుకు సిద్ధమని ప్రకటించింది. లిక్విడిటీకి కొరత ఏర్పడితే మాత్రం కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రుణాలు, చిన్న వ్యాపారులు, హౌసింగ్ రుణాలపై ప్రభావం ఉంటుందని, ఈ వర్గాలకిచ్చే రుణాలు తగ్గిపోతాయని హెచ్డీఎఫ్సీ బ్యాంకు నివేదిక పేర్కొంది. ఐఎల్ఎఫ్ఎస్ డిఫాల్ట్ అంశంపై విధాన నిర్ణేతలు స్పందించడంతో, అది వ్యవస్థాగత సమస్యగా మారకపోవచ్చని కూడా ఈ నివేదిక అభిప్రాయపడింది. సానుకూల బ్యాంకింగ్ రుణ వృద్ధి ముంబై: బ్యాంకింగ్ రుణ వృద్ధి 2018 అక్టోబర్ 12వ తేదీతో ముగిసిన పక్షం రోజుల కాలానికి గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే, 14.35 శాతం పెరిగింది. రూ.89.93 లక్షల కోట్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంకింగ్ రుణాలు రూ.78.65 లక్షల కోట్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ♦ తాజా సమీక్షా కాలంలో డిపాజిట్ల వృద్ధి రేటు 8.86 శాతం పెరిగింది. విలువ రూపంలో 108.25 లక్షల కోట్ల నుంచి రూ.117.85 లక్షల కోట్లకు చేరింది. ♦ సెప్టెంబర్ 28వ తేదీతో ముగిసిన పక్షం రోజులనుచూస్తే, (2017 ఇదే కాలంతో పోల్చి) రుణ వృద్ధి 12.51 శాతం పెరిగి, రూ.89.82 లక్షల కోట్లకు చేరింది. కాగా డిపాజిట్లలో రేటు 8.07 శాతం పెరుగుదలతో రూ.117.99 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ♦ మరోవైపు 2018 ఆగస్టులో ఆహార విభాగానికి రుణంలో 12.4 శాతం వృద్ధి నమోదయ్యింది. ♦ ఇదే నెలలో పారిశ్రామిక రంగానికి రుణాల్లో వృద్ధి 0.3 శాతం నుంచి 1.9 శాతానికి చేరింది. -
ఐఎల్ఎఫ్ఎస్ పరిష్కార ప్రణాళికపై కసరత్తు
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను (ఐఎల్ఎఫ్ఎస్) గాడిన పెట్టే దిశగా కొత్త బోర్డు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పరిష్కార ప్రణాళిక రూపకల్పన, అమలు కోసం మూడు సంస్థలను అడ్వైజర్లుగా నియమించింది. ఆర్ప్‌వుడ్ క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్ సంస్థలను ఆర్థిక అంశాలు.. ఇతరత్రా లావాదేవీల సలహాదారులుగా (ఎఫ్‌టీఏ), అల్వారెజ్ అండ్ మార్సల్ (ఏఅండ్ఎం) సంస్థను పునర్వ్యవస్థీకరణపై అడ్వైజరుగా నియమించినట్లు కంపెనీ తెలిపింది. వివిధ విభాగాల విక్రయం, వేల్యుయేషన్స్ మదింపు తదితర అంశాలపై రెండు ఎఫ్‌టీఏలు పనిచేస్తాయని వివరించింది. మరోవైపు గ్రూప్ కంపెనీల్లో అన్ని స్థాయుల్లో రోజువారీ లిక్విడిటీ పరిస్థితుల నిర్వహణ, నియంత్రణ అంశాలను ఏఅండ్ఎం పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే టర్న్ అరౌండ్ వ్యూహాన్ని రూపొందించే బాధ్యతలను కూడా ఏఅండ్ఎంకు ఐఎల్ఎఫ్ఎస్ అప్పగించింది. దాదాపు రూ.91,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్ఎఫ్ఎస్ గ్రూప్ సంస్థలు పలు రుణాల చెల్లింపుల్లో డిఫాల్టయ్యాయి. ఈ పరిణామాలు స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేయడం, మరిన్ని ప్రతికూల పరిణామాలను నివారించేందుకు గ్రూప్ అజమాయిషీ బాధ్యతలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడం తెలిసిందే. -
ఎన్నాళ్లీ సంక్షోభాలు?
ఎన్ని ఎదురు దెబ్బలు తింటున్నా మన దేశంలో కార్పొరేట్ గవర్నెన్స్ వ్యవస్థను చక్కదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) సంక్షోభం బట్టబయలు చేసింది. ఆ సంస్థ తీసుకున్న రూ. 91,000 కోట్ల మేర రుణాలకు అది కనీసం వడ్డీ కూడా కట్టలేని స్థితికి చేరుకున్నట్టు వెల్లడయ్యాక కేంద్ర ప్రభుత్వం స్పందించి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. జాతీయ కంపెనీ లా బోర్డు అనుమతితో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, దాదాపు 160 వరకూ ఉన్న దాని అనుబంధ సంస్థల యాజమాన్య అధికారాలు స్వీకరించింది. పాత బోర్డును రద్దు చేసి కొటక్ మహీంద్రా బ్యాంకు ఎండీ ఉదయ్ కొటక్ సారథ్యంలో కొత్త బోర్డును నియమించింది. ఉన్నంతలో ఇప్పుడు ప్రభుత్వం ఇంతకుమించి చేయగలిగింది లేదు. మరో ఆరేడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడబోయే ఏ ప్రభుత్వానికైనా ఇలాంటి సంక్షోభం ఒక దుర్వార్తే. ఎందుకంటే ఒక దిగ్గజ సంస్థ ఉన్నట్టుండి సంక్షోభంలో పడిందంటే అది దానికి మాత్రమే పరిమితమై ఉండదు. దాంట్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలు, దానికి అప్పులిచ్చిన సంస్థలు, ఇతరత్రా లావాదేవీల్లో ఉన్న సంస్థలు ఒక్కసారిగా కుదేలవుతాయి. ఒక్కొక్కటే పేకమేడల్లా కూలుతాయి. స్టాక్ మార్కెట్‌పై దాని దుష్ప్రభావం పడుతుంది. ముఖ్యంగా విదేశాల్లో మన పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టేందుకు ఏ విదేశీ సంస్థా ముందుకు రాదు. ఇది ఆర్థిక వ్యవస్థలో పెను సంక్షోభాన్ని తీసుకొస్తుంది. కనుకనే ఒక కార్పొరేట్ రంగ నిపుణుడన్నట్టు ఈ తాజా పరిణామం ‘మినీ లేమాన్ బ్రదర్స్ సంక్షోభం’. ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న చర్యల పర్యవసానంగా సంక్షోభం కాస్త సద్దుమణుగుతుంది. సంస్థ చేపట్టిన మౌలికరంగ ప్రాజెక్టులకు ఆటంకం కలగకుండా చూడటం, అది గట్టెక్కడానికి సంస్థ ఆస్తుల్ని విక్రయించటం, రుణాల పునర్వ్యవస్థీకరణ, కొత్తగా నిధులు సమకూర్చడం వగైరా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఆదరా బాదరాగా జనం సొమ్మును తరలించి సంక్షోభాన్ని నివారించేకంటే అసలు వాటిని మొగ్గలోనే తుంచేవిధంగా పటిష్టమైన వ్యవస్థల్ని నిర్మించటంలో మనం పదే పదే విఫలం కావటం విస్మయం కలిగిస్తుంది. మన దేశంలో కార్పొరేట్ కుంభకోణాలు కొత్తగాదు. అత్యద్భుతమైన పని తీరు ప్రదర్శిస్తున్నాయని కితాబులందుకున్న కంపెనీలు హఠాత్తుగా కళ్లు తేలేయడం, వాటి నిర్వాహకులు విదేశాలకు ఉడాయించడం తరచు జరుగుతూనే ఉంది. అవకతవకల్లో, అసమర్ధతల్లో ఆ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థల్ని మించిపోతున్నాయి. కార్పొరేట్ గవర్నెన్స్ పటిష్టంగా ఉంటే ఇలాంటి తెరచాటు బాగోతాలకు వీలుండదు. మౌలిక రంగ ప్రాజెక్టులకు దీర్ఘకాలిక రుణాలు అందించే అతి పెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్. ఇందులో ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ అతి పెద్ద వాటాదారు. ఆ తర్వాత స్థానం జపాన్‌కు చెందిన ఓరిక్స్ కార్పొరేషన్‌ది. సంస్థ బోర్డులో ఈ వాటాదారులకు ప్రాతినిధ్యంవహించే డైరెక్టర్లుంటారు. సంస్థ అమలు చేసే ప్రతి విధానాన్ని బోర్డు ఖరారు చేస్తుంది. ఈ సంస్థ కార్యకలాపాలను, లావాదేవీలను నిరంతరం గమనిస్తూ దానికి రేటింగ్ ఇచ్చే క్రెడిట్ రేటింగ్ సంస్థలుంటాయి. కానీ ఇంతమంది కళ్లుగప్పి ఈ సంస్థ దివాళా స్థితికి ఎలా చేరుకుందన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. ఈ సంస్థలో ఎల్ఐసీ వాటా నాలుగోవంతుకు మించి...అంటే 25.3 శాతం ఉంది. బీమా రంగంలో అది దిగ్గజ సంస్థ. చెల్లించాల్సిన రుణాల్ని సంస్థ ఎగవేసినప్పుడు తప్ప బయటివారికి అనుమానం రాదు. కానీ సంస్థ డైరెక్టర్లుగా ఉన్న నిపుణులకు పూర్తి అవగాహన ఉండాలి. ఉంటుంది. మరి సింహభాగం పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ ఏం చేసినట్టు? మొన్న జూన్‌లో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు చెందిన అనేక అనుబంధ సంస్థల్లో ఒక సంస్థ సకాలంలో రుణ చెల్లింపు చేయకపోవడంతో తొలిసారి బయటివారికి అనుమానాలు తలెత్తాయి. ఆ తర్వాత గ్రూపులోని ఇతర సంస్థలూ ఇదే రీతిలో ఉండటంతో.. మరీ ముఖ్యంగా గత నెల 14న ఆ సంస్థ కొన్ని రుణాలను తీర్చటంలో విఫలం కావడంతో వ్యవహారమంతా బట్టబయలైంది. పరిస్థితి ఇంతగా దిగజారే వరకూ బోర్డు డైరెక్టర్లు నిమ్మకు నీరెత్తినట్టు చేష్టలుడిగిపోవడం, రుణాలిస్తున్న సంస్థలైనా దీన్నంతటినీ గమనించలేకపోవటం, క్రెడిట్ రేటింగ్ సంస్థలు అత్యుత్తమ రేటింగ్లిస్తూ రావటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ)కు అప్పగించారు. మంచిదే. ఆ దర్యాప్తు సత్వరం పూర్తయి, ఇందులో ఎవరి జవాబుదారీతనం ఎంతో తేల్చాలి. మౌలిక సదుపాయాల రంగంలోని సంస్థలకు ఫైనాన్స్ చేయడంతోపాటు ఆ రంగంలో స్వయంగా ప్రాజెక్టులు చేపట్టే సంస్థలకు అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉండకతప్పదు. భూసేకరణ మొదలుకొని అనుకోని రీతిలో ఎదురయ్యే సమస్యలతో భారీ ప్రాజెక్టుల పనులు ప్రారంభం కావడంలో జాప్యం చోటుచేసుకొనే అవకాశాలుంటాయి. దానికితోడు ప్రణాళికలు రూపొందించుకోవడంలో, మానవ వనరుల్ని సమీకరించుకోవడంలో విఫలమైనా ఇబ్బందులు తలెత్తుతాయి. పర్యవసానంగా ప్రాజెక్టు వ్యయం అపరిమితంగా పెరిగిపోతుంది. సంస్థ నష్టాల బారిన పడుతుంది. సకాలంలో చెల్లింపులు చేయడంలో విఫలమవుతుంది. అందువల్లే ఇలాంటి సంస్థల నిర్వహణ అత్యంత నిపుణులైనవారికి అప్పగిస్తారు. ఇప్పుడు ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ బోర్డులోనూ ఆ స్థాయివారే ఉన్నారు. కానీ ఏం లాభం? ఎడాపెడా అప్పులు తెస్తూ సంస్థను నిర్వహించడం సరికాదని బోర్డుకు తెలియదు. వాటిని విశ్వసించి రుణాలివ్వడంకాక, సొంతంగా మదింపు వేయడం తమ బాధ్యతని బ్యాంకులకు తోచదు. ఇలాంటి పరిస్థితి ప్రమాదకరమైనది. ఈ తరహా సంక్షోభాలు ఇక తలెత్తనివిధంగా కనీసం ఇప్పటికైనా చర్యలు తీసుకోవటం తక్షణావసరం. -
ఎన్‌బీఎఫ్‌సీలకు ‘ఐఎల్ఎఫ్ఎస్’ ముప్పు!
న్యూఢిల్లీ: మౌలిక రంగానికి రుణాలు, నిర్మాణ రంగంలో కార్యకలాపాలు నిర్వహించే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపు... తాను తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలం కావడం యావత్ ఎన్బీఎఫ్సీ రంగాన్నే తీవ్రంగా కుదిపేస్తోంది. క్రెడిట్ రిస్క్‌పై సరికొత్త ఆందోళనలకు తావిచ్చింది. అంతేకాదు, ఈ పరిణామం ఎన్బీఎఫ్సీ సంస్థలకు మరణశాసనం కానుంది! సుమారు 1,500 చిన్న ఎన్బీఎఫ్సీ సంస్థల లైసెన్స్‌లను ఆర్బీఐ రద్దు చేసే అవకాశం ఉందని, కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టే వాటికి అనుమతులు కూడా మరింత కష్టతరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిధుల బలం ఉండి, సంప్రదాయంగా నడిచే ఫైనాన్స్ కంపెనీలు చిన్న సంస్థలను మింగేయవచ్చన్నది నిపుణులు అంచనా కడుతున్నారు. దీంతో చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకునే వారికి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని, ఇది ప్రైవేటు వినియోగం పెరుగుదలను అడ్డుకునే అంశంగా భావిస్తున్నారు. ‘‘వెలుగుచూస్తున్న పరిణామాలు కచ్చితంగా ఆందోళన కలిగించేవి. ఈ రంగం స్థిరకీరణకు గురవుతుంది’’ అని బంధన్ బ్యాంకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హరూన్ రషీద్ ఖాన్ తెలిపారు. ఆస్తులు, అప్పుల మధ్య అంతరం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. బ్యాంకులకు మించి ఎదుగుదల గ్రామీణంగా అధిక రిస్క్‌తో రుణాలిస్తున్న వేలాది సంస్థల మనుగడను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అంశం ప్రశార్థకం చేసింది. దేశవ్యాప్తంగా 11,400 ఎన్బీఎఫ్సీ సంస్థల ఉమ్మడి బ్యాలన్స్ షీటు మొత్తం 22.1 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. బ్యాంకుల కంటే వీటిపై నియంత్రణలు తక్కువే. దీంతో బ్యాంకులతో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీల రుణ పుస్తక మొత్తం రెండు రెట్ల మేర వృద్ధి చెందడం గమనార్హం. అందుకే ఈ విభాగం కొత్త పెట్టుబడిదారులను ఎంతగానో ఆకర్షిస్తోంది. అయితే, ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభంతో చాలా సంస్థల క్రెడిట్ రేటింగ్‌కు డౌన్‌గ్రేడ్ ముప్పు ఏర్పడింది. అధిక నిధుల సమీకరణ వ్యయాలు, ఐఎల్ ఎఫ్ఎస్ తరహా సంక్షోభాలతో రుణాలకు కటకట ఏర్పడుతుందని, తగినన్ని నిధుల్లేని సంస్థలు నిలదొక్కుకోవడం కష్టమేనన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ‘‘చిన్న ఎన్బీఎఫ్సీ సంస్థలు వ్యయాల పరంగా సమస్యను ఎదుర్కోనున్నాయి. వాటి లిక్విడిటీ (నగదు లభ్యత) ప్రస్తుత స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ, మధ్య, పెద్ద స్థాయి ఎన్బీఎఫ్సీ సంస్థలు తమ లక్ష్యాలను సాధించగలవు. నిధులను పొందగలవు’’ అని క్యాప్రి గ్లోబల్ క్యాపిటల్ ఎన్బీఎఫ్సీ సంస్థ అధిపతి రాజేష్ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు ఎటువంటి రాయితీలు లేనందున, తమ పోర్ట్‌ఫోలియో పనితీరును సరిగ్గా నిర్వహించలేని సంస్థలు కనుమరుగవుతాయన్నారు. చిన్న సంస్థలకు అస్తిత్వ ముప్పు కనీసం రూ.2 కోట్ల నిధుల్లేని ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్‌ను ఆర్బీఐ రద్దు చేసే ప్రక్రియలో ఉందంటున్నారు నిపుణులు. ‘‘ఆర్బీఐ ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు వాటి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే ప్రక్రియలో ఉంది. 1,500 సంస్థలు కనుమరుగు కానున్నాయి’’ అని ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఈ రంగానికి చెందిన సంఘం) చైర్మన్ రామన్ అగర్వాల్ తెలిపారు. అయితే, ఇదే సమయంలో ఎన్బీఎఫ్సీ రిజిస్ట్రేషన్ కోసం ఆర్బీఐ వద్దకు వందలాది నూతన దరఖాస్తులు వరదగా వస్తున్నట్టు చెప్పారు. ‘‘దేశంలో సుమారు 11,000 వరకు ఎన్బీఎఫ్సీలు 500 కోట్ల రూపాయల్లోపు ఆస్తులు కలిగిన చిన్న, మధ్య స్థాయి సంస్థలే. కానీ, అగ్ర స్థానంలో ఉన్న 400 ఎన్బీఎఫ్సీల్లో చాలా వరకు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలకు చెందినవి. 90 శాతానికి పైగా ఆస్తులు వీటి నియంత్రణలోనే ఉన్నాయి’’ అని రామన్ అగర్వాల్ వివరించారు. కస్టమర్లకు 2 శాతం అదనపు వడ్డీ రేటు విధించినప్పటికీ, ఎన్‌బీఎఫ్‌సీలకు కస్టమర్లతో సన్నిహిత సంబంధాలుంటాయన్నారు. తాజా పరిణామాలను ఆర్థికంగా దిగ్గజ సంస్థలైన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ వంటి సంస్థలు తట్టుకుని నిలబడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. గత రెండేళ్ల కాలంలో ఐడీఎఫ్సీ బ్యాంకు, కోటక్ మహింద్రా బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకు ఒక్కో మైక్రోఫైనాన్స్ సంస్థను కొనుగోలు చేశాయి. ఇండస్ఇండ్ బ్యాంకు సైతం భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. మార్కెట్లో కొంతమేర స్థిరీకరణ ఉంటుందని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా పేర్కొన్నారు. దీర్ఘకాలంలో ఈ రంగానికి ఇది మేలు చేస్తుందన్నారు. రూ. 300 కోట్లు చెల్లించిన ఐఎల్ఎఫ్ఎస్ ముంబై: పలు రుణ చెల్లింపుల్లో విఫలమైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపు, ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్‌కు మాత్రం రూ.300 కోట్ల బకాయిలను చెల్లించింది. ఆగస్టు 27 నుంచి ఏడు చెల్లింపుల్లో వైఫల్యం చెందినట్టు ఐఎల్ ఎఫ్ఎస్ గ్రూపు స్వయంగా ప్రకటించింది. ‘‘ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపు సంస్థ ఐఎల్ అండ్‌ఎఫ్‌ఎస్ సెక్యూరిటీస్ నుంచి మా వడ్డీ చెల్లింపులు, మెచ్యూరిటీ తీరిన వాటి చెల్లింపులు జరిగాయి. ఇందులో తుదిగా రూ.300 కోట్లు శుక్రవారం చెల్లించడం జరిగింది’’ అని ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. ఐఎల్ఎఫ్ఎస్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం: గార్గ్ ఐఎల్ఎఫ్ఎస్ కారణంగా ఏర్పడిన పరిస్థితిని ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని, ఫైనాన్షియల్ సిస్టమ్‌పై ఎటువంటి అసాధారణ ప్రభావం లేకుండా చర్యలు తీసుకుంటామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ చెప్పారు. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపు విభాగాలు కొన్ని రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో ఆర్థిక రంగంలో లిక్విడిటీ సమస్య ఏర్పడవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఎల్ఎఫ్ఎస్ వాటాదారులైన ఎల్ఐసీ, ఎస్బీఐ, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాల చీఫ్‌లతో ఆర్థిక శాఖ చర్చించింది. ఈ సమస్య వ్యవస్థలో ఇతర విభాగాలకు వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిసింది. ఇన్ఫ్రా విభాగంలో ఇది అతిపెద్ద కంపెనీ అని, ప్రభుత్వ విభాగాలతో ఎక్కువగా భాగస్వామ్యం కలిగి ఉందని గార్గ్ చెప్పారు. చాలా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులను ఈ సంస్థ నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఐఎల్ఎఫ్ఎస్ వాటాదారులతో ఆర్బీఐ మంతనాలు ముంబై: తీవ్ర రుణ భారంలో కూరుకుపోయి చెల్లింపుల్లో వైఫల్యం చెందిన ఐఎల్‌అండ్‌ఎఫ్ సంస్థను ఒడ్డున పడేయడం, నిధుల సాయం ప్రణాళికలపై ప్రధాన వాటాదారులతో ఆర్బీఐ చర్చించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వాటాదారులైన ఎల్ఐసీ, జపాన్‌కు చెందిన ఓరిక్స్ కార్పొరేషన్ ప్రతినిధులతో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్ విశ్వనాథన్, ఎంకే జైన్ శుక్రవారం భేటీ అయి చర్చించారు. ఐఎల్ఎఫ్ఎస్లో ఎల్ఐసీకి 25.34 శాతం, ఓరిక్స్కు 23.54 శాతం వాటాలున్నాయి. అయితే, చర్చల సారాంశం బయటకు రాలేదు. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, హెచ్డీఎఫ్సీ, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఎస్బీఐలకూ ఈ సంస్థలో వాటాలున్నాయి. తొలుత అందరు వాటాదారులను ఆర్బీఐ భేటీకి ఆహ్వానించగా, ఆ తర్వాత రెండు ప్రధాన వాటాదారులతోనే సమావేశాన్ని పరిమితం చేసింది. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపు రూ.91,000 కోట్ల రుణ భారాన్ని మోస్తోంది. -
ఐఎల్ఎఫ్ఎస్ షేర్హోల్డర్లతో ఆర్బీఐ సమావేశం రద్దు
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) షేర్హోల్డర్లతో శుక్రవారం జరగాల్సిన సమావేశాన్ని రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. ‘శుక్రవారం జరగాల్సిన సమావేశం రద్దయ్యింది. ఒక నియంత్రణ సంస్థగా ఆ కంపెనీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక, తీసుకోబోయే దిద్దుబాటు చర్యల వివరాలను ఆర్బీఐ తెలుసుకోవాలనుకుంటోంది’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. తదుపరి సమావేశం తేదీ ఇంకా ఖరారు కాలేదని వివరించాయి. సెప్టెంబర్ 29న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. కంపెనీలో ఎల్ఐసీకి అత్యధికంగా 25.34%, జపాన్ ఒరిక్స్ కార్పొరేషన్‌కి 23.54% వాటాలు ఉన్నాయి. అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, హెచ్డీఎఫ్సీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ వద్ద మిగతా వాటాలు ఉన్నాయి. దాదాపు రూ. 91,000 కోట్ల పైచిలుకు రుణభారం ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ తీవ్ర లిక్విడిటీ సంక్షోభం కారణంగా ఆగస్టు 27 నుంచి పలు రుణాలు, వడ్డీలు చెల్లించలేక డిఫాల్ట్ అవుతోంది. కంపెనీ తక్షణ అవసరాల కోసం రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 4,500 కోట్లు సమీకరించే ప్రయత్నాల్లో ఉంది. -
ఆర్థిక సంక్షోభమా?...ఆర్థిక సంస్థలతోనే సరా?
తీసుకున్న రుణాల్లో రూ.100 కోట్లను చెల్లించటంలో డిఫాల్టయిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంక్షోభం... అంతకంతకూ విస్తరిస్తూ విశ్వరూపం చూపిస్తోంది. లిక్విడిటీ సమస్య, డిఫాల్టింగ్, రేటింగ్ డౌన్‌గ్రేడ్.. ఇలా గొలుసుకట్టు చర్యలు ఆరంభమై వైరస్‌లా బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ, హౌసింగ్ ఫైనాన్స్ రంగాలకూ పాకింది. ఆయా షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తటంతో కొన్నిరోజులుగా స్టాక్‌మార్కెట్లు కుదేలవుతున్నాయి. కొందరు దీన్ని పదేళ్ల కిందటి లేమన్ బ్రదర్స్ సంక్షోభంతో పోలుస్తుండగా... మరికొందరు ఎన్‌బీఎఫ్‌సీలకు ఇది తీవ్రమైన దెబ్బగా చెబుతున్నారు. అసలు వీటిలో నిజాలెన్ని? నిపుణులేమంటున్నారు? 2008 నాటి పరిస్థితులు ఇపుడున్నాయా? ఎన్‌బీఎఫ్‌సీల సంగతేంటి? ఇవన్నీ వివరించేదే ఈ ప్రత్యేక కథనం... (సాక్షి, బిజినెస్ విభాగం) జూన్‌లో ఐఎల్ఎఫ్ఎస్ అనుబంధ సంస్థ ఐటీఎన్‌ఎల్ (ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్ లిమిటెడ్) డిఫాల్టయింది. కానీ ఆ సమయంలో రేటింగ్ ఏజెన్సీలు ఐటీఎన్‌ఎల్ బాండ్లకు డిఫాల్ట్ రేటింగ్ ఇవ్వలేదు. కంపెనీ వెనుక బడా గ్రూప్ ఉందనే భరోసాతో దీన్ని పట్టించుకోలేదు. దీంతో సమస్య ముదిరింది. సెప్టెంబర్‌కు వచ్చేసరికి మాతృసంస్థ ఐఎల్ఎఫ్ఎస్... సిడ్బీకి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించలేక డిఫాల్టయింది. ఉలిక్కిపడ్డ రేటింగ్ ఏజెన్సీలు ఆదరాబాదరాగా ఈ గ్రూప్ బాండ్స్‌కు జంక్ రేటింగ్ ఇచ్చాయి. ఆ ఐదే అసలు కారణం? ఐఎల్ఎఫ్ఎస్ డిఫాల్ట్లో అనుబంధ సంస్థలు తమిళనాడు పవర్ కంపెనీ, మారిటైమ్ ఇన్ఫ్రా, రాపిడ్ మెట్రోరైల్ గుర్గావ్ సౌత్, చెనాని నష్రి టన్నెల్వే కీలక పాత్ర పోషించాయి. రెండు అనుబంధ కంపెనీలు, ఒక మెట్రో ప్రాజెక్టు, ఒక టన్నెల్, ఒక బోర్డర్ చెక్‌పోస్టు కలిసి ఐఎల్ఎఫ్ఎస్ మూలధనాన్ని ఆవిరిచేశాయి. ఈ ఐదింటితో గత ఆర్థిక సంవత్సరం ఐఎల్ఎఫ్ఎస్కు రూ.1320 కోట్ల నష్టం వచ్చింది. సంస్థ నికర నష్టంలో ఈ ఐదింటి వాటా 70 శాతం. తిలా పాపం తలా పిడికెడు.. పద్ధతైన ఎన్‌బీఎఫ్‌సీగా ఐఎల్ఎఫ్ఎస్కు ఆర్బీఐ గతంలో కితాబులిచ్చింది. అలాంటి కంపెనీ ఇలా మారడం వెనుక కారణాలు చూస్తే... ►దేదేశీ మౌలిక రంగాన్ని పీడిస్తున్న అధికారుల అలసత్వం, ప్రాజెక్టుల్లో జాప్యం, అవినీతి, రాజకీయ జోక్యాల అంతిమ ప్రభావం ఈ సంక్షోభం. ►దే గ్రూప్‌లో ఆర్థిక ఇబ్బందులను ప్రధాన వాటాదారులు ముందు పసిగట్టలేకపోవడం సైతం సంక్షోభాన్ని తీవ్రం చేసింది. ►దేరేటింగ్ ఏజన్సీలపైనా సందేహాలున్నాయి. ఒక్క డిఫాల్ట్కే ట్రిపుల్ ఏ రేటింగ్‌ను భారీగా తగ్గించేయటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ►దేపెద్ద నోట్ల రద్దు అనంతరం రియల్టీ పడకేయడంతో కంపెనీ ఆస్తుల విక్రయానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆర్థిక సంస్థల లబోదిబో.. ఏ రంగానికి చెందిన కంపెనీలైనా డిఫాల్టయితే వాటికి అప్పులిచ్చిన ఆర్థిక సంస్థలపైనే తొలి ప్రభావం పడుతుంది. ఐఎల్ఎఫ్ఎస్ ఎదుర్కొంటున్న లిక్విడిటీ సమస్య దేశీయ బ్యాంకులకు క్రెడిట్ నెగటివ్ అని గ్లోబల్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హెచ్చరించింది. ఈ సంక్షోభం ఇక్కడితో ఆగదని, బ్యాంకులపై పడుతుందని మూడీస్ అభిప్రాయపడింది. ఇప్పటివరకు ఐఎల్ఎఫ్ఎస్ రోడ్డు ప్రాజెక్టులకిచ్చిన రుణాలను ఎన్పీఏలుగా గుర్తించలేదని తెలియజేసింది. మాతృసంస్థే డిఫాల్టయినందున బ్యాంకులకు నష్టాలు తప్పకపోవచ్చని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితి ఇక ఏ కొంచెం అధ్వానంగా మారినా పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ వంటి ప్రభుత్వ బ్యాంకులు దారుణంగా దెబ్బతింటాయి. వీటి మొత్తం కార్పొరేట్ రుణాల్లో ఐఎల్ఎఫ్ఎస్ వాటా 0.5–1 శాతం శ్రేణిలో ఉంటుంది. ఐఎల్ఎఫ్ఎస్కు రుణాలిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా వాటాయే ఎక్కువ. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్‌లూ రుణాలిచ్చాయి. లేమన్ సంక్షోభంతో పోలికలేదు!! ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్... ముద్దుగా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్. మాజీ బ్యాంకర్ పార్ధసారధి ఆలోచనలకు ప్రతిరూపం ఈ సంస్థ. హెచ్డీఎఫ్సీ, యూటీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి వాటాదారులు కాగా.. ఆ తరవాత ఎస్బీఐ, ఎల్ఐసీ, ఓరిక్స్ కార్పొరేషన్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అధారిటీ వంటి దిగ్గజాలు వాటాలు కొన్నాయి. మౌలికరంగ ప్రాజెక్టులకు రుణాలిచ్చే ఈ సంస్థకు 256 దాకా అనుబంధ, భాగస్వామ్య సంస్థలున్నాయి. రుణాలివ్వటానికి కావాల్సిన నిధుల్ని టోకు ఇన్వెస్టర్ల నుంచి స్వల్పకాలిక బాండ్లు, రుణాల ద్వారా సమీకరిస్తోంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెప్టెంబర్‌లో కొన్ని రుణాలపై వడ్డీ చెల్లించటంలో డిఫాల్టయింది. లిక్విడిటీ సంక్షోభం తలెత్తింది. ఫలితం... బ్యాంకులు, ఎన్బీఎఎఫ్సీ, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల షేర్లు దారుణంగా పతనమవుతున్నాయి. దీంతో పలువురు ఈ సంక్షోభాన్ని పదేళ్ల కిందట అమెరికాలో తలెత్తిన లేమన్ బ్రదర్స్ సంక్షోభంతో పోలుస్తున్నారు. నిజానికి లేమన్ మాదిరిగానే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఆస్తులు కూడా లిక్విడిటీ లేని స్థిర, దీర్ఘకాలిక సెక్యూరిటీల రూపంలోనే ఉన్నాయి. రుణ నష్టాలకు అతి తక్కువ కేటాయింపులు చేయటం... ఓ పెద్ద బీమా సంస్థతో సహా పలు ఆర్థిక సంస్థలకు రుణాలివ్వటం... ఇవన్నీ లేమన్ తరహా చర్యలే. కాకపోతే నిపుణుల అంచనాల ప్రకారం...లేమన్‌తో పోలిస్తే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ చాలా చిన్నది. దీని ప్రభావం కూడా అంత తీవ్రమైనది కాదనే చెప్పాలి. ఇంకా వారేం చెబుతున్నారంటే... 2008 లేమన్ సంక్షోభంలో... ఆస్తుల విలువను భారీగా పెంచి చూపించటమనేది వ్యవస్థల్ని కుప్పకూల్చేసింది. రుణమిచ్చిన ఆస్తులకు సంబంధించి దాని వాస్తవ విలువకు ఎన్నో రెట్ల విలువలు ఖాతా పుస్తకాల్లో వచ్చి చేరాయి. ఆ విలువల ఆధారంగా రుణాలు మంజూరయ్యాయి. ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ మార్కెట్ బలహీనపడటంతో వాటి వాస్తవ విలువలు మరింత తగ్గాయి. దీంతో వాటిపై రుణాలిచ్చిన సంస్థల ఆస్తుల విలువ కూడా ఒక్కసారిగా ఢమాల్‌మంది. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి ఎలాంటి కేటాయింపులూ చేయకపోవటం... మినీ బాండ్లలో లేమన్ పెట్టుబడులే ఎక్కువ ఉండటంతో నాడు లేమన్ కుప్పకూలింది. మౌలికరంగ ప్రాజెక్టులే ఆస్తులు... కానీ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ పరిస్థితి వేరు. ఇక్కడ క్రెడిట్ డెరివేటివ్స్ లేవు. పైపెచ్చు ఐఎల్ఎఫ్ఎస్ ఆస్తులు కాగితాలపై రాసిన పత్రాలు కాదు. స్థిరమైన మౌలిక రంగ ప్రాజెక్టులు. కొంత హెయిర్‌కట్ పోయినా... వీటి విలువలన్నీ వాస్తవిక అంచనాల ఆధారంగా వేసినవి. లేమన్ మాదిరి అంచనాల ఆధారంగా రూపొందించిన డెరివేటివ్ సాధనాలు కాదు కనుక... వీటిలో తేడా వచ్చినా అన్ని బ్యాంకులూ కుప్పకూలే పరిస్థితి లేదు. పైపెచ్చు దీనివల్ల బ్యాంకులకు వాటిల్లిన నష్టాన్ని తట్టుకోవటానికి క్రెడిట్, ఈక్విటీ పరమైన రక్షణాస్త్రాలున్నాయి. దీన్ని కొంచెం వివరంగా చూస్తే... ఐఎల్ఎఫ్ఎస్ బ్యాలెన్స్ షీట్లో రూ.90,000 కోట్ల అప్పులున్నాయి. వీటిలో మ్యూచువల్ ఫండ్లు పెట్టింది రూ.4,000–5,000 కోట్లు కాగా... పెన్షన్ ఫండ్లు, బీమా కంపెనీలు రూ.10,000 కోట్ల వరకూ పెట్టాయి. మ్యూచువల్ ఫండ్లు పెట్టిన మొత్తమంతా పోయిందనుకున్నా... అవి షేర్లు కొనుగోలు చేసి పెట్టాయి కనుక నష్టపోయేది వాటి లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లే. మొత్తం వ్యవస్థంతా కుప్పకూలే పరిస్థితి ఉండ దు. ఫండ్ల మొత్తం ఆస్తులతో పోలిస్తే ఈ పెట్టుబడి చాలా చాలా తక్కువ. ఇక 2018 ఆర్థిక సంవత్సరం ప్రకారం ఐఎల్ఎఫ్ఎస్ నికర విలువ రూ.7,400 కోట్లు. అంటే ఆస్తుల్లో హెయిర్‌కట్‌లకు మరికొంత దన్ను ఉందన్నట్టేగా!!. ఈ లెక్కన చూస్తే ఐఎల్ఎఫ్ఎస్ రూ.90వేల కోట్లలో దాదాపు రూ.22–23వేల కోట్లకు భయం లేనట్టే. పైపెచ్చు ఎల్ఐసీ వంటి ప్రస్తుత షేర్హోల్డర్లు కావాలంటే మరింత వాటా తీసుకుని పెట్టుబడి పెడతామని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే ఐఎల్ఎఫ్ఎస్ వ్యవహారం వ్యవస్థను దెబ్బతీసేంత ప్రమాదకరమైంది కాదు. ఐఎల్ఎఫ్ఎస్లో మెజారిటీ వాటాలు ప్రయివేటు సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. కానీ అంతిమంగా ఇలాంటి దెబ్బలన్నీ భరించాల్సింది పన్ను చెల్లించే సామాన్యులే. ఎందుకంటే ఐఎల్ఎఫ్ఎస్ను ఆదుకోవటానికి దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాల్సిన బాధ్యత ఎల్ఐసీ, ఎస్బీఐ భుజాలపైనే పడింది. ఈ రెండూ ప్రభుత్వ రంగంలోనివే కనక అంతిమంగా పోయేది పన్ను చెల్లింపుదారుల సొమ్మే!!. మందగమనానికి దారితీస్తుందా? ఐఎల్ఎఫ్ఎస్ రుణాలు ఎన్పీఏలుగా మారితే బ్యాంకింగ్ రంగం మరింత ఇబ్బందుల్లోకి జారే ప్రమాదం ఉంది. సంక్షోభంతో ఇకపై ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల సమీకరణ సవాలుగా మారనుంది. మరోపక్క రూపీ పతనాన్ని అడుకట్టకు ఆర్బీఐ మళ్లీ రేట్లు పెంచితే కార్పొరేట్లకు నిధుల కొరత ఏర్పడుతుంది. వ్యవస్థలో మందగమనానికి దారితీయొచ్చు. సమస్య నుంచి బయటపడేందుకు ఐఎల్ఎఫ్ఎస్ నిధుల సమీకరణ యత్నాలు ఆరంభించింది. వాటాల విక్రయం ద్వారా రూ.4,500 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. కంపెనీలో అతిపెద్ద వాటాదారులైన ఎల్ఐసీ, ఎస్బీఐ ఈ పెట్టుబడి పెట్టొచ్చు. సెప్టెంబర్ 29న జరిగే ఏజీఎంలో ఈ రైట్స్ ఇష్యూపై నిర్ణయం తీసుకోనున్నారు. -
గ్రేటర్లో పెట్టుబడులకు ‘ఐఎల్ఎఫ్ఎస్’ ఆసక్తి
మంత్రి కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధులు భేటీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునే దిశగా పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రముఖ సంస్థ ఐఎల్ఎఫ్ఎస్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్) ఆసక్తి చూపింది. ఈ సంస్థ ప్రతినిధులు మంగళవారం మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావుతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో ప్రభుత్వం చేపట్టనున్న పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. స్కై వేల నిర్మాణం, రింగ్ రోడ్లు, అంతర్గత ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్లు, హౌసింగ్ వంటి తదితర మౌలిక రంగాల అభివృద్ధి నిర్మాణంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత చూపింది. హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల గురించి సంస్థ ప్రతినిధులకు మంత్రి వివరించారు. పూర్తి విధివిధానాలతో ముందుకు రావాలని వారిని కోరారు. త్వరలోనే సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ కానున్నారు. సమావేశంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.