84 శాతం ఒక పూట భోజనాన్ని మానేస్తున్నారు
90 శాతం కిరాణా ఖర్చు తగ్గించుకుంటున్నారు
ఒట్టావా: ఒకప్పుడు లక్షల మందికి కలల గమ్యస్థానమైన కెనడా కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న కిరాణా బిల్లులు, గృహ నిర్మాణ ఖర్చులతో ప్రజలు సతమతమవుతున్నారు. అనేక కుటుంబాలు రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికే ఆపసోపాలు పడుతున్నాయి. చివరికి పిల్లలకు పౌష్టికాహారం కూడా గగనంగా మారుతోందట.
సాల్వేషన్ ఆర్మీ చేసిన సర్వేలో ఇలాంటి విస్తుగొలిపే విషయాలెన్నో వెలుగులోకి వచ్చాయి. కెనడాలో 25 శాతం మంది తల్లిదండ్రులు పిల్లలకు పోషకాహారాన్ని అందించడానికి తమ ఆహారాన్ని తగ్గించుకుంటున్నారు. ఇక ఏకంగా 90 శాతానికి పైగా కుటుంబాలు కిరాణా వస్తువుల కొనుగోలును వీలైనంతగా తగ్గించుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. నివేదిక
ఇంకా ఏం చెప్పిందంటే...
→ కెనడాలో ప్రతి నలుగురు తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లలకు మంచి ఆహారం అందించడానికి స్వీయ ఆహార వినియోగాన్ని తగ్గించారు
→ సర్వేలో పాల్గొన్న వారిలో 90% మందికి పైగా ఇతర ఆర్థిక ప్రాధాన్యతలకు కావాల్సిన డబ్బు కోసం కిరాణా ఖర్చులు తగ్గించినట్లు చెప్పారు
→ కెనడాలో ఫుడ్ బ్యాంకులు కూడా తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి.
→ దాంతో భారతీయులు సహా అంతర్జాతీయ విద్యార్థులను తిప్పి పంపాలని అవి నిర్ణయించాయి.
→ చాలామందికి ప్రస్తుతం కనీస నిత్యావసర వస్తువుల కొనుగోలుకు సరిపడా జీవనోపాధి పొందడం కూడా కష్టంగా మారింది
→ డబ్బుల్లేక చాలామంది చౌకగా దొరికే నాసిరకం ఆహారంతో కడుపు నింపుకుంటున్నారు
→ అది కూడా కుదరినప్పుడు భోజనాన్ని దాటవేస్తున్నట్లు 84% మంది చెప్పారు.
చాలామంది కెనడియన్లు తమ పిల్లలు, కుటుంబసభ్యుల రోజువారీ ప్రాథమిక అవసరాలను తీర్చడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభానికి ఇది అద్దం పడుతోంది
– జాన్ ముర్రే, సాల్వేషన్ ఆర్మీ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment