నిబంధనలను అతిక్రమించిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ | IL&FS Fin Services exposure to group firms breaches RBI limit | Sakshi
Sakshi News home page

నిబంధనలను అతిక్రమించిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌

Published Sat, Nov 3 2018 12:56 AM | Last Updated on Sat, Nov 3 2018 12:56 AM

IL&FS Fin Services exposure to group firms breaches RBI limit - Sakshi

ముంబై: ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ అనుబంధ కంపెనీ ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌... ఆర్‌బీఐ నిబంధనలను తుంగలో తొక్కినట్టు కొత్త బోర్డు పరిశీలనలో వెలుగు చూసింది. కంపెనీ చెల్లించాల్సిన రుణాలు, గ్రూపులోని ఇతర కంపెనీల్లో పెట్టుబడులు 2017–18తో ముగిసిన చివరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఆర్‌బీఐ అనుమతించిన పరిమితుల కంటే ఎక్కువ ఉన్నట్టు వెల్లడైంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత లిక్విడిటీ సమస్య ఏర్పడడంతో, ఎన్‌బీఎఫ్‌సీల కోసం ప్రత్యేకంగా లిక్విడిటీ విండో ప్రారంభించాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిని ఆర్‌బీఐ తోసిపుచ్చిన విషయం తెలిసిందే.

ఈ సమయంలో నిబంధనల ఉల్లంఘనను ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కొత్త బోర్డు గుర్తించడం గమనార్హం. ‘‘ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు సంబంధించి గత మూడు ఆర్థిక సంవత్సరాల ఆర్థిక నివేదికలు, రికార్డులను ప్రాథమికంగా పరిశీలించిన తర్వాత, చెల్లించాల్సిన రుణాలు, గ్రూపు కంపెనీల పెట్టుబడులు 2015–16లో రూ.5,728 కోట్లు, 2016–17లో రూ.5,127 కోట్లు, 2017–18లో రూ.5,490 కోట్ల మేర ఉన్నట్టు గుర్తించాం’’ అని ఉదయ్‌కోటక్‌ ఆధ్వర్యంలోని నూతన బోర్డు ఎన్‌సీఎల్‌టీకి తెలిపింది.

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం అనుమతించిన దాని కంటే ఇవి చాలా ఎక్కువని పేర్కొంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు రుణ భారం రూ.94,000 కోట్లుగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి బ్యాంకులు రూ.4 లక్షల కోట్లకు పైగా రుణాలను ఇవ్వగా, ఇందులో 16 శాతం ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు సంబంధించినదేనని కూడా బోర్డు పరిశీలనతో తెలిసింది.  


రూ.63 కోట్ల చెల్లింపుల్లో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సబ్సిడరీల వైఫల్యం
తీసుకున్న రుణాలపై రూ.63.60 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సబ్సిడరీలు చేతులెత్తేశాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రూ.61.31 కోట్ల మేర పలు రుణాలపై గురువారం చెల్లించాల్సి ఉండగా, ఇందులో విఫలం అయినట్టు కంపెనీ ప్రకటించింది. క్యాష్‌ క్రెడిట్‌/స్వల్పకాల రుణాలు/ టర్మ్‌ రుణాలపై వడ్డీ చెల్లింపులు చేయలేకపోయినట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఎన్‌సీడీలపై శుక్రవారం రూ.2.29 కోట్ల వడ్డీ చెల్లించలేకపోయినట్లు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement