1.87 కోట్ల మందికి తలో 250 డాలర్లు
పలు వస్తువులపై పన్ను మినహాయింపులు
ఎన్నికల గిమ్మిక్కులంటూ మండిపడ్డ విపక్షాలు
టొరంటో: ద్రవ్యోల్బణం పెరిగి జీవన వ్యయ సంక్షోభంతో సతమతమవుతున్న కెనడియన్లకు ఊరట కల్పిస్తూ జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. కిరాణా, పిల్లల దుస్తులు, మద్యం, క్రిస్మస్ ట్రీలతో సహా పలు వస్తువులపై రెండు నెలల పాటు పన్ను మినహాయించింది. 2023లో 1.5 లక్షల కెనేడియన్ డాలర్లు లేదా అంతకంటే తక్కువ సంపాదన ఉన్న 1.87 కోట్ల మందికి ‘వర్కింగ్ కెనడియన్స్ రిబేట్’కింద ఒక్కొక్కరికి 250 డాలర్ల చొప్పున పంపిణీ చేయనుంది.
ట్రూడో ఈ మేరకు ఎక్స్‌లో పోస్టులో వెల్లడించారు. ‘‘మా ప్రభుత్వం ధరలను నిర్ణయించలేదు. కానీ ప్రజలకు మరింత డబ్బు అందించగలదు. 250 డాలర్ల రిబేట్‌తో పాటు కెనేడియన్లు డిసెంబర్ 14 నుంచి రెండు నెలల పాటు జీఎస్టీ, హెచ్‌ఎస్టీ నిలిపివేత రూపంలో పన్ను మినహాయింపు పొందనున్నారు’’అని ప్రకటించారు. దాని ప్రకారం కిరాణా సరుకులు, ఇతర నిత్యావసరాలు, పిల్లల దుస్తులు, డైపర్లు, ప్రాసెస్డ్ ఫుడ్, రెస్టారెంట్ భోజనం, స్నాక్స్, ఆల్కహాల్, బొమ్మలు, పుస్తకాలు, వార్తాపత్రికలతో సహా పలు ఇతర వస్తువులపై రెణ్నెల్లపాటు పన్ను ఎత్తేస్తారు.
ట్రూడో ప్రకటనను విపక్ష కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పొయిలీవ్రే తప్పుపట్టారు. రెండు నెలల తాత్కాలిక పన్ను విరామం వచ్చే సంవత్సరం ప్రారంభంలో పెరిగే కార్బన్ పన్నుల భారాన్ని భర్తీ చేయబోదన్నారు. ‘‘ట్రూడో హయాంలో గృహనిర్మాణ ఖర్చులు రెట్టింపయ్యాయి. ఫుడ్‌బ్యాంక్ వినియోగం ఆకాశాన్నంటుతోంది. ఫెడరల్ కార్బన్ ట్యాక్స్ వల్ల చలికాలంలో ఇళ్లలో వెచ్చదనం కూడా ప్రజలకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతోంది’’అని మండిపడ్డారు.
తాము అధికారంలోకి వస్తే కొత్తింటి అమ్మకాలపై కార్బన్ పన్ను, జీఎస్‌టీ రద్దు చేస్తామన్నారు. ట్రూడో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉండటం తెలిసిందే. దాంతో తాజా ఆర్థిక తాయిలాలను వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో వారిని బుజ్జగించడంలో భాగమని భావిస్తున్నారు. కాగా జీఎస్టీ రద్దు తమ పార్టీ ప్రచారం ఫలితమేనని ఎన్డీపీ నేత జగీ్మత్ సింగ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment