
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇన్‌ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ సంస్థల ఖాతాలను తమ అనుమతి లేకుండా మొండిపద్దుల కింద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రకటించరాదని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశించింది. సంస్థ రుణ పరిష్కార ప్రణాళిక సజావుగా జరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. దాదాపు రూ. 90,000 కోట్ల పైచిలుకు రుణభారం పేరుకుపోయిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కొత్త మేనేజ్‌మెంట్.. ఆస్తుల విక్రయ ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇందుకు సంబంధించిన ప్రణాళిక అమలు కోసం ట్రిబ్యునల్‌ను కేంద్ర ప్రభుత్వం ఆశ్రయించిన నేపథ్యంలో ఎన్‌సీఎల్‌ఏటీ తాజా ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌లో కాస్త మెరుగ్గా ఉన్న 22 కంపెనీలు తమ తమ రుణాల చెల్లింపు ప్రక్రియలను యథావిధిగా కొనసాగించేందుకు ఫిబ్రవరి 11న హియరింగ్‌లో ఎన్‌సీఎల్‌ఏటీ అనుమతించింది. అలాగే, రుణ పరిష్కార ప్రక్రియ పర్యవేక్షణకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ నియామకానికి ఆమోదముద్ర వేసింది.