ఒట్టావా: కెనడా ప్రధాని బరినుంచి భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ వైదొలిగారు. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న అనిత.. పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు శనివారం ప్రకటించారు. అంతేకాదు తాను ఎంపీగా మళ్లీ పోటీ చేయబోనని ఆమె స్పష్టం చేశారు. ప్రధానిగా, పార్టీ అధినేతగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేయడంతో ఆమె బరిలోకి వచ్చారు. అయితే.. వారంలోపే తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా లిబరల్ బృందానికి, ఓక్‌విల్లే ప్రజలకూ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘పార్లమెంటు సభ్యురాలిగా లిబరల్ జట్టులోకి నన్ను ఆహ్వానించినందుకు, కీలకమైన కేబినెట్ శాఖలను అప్పగించినందుకు ప్రధాని ట్రూడోకు హృదయపూర్వక ధన్యవాదాలు.
కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌కు ప్రాతినిధ్యం వహించడానికి నన్ను ఎన్నుకున్నందుకు, గత ఇరవై సంవత్సరాలుగా నా భర్త, నేను మా నలుగురు పిల్లలను పెంచేందుకు స్వాగతించిన అద్భుతమైన ఓక్‌విల్లే ప్రజలకు నేను నిజంగా కృతజ్ఞురాలిని’’ అని అనిత తన ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల వరకు తాను ఎంపీగా కొనసాగుతానన్నారు. భారత సంతతికి చెందిన వ్యక్తి ఓక్‌విల్లేలో గెలవడం సాధ్యం కాదని చాలా మంది రాశారని, అయినప్పటికీ ఒక్కసారి కాదు రెండుసార్లు గెలిపించి ప్రజలు తన వెనుకే నిలిచారని చెప్పారు. ఈ గౌరవం ఎప్పటికీ తన గుండెల్లో నిలిచిపోతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment