canada prime minister
-
కెనడా ప్రధాని చుట్టూ ఖలిస్తాన్ ఉగ్రవాదులే
న్యూఢిల్లీ: కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో తీరును కెనడాలో భారత హై కమిషనర్‌గా పనిచేసిన సంజయ్ కుమార్ వర్మ బట్టబయలు చేశారు. ట్రూడో ఆంతరంగికుల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులతోపాటు భారత వ్యతిరేక శక్తులు ఉంటాయని చెప్పారు. కెనడాలో రాజకీయ అవసరాల కోసం ఖలిస్తానీ ఉగ్రవాదులకు ట్రూడో ప్రభుత్వం రక్షణ కవచంగా నిలుస్తోందని అన్నారు. భారత్–కెనడా మధ్య వివాదం నేపథ్యంలో సంజయ్ కుమార్ వర్మను భారత ప్రభుత్వం ఇటీవల వెనక్కి పిలిపించిన సంగతి తెలిసిందే. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెనడాలోని ఖలిస్తానీ శక్తులు, భారత వ్యతిరేక శక్తులు ప్రధాని ట్రూడోతో అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటాయని వెల్లడించారు. ఖలిస్తాన్ మద్దతుదారులు ట్రూడో ఆప్తమిత్రులుగా మారిపోయారని తెలిపారు. 2018లో ట్రూడో భారత్‌ను సందర్శించినప్పుడు ఆయన వెంటనే ఖలిస్తాన్ సానుభూతిపరులు కూడా కనిపించారని సంజయ్ కుమార్ వర్మ గుర్తుచేశారు. ఖలిస్తాన్ పోరాట యోధులమని చెప్పుకుంటున్న వ్యక్తులకు కెనడాలో ఎనలేని ప్రోత్సాహం లభిస్తోందని ఆరోపించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో సంజయ్ కుమార్ వర్మను కెనడా ప్రభుత్వం అనుమానితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు భారత్ సహకరించడం లేదని కెనడా చేస్తున్న ఆరోపణలపై సంజయ్ కుమార్ వర్మ స్పందించారు. ఆ కేసులో భారత్ పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని తేలి్చచెప్పారు. ఖలిస్తానీ ముష్కరులు కెనడాలో భారత కాన్సులేట్ కార్యాలయాల ఎదుట అల్లర్లు సృష్టించారని, భారత దౌత్యవేత్తలను సోషల్ మీడియా ద్వారా బెదిరించేందుకు ప్రయత్నించారని గుర్తుచేసుకున్నారు. దారుణ పరిస్థితుల్లో విద్యార్థులు కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలని కోరుకుంటున్న భారత విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సంజయ్ కుమార్ వర్మ సూచించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మెరుగ్గా లేవని అన్నారు. రూ.లక్షలు ఖర్చు చేసినా మంచి కాలేజీల్లో ప్రవేశాలు దొరకడం లేదని, చదువులు పూర్తిచేసుకున్నాక ఉద్యోగాలు లభించడం లేదని చెప్పారు. విద్యార్థుల్లో కుంగుబాటు, ఆత్మహత్య వంటి పరిణామాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. తాను కెనడాలో హైకమిషనర్‌గా పనిచేసిన సమయంలో వారానికి కనీసం రెండు మృతదేహాలను భారత్‌కు పంపించిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాలు రాక, తల్లిదండ్రులకు ముఖం చూపించలేక కెనడాలో భారతీయ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. అందుకని కెనడాను ఎంచుకోకపోవడమే మంచిదని సూచించారు. ఒకవేళ భారత్–కెనడా మధ్య సంబంధాలు బాగున్నా కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు తాను ఇదే సలహా ఇచ్చేవాడినని వ్యాఖ్యానించారు. ఎన్నో ఆశలతో వెళ్లిన విద్యార్థులు శవాలై తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ దుస్థితికి ఏజెంట్లు కూడా కొంత కారణమని విమర్శించారు. రూ.లక్షలు దండుకొని ఊరూపేరు లేని కాలేజీల్లో విద్యార్థులను చేరి్పస్తున్నారని, సరైన వసతులు కూడా కలి్పంచడం లేదని వెల్లడించారు. వారానికి కేవలం ఒక క్లాసు నిర్వహించే కాలేజీలు కూడా ఉన్నాయన్నారు. ఇరుకు గదిలో ఎనిమిది మంది విద్యార్థులు సర్దుకోవాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తున్నాయని తెలిపారు. కెనడాలో భారతీయ విద్యార్థులు చదువులు పూర్తి చేసుకున్నప్పటికీ ఉద్యోగాలు రాక జీవనోపాధి కోసం క్యాబ్ డ్రైవర్లుగా పని చేస్తున్నారని, దుకాణాల్లో చాయ్, సమోసాలు అమ్ముకుంటున్నారని సంజయ్ వర్మ ఆవేదన వ్యక్తంచేశారు. -
దృష్టి మరల్చేందుకే.. నిజ్జర్ హత్య తెరపైకి
ఒట్టావా: ఇతర వివాదాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతాన్ని తెరపైకి తెచ్చి భారత్‌పై ఆరోపణలు చేస్తున్నారని కెనడా విపక్షనేత మాక్సిమ్ బెర్నియర్ అన్నారు. గతంలో జరిగిన తప్పిదాన్ని సరిచేసుకోవాలంటే మరణానంతరం నిజ్జర్ పౌరసత్వాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. నిజ్జర్ హత్యలో భారత రాయబారి ప్రమేయముందని ట్రూడో ఆరోపించడం, పరస్పర దౌత్యవేత్తల బహిష్కరణతో భారత్– కెనడా సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ వివాదానికి కేంద్రబిందువైన నిజ్జర్ విదేశీ ఉగ్రవాది అని, అతనికి 2007లో కెనడా పౌరసత్వం లభించిందని పీపుల్స్ పార్టీ ఆఫ్ కెనడా నేత బెర్నియర్ అన్నారు. కెనడా గడ్డపై భారత రాయబార సిబ్బంది నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారనేది నిజమైతే.. అది చాలా తీవ్రమైన విషయమని, తగుచర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కానీ ఇప్పటిదాకా భారత్ ప్రమేయంపై ఎలాంటి ఆధారాలను ప్రభుత్వం బయటపెట్టలేదని, ఇతర వివాదాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ట్రూడో నిజ్జర్ హత్యను వాడుకుంటున్నారని సుస్పష్టంగా కనపడుతోందన్నారు. నిజ్జర్ విదేశీ ఉగ్రవాది అని, 1997 నుంచి పలుమార్లు తప్పుడు పత్రాలతో కెనడా పౌరసత్వాన్ని పొందడానికి ప్రయత్నించాడని అన్నారు. పలుమారు తిరస్కరణకు గురైనా మొత్తానికి 2007 పౌరసత్వం దక్కించుకున్నాడని తెలిపారు. నిజ్జర్ కెనడా పౌరుడు కాదని, అధికారిక తప్పిదాన్ని సరిచేసుకోవడానికి వీలుగా.. మరణానంతరం అతని పౌరసత్వాన్ని రద్దు చేయాలని బెర్నియర్ డిమాండ్ చేశారు. అతని దరఖాస్తు తిరస్కరణకు గురైన మొదటిసారే నిజ్జర్‌ను వెనక్కిపంపాల్సిందన్నారు. -
నిరాధార ఆరోపణలు... అనవసర ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి అడ్డగోలు ఆరోపణలు చేసిన కెనడా తీరును భారత్ మరోసారి తూర్పారబట్టింది. ఈ విషయమై ఏ ఆధారాలూ లేకున్నా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బాధ్యతారహితంగా చేసిన తీవ్ర ఆరోపణలే ఇరు దేశాల మధ్య తాజా దౌత్య వివాదానికి ఆజ్యం పోశాయంటూ ఆక్షేపించింది. నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్లున్నారన్న తన ఆరోపణలకు నిఘా సమాచారమే ఆధారం తప్ప దాన్ని నిరూపించేందుకు ఎలాంటి రుజువులూ తమ వద్ద లేవని ట్రూడో బుధవారం స్వయంగా అంగీకరించడం తెలిసిందే. భారత్‌పై ఆయన ఆరోపణల్లో పస ఎంతో దీన్నిబట్టే అర్థమవుతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. నిజ్జర్ ఉదంతానికి సంబంధించి కెనడా తమకు ఇప్పటిదాకా ఎలాంటి రుజువులూ ఇవ్వలేదని భారత్ పదేపదే చెబుతూ వస్తుండటం తెలిసిందేది.దొంగ ఏడ్పులు...నిజ్జర్ హత్య వెనక కూడా బిష్ణోయ్ గ్యాంగే ఉందని కెనడా చెబుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడా నుంచి భారత్‌లో అరాచకాలకు పాల్పడుతున్న ఆ గ్యాంగ్‌కు చెందిన పలువురు సభ్యులను అరెస్టు చేసి అప్పగించాలని ఎన్నిసార్లు కోరినా స్పందనే లేదని జైస్వాల్ స్పష్టం చేశారు. ‘‘కెనడా గడ్డపై ఉంటూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్తానీ శక్తుల్లో గుర్జీత్‌సింగ్, గుర్జీందర్‌సింగ్, అర్‡్షదీప్‌సింగ్ గిల్, లఖ్బీర్సింగ్ లండా, గుర్‌ప్రీత్‌సింగ్ తదితరుల పేర్లను ట్రూడో సర్కారుకు ఎప్పుడో ఇచ్చాం. వీరిలో పలువురు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులూ ఉన్నారు. వీరంతా ఉగ్రవాదం తదితర తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. వీరిని అప్పగించాల్సిందిగా ఏళ్ల క్రితమే కోరాం. తాజాగా ఇటీవల కూడా విజ్ఞప్తి చేశాం. కానీ కనీస స్పందన లేదు’’ అని వివరించారు. ‘‘ఇలాంటి కనీసం 26 విజ్ఞప్తులు కెనడా వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. భారత భద్రత కోణం నుంచి చూస్తే ఇది చాలా తీవ్రమైన అంశం’’ అని వివరించారు. ‘‘వారిపై కనీసం గట్టి చర్యలైనా తీసుకోవాలని భారత్ ఎన్నిసార్లు కోరినా ట్రూడో సర్కారు పెడచెవిన పెడూతూ వస్తోంది. వారి రెచ్చగొట్టే ప్రసంగాలను భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో చూసీ చూడనట్టు వదిలేస్తోంది’’ అని ఆరోపించారు. ‘‘ఓవైపేమో భారత్ ఎంతగా విజ్ఞప్తి చేసినా వారిని ఉద్దేశపూర్వకంగానే పట్టుకోవడం లేదు. మరోవైపు అదే బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు భారత ఆదేశాల మేరకు తమ దేశంలో అరాచకాలకు పాల్పడుతున్నారంటూ దొంగ ఏడ్పులు ఏడుస్తోంది’’ అంటూ జైస్వాల్ నిప్పులు చెరిగారు. ట్రూడో సర్కారు తాలూకు ఈ ప్రవర్తన కచ్చితంగా రాజకీయ ప్రేరేపితమేనని ఆయన స్పష్టం చేశారు. మరో ఏడాదిలో కెనడాలో ఎన్నికలు జరగనుండటం తెలిసిందే. -
గట్టెక్కిన కెనడా ప్రధాని ట్రూడో
టొరంటో: అవిశ్వాస తీర్మానంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం నెగ్గింది. దీంతో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంటులో బుధవారం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 211 మంది సభ్యులు ఓటేయడంతో తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి మద్దతుగా కేవలం 120 మంది సభ్యులు ఓటేశారు. దీంతో విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ట్రూడో గెలుపు సులువైంది. పెరుగుతున్న ధరలు, గృహ సంక్షోభంపై అసంతృప్తితో ప్రజాదరణ తగ్గిపోయింది. దీనికి తోడు మాంట్రియల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ ఓటమి పాలైంది. న్యూ డెమొక్రటిక్ పార్టీ 2022లో చేసుకున్న ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ట్రూడో ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో పడింది. 2025 అక్టోబర్ చివరిదాకా ప్రభుత్వానికి కాలపరిమితి ఉన్నా మైనారిటీ సర్కార్ కావడంతో అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ పట్టుబట్టడం తెల్సిందే. ‘‘ఈ రోజు దేశానికి మంచి రోజు. కెనడా ప్రజలు ఎన్నికలను కోరుకుంటున్నారని నేను అనుకోవడం లేదు’’ అని ప్రభుత్వ వ్యవహారాల ఇంచార్జ్, సీనియర్ లిబరల్ పార్టీ నేత కరీనా గౌల్డ్ అన్నారు. వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతూ, సమస్య వారీగా చట్టం చేయబోతున్నామని ఆయన తెలిపారు. ముందున్న సవాళ్లు.. అవిశ్వాసం నుంచి గట్టెక్కినా ట్రూడోకు ఇతర సవాళ్లు ఎదురవుతున్నాయి. తమ డిమాండ్లకు అంగీకరించకపోతే ప్రభుత్వాన్ని కూలదోస్తామని బ్లాక్ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు లిబరల్స్ త్వరలో బడ్జెట్‌పై రెండో ఓటింగ్‌ను ఎదుర్కోనున్నారు. 2025 అక్టోబర్ నెలాఖరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో రైట్ ఆఫ్ సెంటర్ కన్జర్వేటివ్ పారీ్టకి భారీ ఆధిక్యం లభించింది. దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని తాము కోరుకుంటున్నామని కన్జర్వేటివ్‌లు చెబుతున్నారు. లిబరల్స్ పాలనలో ఫెడరల్ ఖర్చులు, నేరాలు పెరిగాయని విమర్శిస్తున్నారు. మరోవైపు సీనియర్లకు ఎక్కువ నిధులు ఇస్తే కనీసం డిసెంబర్ నెలాఖరు వరకు ట్రూడోను అధికారంలో ఉంచుతామని, లేదంటే గద్దె దించుతామని బ్లాక్ నాయకులు హెచ్చరిస్తున్నారు. క్యూబెక్‌లో నివసిస్తున్న పాడి రైతులను రక్షించే సుంకాలు, కోటాల వ్యవస్థను పరిరక్షిస్తామని బ్లాక్ నాయకుడు వైవ్స్ ఫ్రాంకోయిస్ బ్లాంచెట్ అన్నారు. అక్టోబర్ 29లోగా ప్రభుత్వం అధికారికంగా ఈ పని చేయకపోతే ట్రూడోను గద్దె దించేందుకు విపక్షాలతో చర్చిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇందులోనూ ఆయన విజయం సాధించాలంటే అవిశ్వాస తీర్మానం సందర్భంగా ట్రూడోకు మద్దతిచ్చిన న్యూ డెమొక్రటిక్ పార్టీ మద్దతు అవసరం. -
Canada: ట్రూడో ప్రభుత్వానికి ముప్పు
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి ఊహించని గట్టి దెబ్బ తగిలింది. ట్రూడో ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు న్యూ డెమొక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) నేత జగ్మీత్ సింగ్ బుధవారం ప్రకటించారు. 2022లో తమ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి తప్పుకొంటున్నట్లు జగ్మీత్ తెలిపారు. తన నిర్ణయాన్ని ఇప్పటికే ప్రధానికి తెలియజేశానని చెప్పారు. దీంతో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో పడింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో బల పరీక్షలో నెగ్గాలంటే ఇతర ప్రతిపక్షాల మద్దతు ట్రూడోకు తప్పనిసరి. అయితే కన్జర్వేటివ్‌లను ట్రూడో ఎదుర్కోలేకపోతున్నారని జగ్మీత్ విమర్శించారు. ట్రూడో ప్రభుత్వం పూర్తిగా స్వార్థపరులతో నిండిపోయిందని, కార్పొరేట్ ప్రపంచానికి కొమ్ముకాస్తోందని జగ్మీత్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తాను ప్రధాని పదవికి పోటీ చేస్తానని జగ్మీత్ తన మనసులో మాట బయటపెట్టారు. 52 ఏళ్ల ట్రూడో తొలిసారిగా 2015 నవంబరులో బాధ్యతలు చేపట్టారు. గత రెండేళ్లుగా అధిక ద్రవ్యోల్బణం,గృహనిర్మాణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గత రెండు ఎన్నికలలోనూ లిబరల్స్ మెజారిటీ సాధించలేదు. ఎన్డీపీ మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ట్రూడో పాలిస్తున్నారు. 2015 నవంబర్‌లో తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన ట్రూడో పట్ల ప్రస్తుతం ఓటర్లలో వ్యతిరేకతతో ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే తాను ఘోరంగా ఓడిపోతానని సర్వేలు చెబుతున్న తరుణంలో పార్లమెంటు దిగువ సభలో విశ్వాస పరీక్షలో నెగ్గడానికి ట్రూడో ప్రతిపక్ష సభ్యుల మద్దతుపై ఆధారపడాల్సి వస్తుంది. కెనడా చట్టం ప్రకారం 2025 అక్టోబర్ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలి. సెప్టెంబర్ 16న హౌస్ ఆఫ్ కామన్స్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ట్రూడో ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోతే సార్వత్రిక ఎన్నికలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికల వార్తలను ట్రూడో తోసిపుచ్చారు. న్యూ ఫౌండ్ ల్యాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రూడో మీడియాతో మాట్లాడారు. కెనడియన్లకు సేవలందించడంపై తాను ప్రత్యేకంగా దృష్టి పెడతానని ఆయన చెప్పారు. ఇతర రాజకీయాలపై దృష్టి పెట్టబోమని ఆయన స్పష్టంచేశారు. వచ్చే సంవత్సరమే ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. దానివల్ల తమ ప్రభుత్వం సొంత ఎజెండాతో ముందుకు సాగడానికి సమయం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
Canada–India relations: నిజ్జర్ హత్యపై ఆధారాలిచ్చాం
టొరంటో/న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారత్‌పై విమర్శలు చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయంపై తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలను భారత ప్రభుత్వానికి చాలా వారాల క్రితమే అందజేసినట్లు ట్రూడో తెలిపారు. తీవ్రమైన ఈ అంశంలో వాస్తవాలను ధ్రువీకరించే విషయంలో నిర్మాణాత్మకంగా భారత్ వ్యవహరించాలని తాము కోరుకుంటున్నామన్నారు. భారత్ స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్నారు. కెనడాతో భారత్ సహకిస్తుందని ఆశిస్తున్నామన్నారు. దీనివల్ల సమస్య మూలాల్ని తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు. అయితే, అది ఎలాంటి సమాచారమో ఆయన వెల్లడించలేదు. కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాతో మాట్లాడుతూ.. ‘కెనడా ప్రధాని చెబుతున్నట్లుగా గతంలో గానీ, ఇప్పుడు గానీ అటువంటి సమాచారం భారత ప్రభుత్వానికి అందనేలేదు. అటువంటిదేమైనా ఉంటే భారత ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుంది. ఇదే విషయాన్ని కెనడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం’అని స్పష్టం చేశారు. గతంలో కెనడా గడ్డపై భారత వ్యతిరేక హింసాత్మక చర్యలకు సంబంధించిన సమాచారం అందజేసినప్పుడు అటువైపు నుంచి స్పందన రాలేదని గుర్తు చేశారు. జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వ ఏజెంట్లకు దగ్గరి సంబంధం ఉందనే విషయంలో కెనడా నిఘా సంస్థలు చురుగ్గా దర్యాప్తు చేపట్టాయంటూ గత వారం ట్రూడో కెనడా పార్లమెంట్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీటిని భారత్ తీవ్రంగా ఖండించింది. అప్పటినుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆ ఆరోపణలు ఆందోళనకరం: అమెరికా ఖలిస్తానీ వేర్పాటువాది హత్యకు సంబంధించి భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు. బ్లింకెన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘భారత్‌నుద్దేశించి ప్రధానమంత్రి ట్రూడో చేసిన ఆరోపణలపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. దీనిపై కెనడా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లా డుతున్నాం. భారత ప్రభుత్వంతో కూడా ప్రస్తావించాం. దర్యాప్తులో భారత్ సహకరించడం ఎంతో కీలకం. నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి బాధ్యులను తేల్సాల్సిన అవసరం ఉంది’అని ఆయన అన్నారు. భారత్‌పై ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణల వెనుక ఫైవ్ ఐస్ నుంచి అందిన నిఘా సమాచారమే ఆధారమని కెనడాలో అమెరికా రాయబారి డేవిడ్ కోహెన్ చెప్పారు. మత పెద్ద కాదు.. ఉగ్రవాదే: భారత్ నిజ్జర్ ఉగ్రవాదేనని భారత్ స్పష్టం చేసింది. ఉగ్ర శిక్షణ శిబిరాల నిర్వహణ, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సేకరించడం వంటి వాటితో అతడికి సంబంధాలున్నాయంది. అతడు ప్రముఖుడు కాదని పేర్కొంది. నిషేధిత ఖలిస్తాన్ కమాండో ఫోర్స్(కేసీఎఫ్)కు చెందిన గుర్దీప్ సింగ్ అలియాస్ హెరాన్వాలాకు అతడు సన్నిహితుడని తెలిపింది. 1980–90 మధ్య కాలంలో పంజాబ్‌లో గుర్దీప్ సింగ్200 వరకు హత్యలకు పాల్పడినట్లు గుర్తు చేసింది. బలవంతంపు వసూళ్లు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసుల్లో ఉన్న నిజ్జర్ పోలీసుల అరెస్టు భయంతో 1996లో నకిలీ ధ్రువపత్రాలతో భారత్ నుంచి కెనడాకు పరారయ్యాడని అధికార వర్గాలు తెలిపాయి. ఇంటర్నెట్లో చూసే తెలుసుకున్నా ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయం తాను ఇంటర్నెట్లోనే చూశానని బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్ డేవిడ్ ఈబీ చెప్పారు. తనకీ విషయాలను దర్యాప్తు అధికారులెవరూ తెలపకపోవడం నిరుత్సాహం కలిగించిందన్నారు. ఫెడరల్ ప్రభుత్వం కీలకమైన సమాచారాన్ని అందించకపోవడంతో స్థానికంగా పౌరులకు భద్రత కల్పించే చర్యలపై తమ వంతుగా స్పందించలేకపోయామన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను ఆస్తులు జప్తు కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఆస్తుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) స్వాధీనం చేసుకుంది. 2020లో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం(యూఏపీఏ)కింద నమోదైన కేసుకు సంబంధించి మొహాలిలో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) జనరల్ కౌన్సిల్‌గా చెప్పుకునే పన్నుకు చెందిన అమృత్‌సర్‌లోని ఖాన్కోట్ గ్రామంలో ఉన్న 5.7 ఎకరాల వ్యవసాయ భూమి, చండీగఢ్‌లోని సెక్టార్ 15/సి ప్రాంతంలోని ఇంటిలో కొంతభాగం ఉన్నాయన్నారు. -
ప్రెసిడెన్షియల్ సూట్ వద్దన్నాడు.. విమానాన్ని కాదన్నాడు!
న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌లో జీ20 సదస్సుకి వచ్చినప్పుడు కాస్త విభిన్నంగా వ్యవహరించినట్టుగా ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. వివిధ దేశాల అధినేతల కోసం కేంద్ర ప్రభుత్వం హోటల్స్‌లో భారీగా భద్రత ఏర్పాట్లు చేసిప్రెసిడెన్షియల్ సూట్లను సిద్ధం చేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కోసం హోటల్ లలిత్‌లో ప్రెసిడెన్షియల్ సూట్ ఏర్పాటు చేశారు. ట్రూడో దానిని తిరస్కరించి అదే హోటల్లో సాధారణ గదిలో బస చేశారు. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని అభాండాలు వేస్తున్న ట్రూడో తన భద్రతాధికారుల సూచన మేరకే ఇలా చేసినట్టుగా తెలుస్తోంది. అదే విధంగా ట్రూడో సొంత విమానానికి సాంకేతిక లోపాలు తలెత్తి ఆయన ప్రయాణం వాయిదా పడింది. అప్పుడు భారత్ ఎయిర్ ఇండియా వన్ విమానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినా ట్రూడో తిరస్కరించారు. తన విమానం సిద్ధమయ్యాక రెండు రోజుల తర్వాత సెప్టెంబర్ 12న బయల్దేరి వెళ్లారు. -
చేజేతులా చేసుకున్నదే!
జీ20 ముగిసినా దాని ప్రకంపనలింకా తగ్గలేదు. ఢిల్లీ శిఖరాగ్ర సదస్సుకు హాజరై, భారత ఆత్మీయ ఆతిథ్యాన్ని అందుకున్న మిగతా ప్రపంచ నేతలందరికీ ఇది చిరస్మరణీయ అనుభవమేమో కానీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు మటుకు ఇది పీడకలగా పరిణమించింది. భారత ప్రధాని నుంచి సాదర స్వాగతం అందకపోగా, ఖలిస్తానీ తీవ్రవాదులకు అడ్డుకట్ట వేయకపోవడంపై ద్వైపాక్షిక చర్చల్లోనూ భారత్ ఆయనకు తలంటి పంపినట్టు వార్త. ఎలాగోలా సదస్సు ముగియగానే తిరుగు ప్రయాణం అవుదామంటే ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్యలు. భారత్‌లో కెనడా ప్రధాని చేదు అనుభవాలన్నీ సొంత గడ్డపై ప్రతిపక్షాలకు కావాల్సినంత మేత ఇచ్చాయి. మంగళవారం ట్రూడో తిరుగు పయనమయ్యారు కానీ, భారత్ పర్యటనలో ఆయనకు వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. భారత్ నుంచి పంజాబ్‌ను వేరుచేయాలని కోరుతున్న ఖలిస్తానీ ఉద్యమకారులు, వారి మద్దతు దార్లపై కెనడా మెతకగా వ్యవహరిస్తోందని భారత వాదన. ట్రూడో మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ తమ దేశీయ విధానమని సమర్థించుకుంటున్నారు. తమ అంతర్గత రాజకీయాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందనేది కెనడా సర్కార్ ఆరోపణ. జీ20 వేళ ఆదివారం ట్రూడో, మోదీల మధ్య భేటీలో ఇరుపక్షాలూ తమ తమ ఆందోళనలు వ్యక్తం చేశాయి. భారత– కెనడా సంబంధాలు ఇటీవల అంత కంతకూ దిగజారుతున్నాయనడానికి ఆ భేటీ వార్తలే తార్కాణం. ఇరుదేశాల మధ్య చర్చల్లో ఉన్న వాణిజ్య ఒప్పందమూ నత్తనడకన సాగే ప్రమాదంలో పడింది. ఇది ఎవరికీ శ్రేయోదాయకం కాదు. గతంలో 2018లో ప్రధానిగా ట్రూడో తొలి భారత సందర్శన సైతం ఘోరంగా విఫలమైంది. శిక్ష పడ్డ తీవ్రవాదిని విందుకు ఆహ్వానించి, అప్పట్లో ఆయన గందరగోళం రేపారు. అప్పటితో పోలిస్తే, ఇప్పటి పర్యటన మరీ ఘోరం. కీలక మిత్రదేశాల నుంచి దూరం జరిగిన కెనడా, భారత్‌తో తనబంధాన్ని మరింత బలహీనపరుచుకుంది. వెరసి, ఈ ప్రాంతంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్‌లు రెంటికీ కెనడా దూరమైంది. ఎన్నికల్లో జోక్యం, కెనడియన్ పౌరుల కిడ్నాప్, ఆర్థిక యుద్ధతంత్రం వగైరాల వల్ల చైనాకు దూరం జరగడం అర్థం చేసుకోదగినదే. కానీ, రాజకీయ కారణా లతోనే ట్రూడో భారత్‌ను దూరం చేçసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కెనడా జనాభా 4 కోట్ల యితే, భారత జనాభా 140 కోట్లు. కెనడా ఆర్థిక వ్యవస్థకు భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు రెట్టింపు. అలా చూస్తే, భారత్‌తో బంధం కెనడాకు అవసరం, లాభదాయకం. ఆ సంగతి ట్రూడో విస్మరించారు. మునుపటి ప్రధాని స్టీఫెన్ హార్పర్ హయాంలో ఢిల్లీతో వాణిజ్యాన్ని ఒటావా విస్తరించింది. వ్యవసాయ సామగ్రి, ఎరువులు, అణువిద్యుత్‌కు అవసరమయ్యే యురేనియమ్ భారత్‌కు కెనడా అందిస్తూ వచ్చింది. ట్రూడో హయాంలో ఎలాంటి వివరణా ఇవ్వకుండానే ఇటీవలే సరికొత్త వాణిజ్య ఒప్పందంపై చర్చల్ని ఆపేశారు. భారత్‌లో మోదీ విధానాలు కెనడాలో తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తాయని ట్రూడో భావన. అందుకే, వీలైనంత దూరం జరగాలని చూస్తున్నారు. కెనడాలో ఎక్కువగా ప్రవాసీ సిక్కులుండడంతో, వారి మద్దతుకై తంటాలు పడుతున్నారు. భారత్‌లో 2020 నాటి రైతుల ఆందోళనలపై ట్రూడో మాట్లాడుతూ ఇప్పుడు జీ20లో అన్నట్టే భావప్రకటన స్వేచ్ఛల్ని ప్రబోధించారు. తీరా కెనడాలో అలాంటి నిరసనలే ఎదురైతే, అత్యవసర చట్టం ప్రయోగించారు. మైనారిటీలపై మోదీ ప్రభుత్వ కఠిన వైఖరిని తప్పుపడుతున్న ట్రూడో కెనడాలో చేస్తున్నది అదే! అంతర్జాతీయ సంబంధాల్లో కెనడా ఇప్పుడు దోవ తప్పింది. ఐరాస భద్రతామండలి తాత్కాలిక సభ్యత్వం కోసం ఆ దేశం చేసిన గత రెండు ప్రయత్నాలూ విఫలమయ్యాయి. 20వ శతాబ్దిలో శాంతి పరిరక్షణ ప్రయత్నాలకు మారుపేరుగా, ఐరాస శాంతిపరిరక్షక దళానికి సృష్టికర్తగా నిలిచిన కెనడా ఇప్పుడు ఆ ఊసే ఎత్తని స్థితికి చేరింది. ఒకప్పుడు వర్ణవివక్షపై పోరాటంలో, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏర్పాటులో ముందుండి, మానవ భద్రతకై మందుపాతరల నిషేధ ఒప్పందం కావాలని కూడా పోరాడిన దేశం గత రెండు దశాబ్దాల్లో ఊహించని మార్గం పట్టింది. 2005 తర్వాత ఆ దేశం తన విదేశాంగ విధానాన్ని సమీక్షించుకోనే లేదు. దేశంలో, ప్రపంచ పరిస్థితుల్లో శరవేగంతో మార్పులు వచ్చినా ఎప్పటికప్పుడు తాత్కాలిక ప్రతిస్పందనతోనే విదేశాంగ వాహనాన్ని నెట్టుకొస్తోంది. ఫలితంగా ప్రపంచంలో కెనడా పేరుప్రతిష్ఠలే కాదు... ప్రభావమూ దెబ్బతింటోంది. తక్షణమే కెనడా విదేశాంగ విధానానికి దశ, దిశ కావాలని విశ్లేషకులు అంటున్నది అందుకే! గత ఇరవై ఏళ్ళలో డయాస్పొరా రాజకీయాలు, వ్యక్తిగత రాగద్వేషాలతో కెనడా విదేశాంగ విధానం తప్పటడుగులు వేస్తోంది. మధ్యప్రాచ్యంపై మునుపటి హార్పర్ ప్రభుత్వం, భారత్‌తో వ్యవహారంలో ఇప్పటి ట్రూడో సర్కార్ వైఖరి అందుకు మచ్చుతునక. చమురు, సహజవాయువు, జలవిద్యుచ్ఛక్తి ఉత్పత్తిలో కెనడాది అగ్రపీఠం. అలాగే, యురేనియమ్, అనేక కీలక ఖనిజాలు అక్కడ పుష్కలం. దాన్ని సానుకూలంగా మలుచుకొని విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దుకొనే అద్భుత అవకాశం ఉన్నా అక్కడి పాలకులు ఆ పని చేయట్లేదు. ఇప్పటికైనా కెనడా బయటి ఒత్తిళ్ళను బట్టి నడవడం మానాలి. దేశాన్ని కలసికట్టుగా నిలిపే స్పష్టమైన లక్ష్యాలను పౌరులకు అందించాలి. కీలక అంతర్జాతీయ అంశాల్లో తమ వైఖరిని స్పష్టం చేయాలి. భారత్‌తో బంధాన్ని మళ్ళీ బలోపేతం చేసుకోవడంతో ఆ పనికి శ్రీకారం చుట్టాలి. ఎందుకంటే, పాలకుల పనికిమాలిన చర్యల వల్ల కెనడాకు ఆర్థిక నష్టం కలిగితే అది పాలకుల పాపమే. ట్రూడో ఇకనైనా స్వార్థ రాజకీయ ప్రయోజనాలు వదిలి, విశ్వవేదికపై సమస్త కెనడియన్ల ప్రయోజనాలపై దృష్టి పెడితే మంచిది. -
ఎట్టకేలకు భారత్ వీడిన కెనడా ప్రధాని.. రెండు రోజులు ఆలస్యంగా
న్యూఢిల్లీ: విచ్చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎట్టకేలకు భారత్‌ను వీడారు. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్‌కి వచ్చిన ఆయన.. మంగళవారం కెనడాకు బయల్దేరి వెళ్లారు. వాస్తవాడానికి ట్రూడో సమ్మిట్‌లో పాల్గొన్న తర్వాత సెప్టెంబర్ 10న (ఆదివారం) సాయంత్రం తిరిగి స్వదేశానికి వెళ్లాల్సి ఉంది. కానీ ముందస్తు తనిఖీ సమయంలో ఆయన అధికారిక విమానంలో(ఎయిర్‌బస్ CFC001) సాంకేతిక సమస్య తలెత్తడంతో రెండు రోజులుగా భారత్‌లోనే చిక్కుకుపోయారు. దీంతో 36 గంటలపాటు ట్రూడో, ఆయన బృందం ఢిల్లీలోనే స్టే చేయాల్సి వచ్చింది. రెండు రోజుల అనిశ్చితి అనంతరం కెనడా ప్రధాని చివరకు నేడు(మంగళవారం) మధ్యాహ్నం 1.10 గంటలకు స్వదేశానికి బయలుదేరారు. ఆయన విమానంలో సాంకేతిక లోపాన్ని సరిదిద్దినట్లు, ఇప్పుడు ఇది ఎగరడానికి సిద్ధంగా ఉందని కెనడా ప్రధాన మంత్రి కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వీడ్కోలు పలికారు. ట్రూడో క్షేమంగా కెనాడాకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఒకవైపు ట్రూడోను తీసుకెళ్లడానికి కెనడా ఎయిర్‌ఫోర్స్ మరో విమానం భారత్‌కు తరలిస్తున్న సమయంలో ఈ సమస్య కొలిక్కి రావడం గమనార్హం. ఇక కెనడా అధికారిక విమానాలు ఆ దేశ ప్రధానిని ఇబ్బంది పెట్టడం ఇదే మొదటిసారి కాదు. 2016లో యూరోపియన్ యూనియన్‌తో చర్చల కోసం బెల్జియం బయల్దేరిన కెనడా ప్రధాని విమానంలో సాకేంతిక సమస్య తలెత్తడంతో టేకాఫ్ అయిన అరగంటలోనే తిరిగి కెనడాకే రావాల్సి వచ్చింది. ఇక 2019 అక్టోబర్‌లోనూ ట్రూడో వీఐపీ విమానం ఓ గోడను పొరబాటున ఢీకొంది. అప్పట్లో దీని ముక్కుభాగం, కుడిభాగం ఇంజిన్ దెబ్బతింది. దీంతో ఆ విమానాన్ని పలు నెలలపాటు వాడకుండా పక్కకు పడేశారు. చదవండి: Monu Manesar: గోసంరక్షకుడు మోను మనేసర్ అరెస్ట్ అదే ఏడాది డిసెంబర్లో ట్రూడో నాటో సమ్మిట్‌కు హాజరు కావడానికి బ్యాకప్ విమానాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. అయితే రాయల్ కెనడియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో లోపం ఉన్నట్లు గుర్తించినందున ఆ జెట్ కూడా లండన్‌లో నిలిచిపోయింది. వరుస షాక్‌లు ఇదిలా ఉండగా.. ట్రూడో భారత్ పర్యటన మొత్తం గందరగోళంగానే గడించింది. ఇందుకు ఆయన అందరితోనూ అంటీ ముట్టన్నట్లుగా వ్యవహరించడమే కారణం. అమెరికా, బ్రిటన్, భారత్, యూఏఈ దేశాల అధినేతలతో జస్టిన్ ట్రూడో కలవలేదు. ప్రధాన వేదికపై కూడా ఆయన కనిపించలేదు. చివరికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించిన విందులోనూ కూడా ఆయన కనిపించలేదు. ప్రపంచ దేశాధినేతలు రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించే సమయంలో కూడా ట్రూడో ఎవరితో పెద్దగా కలవకుండా ఉన్నారు. ట్రూడో జీ20 పర్యటనపై స్వదేశంలో కూడా విమర్శలు వస్తున్నాయి. సదస్సులో మిగిలిన దేశాధినేతలతో సరిగా కలవలేదని, ట్రూడోను ఎవరూ పట్టించుకోలేదని.. ఆయన్ను పక్కకు పెట్టారని అక్కడి పత్రికలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చదవండి: LIbiya: లిబియాలో పెను విపత్తు.. 2000 మందికిపైగా మృతి కాగా జీ20 సదస్సు నేపథ్యంలో మోదీ ట్రూడో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా అడ్డాగా మారుతుందనే విషయాన్ని ఏకంగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ట్రూడో దృష్టికి మోదీ తీసుకెళ్లారు. ఇది కెనడాకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. తీవ్రవాద శక్తులు కెనడా కేంద్రంగా భారత్‌పై విషం చిమ్ముతున్నాయని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. కెనడాలో నివసిస్తున్న భారతీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, భారత దౌత్యవేత్తలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తున్నాయని వెల్లడించారు.. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలంటే పరస్పర గౌరవం, విశ్వాసం చాలా ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. -
తీవ్రవాద శక్తులపై కఠిన చర్యలు తీసుకోండి.. కెనడాకు మోదీ సూచన
న్యూఢిల్లీ: భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా అడ్డాగా మారుతుండడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ట్రూడో దృష్టికి తీసుకెళ్లారు. తీవ్రవాద శక్తులు కెనడా కేంద్రంగా భారత్‌పై విషం చిమ్ముతున్నాయని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని పేర్కొన్నారు. కెనడాలో నివసిస్తున్న భారతీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, భారత దౌత్యవేత్తలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తున్నాయని వెల్లడించారు. కెనడాలోని భారతీయుల ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. భారత దౌత్య కార్యాలయాలపై దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలతో, మాదక ద్రవ్యాల ముఠాలతో, మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారితో తీవ్రవాద శక్తులు అంటకాగుతున్నాయని, ఈ పరిణామం కెనడా భద్రతకు సైతం ముప్పేనని తేల్చిచెప్పారు. ఈ అవాంఛనీయ ధోరణికి తక్షణమే అడ్డుకట్ట వేయాలని, తీవ్రవాద శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని జస్టిన్ ట్రూడోకు సూచించారు. తీవ్రవాదులను ఏరిపారేయడానికి భారత్, కెనడా పరస్పరం కలిసి పనిచేయాలని చెప్పారు. జీ20 సదస్సు నేపథ్యంలో మోదీ, ట్రూడో ఆదివారం ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్, కెనడాకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై చర్చించుకున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలంటే పరస్పర గౌరవం, విశ్వాసం చాలా ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. విభిన్న రంగాల్లో భారత్–కెనడా సంబంధాలపై ట్రూడోతో విస్తృతంగా చర్చించినట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. చదవండి: మహాత్ముని పలుకులే భారత్–అమెరికా మైత్రికి మూలం విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు: ట్రూడో భారత్ తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ప్రశంసించారు. వాతావరణ మార్పులపై పోరాటం, ఆర్థిక ప్రగతి వంటి అంశాల్లో భారత్, కెనడా కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. మోదీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కెనడాలో ఇటీవలి కాలంలో ఖలిస్తాన్ అనుకూల శక్తుల కార్యకలాపాలు పెరగడంపై స్పందిస్తూ.. తమ దేశంలో హింసకు తావులేదని, విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించుకొనే హక్కు ప్రజలకు ఉందన్నారు. ఎవరో కొందరు వ్యక్తుల చర్యలను మొత్తం సామాజిక వర్గానికి ఆపాదించడం సరైంది కాదన్నారు. మోదీతో జరిగిన చర్చల్లో ఖలిస్తాన్ తీవ్రవాదం ప్రస్తావనకు వచ్చిందని వెల్లడించారు. భారత్, కెనడా మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని వివరించారు. -
కెనడా ప్రధాని ట్రూడో దంపతుల విడాకులు.. 18 ఏళ్ల వైవాహిక బంధం
టొరంటో: దాదాపు 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకబోతున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దంపతులు బుధవారం ప్రకటించారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్టు ట్రూడో, ఆయన భార్య సోఫీ గ్రెగరీ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఈ జంట ఇప్పటికే తమ విడాకుల సంబంధ చట్టపర అంగీకార పత్రంపై సంతకాలు చేసినట్టు ప్రధాని కార్యాలయం పేర్కొంది. వారు 2005 ఏడాదిలో వివాహం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అధికారంలో ఉంటూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన రెండో కెనడా ప్రధాని ట్రూడో. ఆయన తండ్రి, మాజీ ప్రధాని పియరీ ట్రూడో కూడా విడాకులు తీసుకున్నారు. దేశంలో అత్యంత ప్రభావశీల వ్యక్తిగా పేరొందిన తండ్రి నుంచి జస్టిన్ రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకున్నారు. 2015లో ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. -
సంచలనం: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హత్యకు ప్లాన్
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హత్యకు జరిగిన కుట్ర జరిగింది. ఈ హత్యకు పాల్పడాలని అనుకుంది ఎవరో కాదు.. యువ నటుడు ర్యాన్ గ్రాంథమ్(24). తల్లి హత్యకేసులో నిందితుడిగా కోర్టు విచారణ ఎదుర్కొంటున్న ర్యాన్ గ్రాంథమ్.. ఈ సంచలన వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘రివర్‌డేల్’, ‘డెయిరీ ఆఫ్ ఏ వింపీ కిడ్’ ఫేమ్ ర్యాన్ గ్రాంథమ్.. కెనడా ప్రధాని ట్రూడో హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. 2020 మార్చి 31వ తేదీన స్క్వామిష్ టౌన్హౌజ్లో తన ఇంట్లో తల్లి బార్బరాను తల వెనుక భాగంలో తుపాకీతో కాల్చి చంపాడు. ఈ కేసు బ్రిటిష్ కొలంబియా సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తల్లిని హత్య చేసిన తర్వాత.. తన కారులో ఆయుధాలను, మందు గుండును, మ్యాప్ సాయంతో కెనడా రిడ్యూ కాటేజ్ వైపు బయలుదేరాడు గ్రాంథమ్. అక్కడే ప్రధాని జస్టిన్ ట్రూడో తన కుటుంబంతో ఉంటున్నారు. ఈ విషయాన్ని పోలీసుల స్టేట్మెంట్లో గ్రాంథమ్ నిర్ధారించాడు కూడా. ఇదిలా ఉంటే.. గ్రాంథమ్ మానసిక స్థితి బాగోలేదని, చాలా కాలంగా డిప్రెషనలో ఉన్నాడని, ప్రధాని నివాసంలో తాను సృష్టించాలనుకున్న నరమేధం తాలుకా ట్రయల్స్‌లో భాగంగానే.. తల్లిని హతమార్చి ఉంటాడని ప్రాసెక్యూటర్ డోన్నెల్లీ కోర్టుకు వెల్లడించారు. అయితే తాను వాన్కోవర్ పోలీసులకు లొంగిపోవాలనే వెళ్లినట్లు నిందితుడి తరపున ప్రాసిక్యూటర్ వాదించారు. రివర్డేల్లోనూ ర్యాన్ పాత్ర ‘కిల్లర్’ కావడం గమనార్హం. -
ఇది పూర్తిగా మనసును కదిలించే విషాదం: భారతీయుల మృతిపై కెనడా ప్రధాని
కెనడా అమెరికా సరిహద్దు ప్రాంతంలోని తీవ్రమైన గడ్డకట్టే చలి కారణంగా శిశువుతో సహా నలుగురు భారతీయులు మృతి చెందారు. ఈ సంఘటన మనసుని కదిలించే" విషాదంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూడో శుక్రవారం మాట్లాడుతూ... "అమెరికా సరిహద్దుల గుండా ప్రజల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తోంది. ఇది పూర్తిగా మనసును కదిలించే విషాదం. మానవ అక్రమ రవాణాదారుల బాధితులు...మెరుగైన జీవితాన్ని నిర్మించుకోవాలనే కోరిక నెరవేరకుండానే ఆ కుటుంబం అలా చనిపోవడం చాలా విషాదకరం. ప్రజలు అక్రమంగా సరిహద్దులు దాటకుండా కట్టడిచేసేలా తాము చేయగలిగినదంతా చేస్తున్నాం." అని అన్నారు. పైగా కెనడా స్మగ్లింగ్‌ను ఆపడానికి , ప్రజలకు సహాయం చేయడానికి యునైటెడ్ స్టేట్స్తో కలిసిపనిచేస్తోందని ట్రుడో చెప్పారు. అక్రమ వలసదారులు సాధారణంగా అమెరికా నుండి కెనడాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారని కెనడియన్ అధికారులు వెల్లడించారు. అయితే 2016లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత నుంచే కెనడాలోకి కాలినడకన సరిహద్దు దాటడం పెరిగిందని తెలిపారు. ఈ మేరకు గురువారం మానిటోబా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్(ఆర్సీఎంపీ) నలుగురి మృతదేహాలను దక్షిణ మధ్య మానిటోబాలోని ఎమర్సన్ ప్రాంతానికి సమీపంలో యుఎస్ కెనడా సరిహద్దులోని కెనడియన్ వైపు కనుగొన్నాం అని చెప్పారు. అయితే మృతులంతా గుజరాత్‌కి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు అని, తీవ్రమైన చలికి గురికావడం వల్లే మరణించారని తెలిపారు. ఈ మేరకు ఆర్సీఎంపీ నాలుగు మృతదేహాలను కనుగొన్న వెంటనే అసిస్టెంట్ కమిషనర్ జేన్ మాక్‌లాచీ దీనిని హృదయ విదారక విషాదంగా పేర్కొన్నారు. పైగా మంచుతుఫానులో ఈ కుటుంబం చిక్కుకున్నట్లు తాము గుర్తించాం అని చెప్పారు. ఈ మేరకు కెనడాలోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా మరణించిన వారి జాతీయతను ధృవీకరించడమే కాక, ఈ సంఘటనను తీవ్ర విషాదంగా అభివర్ణించారు. అంతేకాదు బిసారియా మాట్లాడుతూ...ఇది ఘోరమైన విషాదం. సమన్వయ సహాయం కోసం భారత కాన్సులర్ బృందం మానిటోబాకు వెళ్లనుంది. ఈ ఆందోళనకరమైన సంఘటనలను పరిశోధించడానికి మేము కెనడియన్ అధికారులతో కలిసి పని చేస్తాము" అని బిసారియా ట్వీట్ చేశారు. (చదవండి: ఎమర్జెన్సీ ల్యాడింగ్ తర్వాత ప్రయాణికులకు ఝలక్ ఇచ్చిన పైలెట్..) -
హ్యాట్రిక్ కొట్టిన ట్రూడో
టొరాంటో: కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పార్లమెంటు ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. అయితే మెజార్టీ సీట్లు సాధించాలన్న ఆయన కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. ప్రపంచంలో మరే దేశం సాధించలేని విధంగా కరోనా కొమ్ములు వంచిన ఆయన దానినే ఎన్నికల అస్త్రం చేసుకొని రెండేళ్లు ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. ఈ సారి మెజార్టీ ప్రభుత్వం ఏర్పడితే విధాన పరమైన నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకోవచ్చునని ఆశించారు. కానీ ఇంచుమించుగా 2019 నాటి ఎన్నికల ఫలితాలే పునరావృతమయ్యాయి. 338 స్థానాలున్న కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో అధికార లిబరల్ పార్టీ 156 స్థానాలను గెలుచుకోగా, కన్జర్వేటివ్ పార్టీ 121 స్థానాలకు పరిమితమైనట్టుగా ప్రాథమిక ఫలితాలు వెల్లడిస్తున్నాయి. మేజిక్ మార్కు 170 దాటుతుందనుకున్న ట్రూడో ఆశలు నిరాశయ్యాయి. 27 స్థానాలను దక్కించుకున్న న్యూ డెమొక్రాటిక్ పార్టీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న ప్రధాని జస్టిన్ ట్రూడో థాంక్యూ కెనడా అంటూ వినమ్రంగా ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే, ముందస్తు ఎన్నికలతో కెనడా ప్రజలపై ఎన్నికలు ఆర్థిక భారాన్ని మోపడం మినహా ప్రయోజనమేదీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముందుగా ఎన్నికలకు వెళ్లి ట్రూడో సాధించిందేమిటో చెప్పాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఓటమి అంగీకరించిన ఎరిన్.. ప్రతిపక్ష కన్జర్వేటివ్ నాయకుడు ఎరిన్ ఒ టూలే తన ఓటమిని అంగీకరించారు. మూడోసారి ప్రధాని అయిన ట్రూడోని అభినందించారు. అయితే ఎన్నికల్లో ఆయన ట్రూడోకి గట్టి పోటీయే ఇచ్చారు. -
ముందస్తు మంత్రం ఫలిస్తుందా?
ఒట్టావా: కెనడా పార్లమెంటుకి రెండేళ్లు గడువు ఉండగానే ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 20న (సోమవారం) జరిగే పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికార లిబరల్ పార్టీ, ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. కఠినమైన ఆంక్షల్ని విధించి కరోనా మహమ్మారి కొమ్ములు వంచిన దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అదే తనని మళ్లీ విజయతీరాలకు నడిపిస్తుందన్న ధీమాతో ఉన్నారు. కరోనాని ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకొని కన్జర్వేటివ్ నాయకుడు ఎరిన్ ఒ టూలే ఢీ అంటే ఢీ అంటున్నారు. కెనడాలో సాధారణంగా ఎన్నికలు జరిగిన రోజే ఫలితాలు కూడా ప్రకటిస్తారు. కానీ, ఈసారి కరోనా ముందు జాగ్రతల్లో భాగంగా భౌతికదూరం పాటించాలని ఎక్కువ మంది ఓటర్లు మెయిల్ ఇన్ ఓటు విధానాన్ని ఎంపిక చేసుకున్నారు. దీంతో ఫలితం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకీ ముందస్తు ఎన్నికలు 338 స్థానాలున్న కెనడా పార్లమెంటులో లిబరల్ పార్టీకి ప్రస్తుతం 155 మంది సభ్యుల బలమే ఉంది. ఇతర పార్టీలతో కలిసి మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న ప్రధాని ట్రూడో కీలక నిర్ణయాలకి భాగస్వామ్యపక్షాలపై ఆధారపడాల్సి వస్తోంది. కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొన్నందుకు ప్రజలు ఆదరిస్తారని, అత్యధిక సీట్లు సాధించి మెజార్టీ ప్రభుత్వాన్ని నడిపించాలన్న ఆశతో ట్రూడో రెండేళ్లు గడువు ఉండగానే ఎన్నికలకు వెళుతున్నారు. ఆగస్టు 15న ట్రూడో ముందస్తు ఎన్నికపై ప్రకటన చేస్తూ కోవిడ్‌ని తరిమికొట్టినవారే దేశ పునర్నిర్మాణాన్ని చేయగలరంటూ పిలుపునిచ్చారు. 2015లో తొలిసారిగా నెగ్గిన ట్రూడో హ్యాట్రిక్ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. గట్టిపోటీ ఇస్తున్న ఎరిన్ ట్రూడోకి కన్జర్వేటివ్ పార్టీ నేత ఎరిన్ ఒ టూలే నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కెనడాలో ఈ మధ్య మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో దానిని ఎన్నికల సభల్లో ఎరిన్ ప్రస్తావిస్తున్నారు. ‘‘కోవిడ్ ఫోర్త్‌వేవ్ ముంగిట్లో ఉన్నాం. ఈ సమయంలో ఎన్నికలకు వెళితే మళ్లీ కేసులు పెరిగిపోతాయి. పరిస్థితి మొదటికొస్తుంది. అదే నాకు ఆందోళనగా ఉంది’’అంటూ ఎరిన్ పదే పదే చెబుతూ ఓటర్ల మైండ్‌సెట్‌ను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు ప్రకటించిన సమయంలో అధికార లిబరల్స్కి 35.6% ఓటర్ల మద్దతు ఉందని, కన్జర్వేటివ్స్‌కి 28.8% ఓటర్ల మద్దతు ఉందని సీబీసీ న్యూస్ పోల్ ట్రాకర్‌లో వెల్లడైతే, తాజాగా.. లిబరల్స్కి 31.6%, కన్జర్వేటివ్లకి 31.1% మంది ఓటర్ల మద్దతు ఉందని తేలింది. అయితే ఎవరు నెగ్గినా మెజార్టీ స్థానాలు దక్కవన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. బరిలో 49 మంది భారతీయులు కెనడా ఎన్నికల్లో మనోళ్లు కూడా సత్తా చాటుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో భారతీయ మూలాలున్న కెనడియన్లు 20 మంది పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అందులో నలుగురు ట్రూడో ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఈసారి 49 మంది ప్రవాస భారతీయులు ఎన్నికల బరిలో నిలిచారు. లిబరల్ పార్టీ నుంచి 15 మంది, కన్జర్వేటివ్ పార్టీ నుంచి 16 మంది ఉండగా ఇతర పార్టీలు కూడా భారతీయులకు టిక్కెట్లు ఇచ్చాయి. -
విదేశీ సంబంధాలపై బైడెన్ దృష్టి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విదేశాలతో సంబంధాలపై దృష్టి సారించారు. విదేశీ నేతల్లో తొలిసారిగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఫోన్ చేసి మాట్లాడారు. కరోనాపై కలసికట్టుగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ సంబంధాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణ మార్పులపై కలసికట్టుగా పోరాటం చేయాల్సి ఉందని బైడెన్ చెప్పారు. కెనడా ప్రధానితో పాటు మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడర్తో బైడెన్ మాట్లాడారు. ఈ వారంలో మరికొంత మంది విదేశీ నాయకులతో బైడెన్ మాట్లాడతారని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. రక్షణ మంత్రిగా నల్లజాతీయుడు అస్టిన్ అమెరికా రక్షణ మంత్రిగా రిటైర్డ్ జనరల్ అస్టిన్ నియమితులయ్యారు. అగ్రరాజ్యానికి నల్లజాతీయుడు ఒకరు రక్షణ మంత్రి పదవి చేపట్టడం ఇదే తొలిసారి. అమెరికా కాంగ్రెస్‌లోని ఎగువ సభ అయిన సెనేట్ రక్షణ మంత్రిగా అస్టిన్ నామినేషన్‌ను రికార్డు స్థాయిలో 93–2 ఓట్ల తేడాతో బలపరిచింది. ఆ వెంటనే ఆయన చేత ప్రస్తుతం అమెరికా బలగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న డైరెక్టర్ టామ్ మూయిర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ వెను వెంటనే అస్టిన్ విధుల్లో చేరారు. ట్రంప్ అభిశంసనపై ఫిబ్రవరి 8న సెనేట్‌లో విచారణ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనపై ఫిబ్రవరి 8నుంచి సెనేట్‌లో విచారణ మొదలు కానుంది. ఈ నెల 6న క్యాపిటల్ భవనంపై దాడికి అనుచరుల్ని ఉసిగొల్పి అరాచకం సృష్టించడమే కాకుండా అయిదు నిండు ప్రాణాలు బలైపోవడానికి పరోక్షంగా కారణమవడంతో ట్రంప్‌పై ఇప్పటికే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దానిని ప్రతినిధుల సభ ఆమోదించడం తెలిసిందే. ట్రంప్ ప్రస్తుతం గద్దె దిగిపోయినప్పటికీ అభిశంసన ప్రక్రియను అధికారికంగా ముగించాలన్న గట్టి పట్టదలతో డెమొక్రాట్లు ఉన్నారు. ఫిబ్రవరి 8 సోమవారం సభ ప్రారంభం కాగానే ట్రంప్ అభిశంసనే ప్రధాన ఎజెండగా ఉంటుంది. ఆయనపై నమోదు చేసిన అభియోగాలను చదువుతారు. ఆ మర్నాడు కొత్త సెనేట్ సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. 100 మంది సభ్యుల బలం ఉండే సెనేట్‌లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లకు సరిసమానంగా చెరి 50 స్థానాలున్నాయి. సెనేట్ చైర్మన్, దేశ ఉపాధ్యక్షురాలు కమల ఓటుతో డెమొక్రాట్లదే సభలో ఆధిక్యం ఉంటుంది. -
కరోనా బారిన ఆ దేశ ప్రధాని భార్య..
టొరంటో : అంతర్జాతీయ మహమ్మారి కరోనావైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రికి ఇప్పటికే కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో భార్య సోఫీ గ్రెగోర్‌కు కరోనావైరస్ పాజిటివ్‌గా రిపోర్ట్స్ వచ్చాయి. ట్రుడో దంపతులు ఓ కార్యక్రమంలో ప్రసంగించి వచ్చిన అనంతరం ట్రుడో భార్యకు ఫ్లూ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు జరపగా కరోనా పాజిటివ్‌గా తేలిందని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ పేర్కొంది. భార్య కరోనా బారినపడటంతో కెనడా ప్రధాని ట్రుడో తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఇంటి నుంచే పనిచేస్తున్నారు. కాగా ట్రుడోకు ఎలాంటి ఫ్లూ లక్షణాలు లేవని నిర్ధారించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని, ఇంటి నుంచే పనులు చక్కబెట్టాలని సూచించారు. ఇక కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కెనడా అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా క్రీడా, వినోద ఈవెంట్లను రద్దు చేశారు. చదవండి : నెల్లూరు యువకుడికి కరోనా -
కెనడా ఎన్నికలు: మరోసారి ట్రూడో మ్యాజిక్..
-
మరోసారి ట్రూడో మ్యాజిక్..
న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 388 సీట్లుకు లిబరల్స్ 156 స్థానాలు దక్కించుకోగా.. ప్రతిపక్ష కన్సర్వేటీవ్స్ 122 స్థానాలకే పరిమితమయ్యారు. ప్రవాస భారతీయుడు జగ్మీత్సింగ్ నేతృత్వంలోని న్యూ డెమొక్రటిక్ పార్టీ 23స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. కెనడాలో మెజార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు 170 స్థానాలు అవసరం. కాబట్టి చిన్న పార్టీలతో కలిసి ట్రూడో మైనార్టీ ప్రభుత్వాన్ని నడపనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ట్రూడోకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలు ప్రపంచ దేశాల అధినేతలు అభినందనలు తెలియజేశారు. తమ ప్రగతిశీల అజెండాకు ప్రజలు పట్టంకట్టారని, ఆధునిక కెనడా ఆవిష్కరణకు కృషి కొనసాగిస్తానని ట్రూడో ఎన్నికల విజయం అనంతరం ప్రకటించారు. -
ట్రంప్‌పై నమ్మకం లేదా?
ఒట్టావా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికన్లే షాకిచ్చారు. ఓ సర్వేలో మెజార్టీ అమెరికన్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు తమ మద్ధతు ప్రకటిస్తూ ఆశ్చర్యపరిచారు. జీ-7 దేశాల సదస్సు ముగిశాక.. వాణిజ్య ఒప్పందం అంశంలో ట్రంప్-ట్రూడోల మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనెడాలోని ఓ న్యూస్ ఏజెన్సీ తాజా పరిస్థితుల దృష్ట్యా ఓ సర్వే నిర్వహించింది. ఇరు దేశాల ప్రజలు(ఎంతమంది అన్నదానిపై స్పష్టత లేదు) పాల్గొన్న ఐపీఎస్వోఎస్ సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. 72 శాతం మంది కెనడియన్లు, 57 శాతం మంది అమెరికన్లు ఈ పరిస్థితులను చక్కదిద్దే సత్తా ట్రూడోకే ఉందని తేల్చారు. 14 మంది కెనడియన్లు, 37 శాతం అమెరికన్లు మాత్రమే ట్రంప్‌కు మద్ధతుగా ఓట్లేశారు. ఆ లెక్కన మెజార్టీ అమెరికన్లు ట్రంప్‌కు ఆ దమ్ము లేదని తేల్చేశారన్న మాట. ఇక మెజార్టీ ప్రజలు మాత్రం ఉత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఎన్ఏఎఫ్టీఏ)-1994ను సవరించాలన్న ట్రంప్ నిర్ణయంపై కూడా తమ అభిప్రాయాన్ని తెలిపారు. అయితే 70 శాతం మంది కెనడియన్లు తాము అమెరికా ఉత్పత్తులను బహిష్కరించాలనుకుంటున్నామని సర్వేలో పేర్కొన్నారు. మరోపక్క చాలామట్టుకు మాత్రం ఇరు దేశాల అధినేతల మధ్య మాటల యుద్ధంతో ద్వైపాక్షిక ఒప్పందాలు దెబ్బతినే అవకాశం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 13-14 తేదీల్లో ఈ సర్వేను నిర్వహించగా, తాజాగా సర్వే నివేదిక బహిర్గతమైంది. సర్వే నివేదిక.. ట్విటర్ సౌజన్యంతో... -
ఎట్టకేలకు ట్రూడోతో...
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. భారత్, కెనడాల మధ్య సంబంధాల బలోపేతంతో పాటు పెట్టుబడులు, ఉగ్రవాదం సహా పలు అంశాలు చర్చించారు. ఉగ్రవాదంపై సమిష్టి పోరుకు ఇరు దేశాలు కలిసిసాగుతాయని చర్చల అనంతరం సంయుక్త ప్రకటనలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉత్తర కొరియా అణ్వాయుధాల సమీకరణ, ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో శాంతి, మాల్దీవుల వ్యవహారంపై ఇరు దేశాలు ఒకే అభిప్రాయం కలిగిఉన్నాయని చెప్పారు. మరోవైపు ప్రధాని మోదీ ఆతిధ్యాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రస్తుతించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం దిశగా అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు. ఇక ఇరు దేశాలు పలు రంగాల్లో చేపట్టే ఆరు ఎంఓయూలపై సంతకాలు చేశాయి.అంతకుముందు రాష్ట్రపతి భవన్లో శుక్రవారం ఉదయం ట్రూడోకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, మంత్రివర్గ సహచరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి ట్రూడో నివాళులు అర్పించారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తోనూ ట్రూడో భేటీ అయ్యారు. -
ఖలిస్తాన్ ఉగ్రవాదికి ఆహ్వానం
న్యూఢిల్లీ: ఖలిస్తాన్ వేర్పాటువాదులకు మద్ద తు ఇవ్వబోమని హామీ ఇచ్చి ఒక్కరోజు గడవకముందే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. దేశరాజధానిలో గురువారం ట్రూడో గౌరవార్థం కెనడా హైకమిషనర్ నాదిర్ పటేల్ నిర్వహించనున్న విందుకు ఆ దేశ అధికారులు సాక్షాత్తూ ఓ ఉగ్రవాదికి ఆహ్వానం పంపారు. ప్రధాని మోదీని ట్రూడో కలుసుకోవడానికి కేవలం ఒక్కరోజు ముందే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ట్రూడో.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 1986లో కెనడా పర్యటనకు వెళ్లిన పంజాబ్ మంత్రి మల్కియాత్ సింగ్ సిద్ధూపై వాంకోవర్‌లో హత్యాయత్నం చేసిన ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ సభ్యుడు జస్పాల్ అత్వాల్‌కు కెనడా అధికారులు గురువారం విందుకు ఆహ్వానం పంపారు. మంత్రిపై దాడి చేసినందుకు అప్పట్లో జస్పాల్‌కు కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ట్రూడో గౌరవార్థం అంతకుముందు ముంబైలో నిర్వహించిన కార్యక్రమానికి కూడా హాజరైన జస్పాల్, ఏకంగా కెనడా ప్రధాని భార్య సోఫీ, మంత్రి అమర్జిత్ సోహీలతో ఫొటోలు కూడా దిగాడు. ఈ ఫొటోల్లో ఉన్న జస్పాల్‌ను కెనడియన్ మీడియా గుర్తించడంతో ఆ దేశ అధికారుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన కెనడా హైకమిషన్.. జస్పాల్‌కు పంపిన ఆహ్వానాన్ని రద్దుచేసింది. తన సిఫార్సుతోనే కెనడా హైకమిషన్ సిబ్బంది జస్పాల్‌ను విందుకు ఆహ్వానించారని కెనడా ఎంపీ రణ్‌దీప్ సురాయ్ అంగీ కరించారు. జస్పాల్ భారత్‌కు వచ్చేందుకు వీసా ఎలా లభించిందన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ చెప్పింది. -
‘ఖలిస్తాన్’కు మద్దతు ఇవ్వం
అమృత్సర్: భారత పర్యటనలో భాగంగా బుధవారం పంజాబ్ చేరుకున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. కుటుంబ సమేతంగా పంజాబీ సంప్రదాయ వస్త్రధారణతో స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ట్రూడో, కెనడా రక్షణమంత్రి హర్జిత్ సజ్జన్లు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో ఓ హోటల్లో దాదాపు 40 నిమిషాల సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కెనడాలో ఉంటూ పంజాబ్‌లోని యువతను విద్వేష నేరాలు, ఉగ్రవాదంవైపు రెచ్చగొడుతున్న 9 ఖలిస్తాన్ వేర్పాటువాదుల జాబితాను అమరీందర్ ట్రూడోకు అందజేశారు. వీరిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన్ను కోరారు. భారత్ సహా మరెక్కడా వేర్పాటువాద ఉద్యమాలకు కెనడా మద్దతివ్వబోదని ట్రూడో హామీ ఇచ్చినట్లు పంజాబ్ సీఎం మీడియా సలహాదారు రవీన్ థుక్రల్ తెలిపారు. క్యూబెక్‌లో వేర్పాటువాద ఉద్యమాన్ని తాను ఎదుర్కొన్నాననీ, ఇలాంటి హింసతో వచ్చే ప్రమాదాలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఈ సమావేశంలో ట్రూడో చెప్పినట్లు వెల్లడించారు. ‘తమ ప్రభుత్వం ఎలాంటి వేర్పాటువాద ఉద్యమానికి మద్దతివ్వబోదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హామీ ఇవ్వడం నిజంగా ఆనందకరమైన విషయం. ట్రూడో వ్యాఖ్యలు భారత్‌లోని అందరికీ చాలా ఊరట కల్గించాయి. భవిష్యత్‌లో కూడా వేర్పాటువాద శక్తుల్ని ఏరివేయడానికి కెనడా ప్రభుత్వ సహకారాన్ని కోరుతున్నాం’ అని భేటీ అనంతరం అమరీందర్ ట్వీట్ చేశారు. అంతకుముందు శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుక్బీర్ సింగ్ బాదల్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు గోబింద్‌సింగ్ లంగోవాల్లు ట్రూడో కుటుంబానికి స్వర్ణ మందిరంలోకి ఘన స్వాగతం పలికారు. భార్య, ఇద్దరు చిన్నారులతో కలసి ఆలయంలో ప్రార్థనల్లో పాల్గొన్న ట్రూడో.. ఆ తర్వాత ఇక్కడి గురు రాందాస్‌జీ లంగర్లో కుటుంబ సభ్యులతో కలసి చపాతీలు తయారుచేశారు. -
మోదీ ఆలింగనాలు ట్రూడోకు లేవా?
న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెంట కేంద్ర మంత్రులెవరూ కనిపించడం లేదు. సంప్రదాయ దుస్తుల్లో తాజ్‌మహల్, స్వర్ణదేవాలయం, సబర్మతీ ఆశ్రమం సందర్శించినప్పుడు ఆయనతో భార్య, ముగ్గురు పిల్లలే ఉన్నారు. కెనడాతో(జనాభా మూడున్నర కోట్లు) పోల్చితే చిన్న దేశం ఇజ్రాయెల్(84 లక్షలు) ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇటీవల ఇండియా వచ్చినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే మోదీ ఆలింగనంతో స్వాగతం పలికారు. కెనడాతో భారత్‌కు వందేళ్లకు పైగా సంబంధాలున్నాయి. అక్కడ భారత సంతతికి చెందిన జనాభా సుమారు నాలుగు శాతం(దాదాపు 14 లక్షలు). ఈ నేపథ్యంలో వారం రోజుల అధికారిక పర్యటనపై వచ్చిన ట్రూడోతో భారత సర్కారు అంటీముట్టనట్టు ఎందుకు వ్యవహరిస్తోంది? అన్న ప్రశ్నకు సరైన జవాబు దొరకడం లేదు. కెనడాలో దాదాపు 1.4% జనాభా, పార్లమెంటులో 17 మంది సభ్యుల ప్రాతినిధ్యమున్న సిక్కుల్లోని తీవ్రవాద శక్తులతో ట్రూడో సర్కారు అంటకాగుతోందని, పరోక్షంగా మద్దతిస్తోందని మోదీ సర్కారు, ముఖ్యంగా పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుండటమే ఇందుకు కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు. ‘ఖలిస్తాన్’పై నిరసనా? పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమానికి కెనడా సిక్కుల్లో కొద్దిమంది మద్దతు ఇచ్చిన మాట నిజమే. 1985లో టోరంటో నుంచి 329 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఎయిరిండియా విమానాన్ని సిక్కు ఉగ్రవాదులు దారిలోనే బాంబులతో కూల్చేశారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం దేశంలో మూడు వేల మంది సిక్కులను వేటాడి చంపడాన్ని కెనడా పార్లమెంటు ‘మారణకాండ’ అని వర్ణించడం అప్పటి కేంద్ర సర్కార్లకు నచ్చలేదు. ఇప్పటికీ కెనడా సిక్కుల్లో కొద్ది మంది ఖలిస్తాన్ ప్రస్తావన తేవడం ఇండియాకు మింగుడుపడడం లేదు. ట్రూడో మంత్రివర్గంలో కేబినెట్ (రక్షణ శాఖ) మంత్రి హర్జీత్‌సింగ్ సజ్జన్ ఖలిస్తానీ సానుభూతిపరుడంటూ కిందటేడాది ఆయనను కలుసుకోవడానికి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ నిరాకరించారు. కెనడా యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేస్తున్న, అక్కడి ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ‘ ట్రూడో పర్యటనను మోదీ చూసీచూడనట్టు వ్యవహరించడం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సిక్కు వేర్పాటువాద సమస్యకు సంబంధించి కెనడా సర్కారు వైఖరితో తీవ్ర అసంతృప్తిగా ఉన్నామని భారత్ ఇలా బలమైన సంకేతం ఇచ్చినట్లు తెలుస్తోంది’’ అని బ్రూకింగ్స్ ఇండియాలో నిపుణుడు ధ్రువ జైశంకర్ అన్నారు. -
ట్రూడోతో పేచీ దేనికి?
శనివారం నుంచి దేశంలో పర్యటిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెంట భారత మంత్రులు ఎవరూ తిరగడం లేదు. ఆగ్రా తాజ్‌మహల్. అమృత్సర్ స్వర్ణదేవాలయం, గుజరాత్ సబర్మతీ ఆశ్రమం సందర్శించినప్పుడు ట్రూడోతోపాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లలే కనిపించారు. భారతీయ దుస్తుల్లో ఉన్న ట్రూడో ఫ్యామిలీ ఫోటోలే పత్రికల్లో దర్శనమిస్తున్నాయి. కిందటివారం దిల్లీ విమానాశ్రయంలో దిగిన ట్రూడోకు స్వాగతం పలికిన భారత అధికారుల్లో ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్ సభ్యులెవరూ లేరు. (సాక్షి ప్రత్యేకం) కెనడాతో(జనాభా మూడున్నర కోట్లు) పోల్చితే చిన్న దేశం ఇజ్రాయెల్(84 లక్షలు) ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇటీవల ఇండియా వచ్చినప్పుడు రాజధాని ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే మోదీ ఆలింగనంతో స్వాగతం పలికారు. అదీగాక కెనడాతో వందేళ్లకు పైగా భారత్‌కు సంబంధాలున్నాయి. అక్కడ భారత సంతతికి చెందిన జనాభా నాలుగు శాతం(దాదాపు 14 లక్షలు) ఉన్నారు. ఇండియా మాదిరిగానే కెనడా ప్రజాస్వామ్యి దేశం. (సాక్షి ప్రత్యేకం) ఈ నేపథ్యంలో వారం రోజుల అధికార పర్యటనపై వచ్చిన ట్రూడోతో భారత సర్కారు అంటీముట్టనట్టు ఎందుకు వ్యవహరిస్తోంది? అన్న ప్రశ్నకు సరైన జవాబు దొరకడం లేదు. కెనడాలో దాదాపు 1.4 శాతం జనాభా, పార్లమెంటులో 17 మంది సభ్యుల ప్రాతినిధ్యమున్న సిక్కుల్లోని తీవ్రవాద శక్తులతో ట్రూడో సర్కారు అంటకాగుతోందని, పరోక్షంగా మద్దతిస్తోందని మోదీ సర్కారు, ముఖ్యంగా పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం భావించడమే ట్రూడోకు ఘనస్వాగతం లభించకపోవడానికి కారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సిక్కుల కార్యక్రమంలో ట్రూడో కిందటేడాది ట్రూడో పాల్గొన్న టోరంటో సిక్కుల కార్యక్రమంలో 1984 అమృత్సర్ సైనిక చర్యలో మరణించిన సంత్ జర్నాయిల్‌సింగ్ భింద్రన్‌వాలే ఫోటోలున్న పోస్టర్లు ప్రదర్శించారు. పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమానికి కెనడా సిక్కుల్లో కొద్దిమంది మద్దతు ఇచ్చిన మాట నిజమే. 1985లో టోరంటో నుంచి 329 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఎయిరిండియా విమానాన్ని సిక్కు ఉగ్రవాదులు దారిలోనే బాంబుపేలుడుతో కూల్చేశారు. ఈ కేసులో శిక్షపడిన ఒకే ఒక సిక్కు తీవ్రవాది రెండు దశాబ్దాలు జైలు జీవితం గడిపాడు. (సాక్షి ప్రత్యేకం) కెనడా కోర్టు ఆదేశంపై కింటేడాది ఆయనను విడుదల చేశారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం దేశంలో మూడు వేల మంది సిక్కులను వేటాడి చంపడాన్ని కెనడా పార్లమెంటు ‘మారణకాండ’ అని వర్ణించడం అప్పటి కేంద్ర సర్కార్లకు నచ్చలేదు. ఇప్పటికీ కెనడా సిక్కుల్లో కొద్ది మంది ఖలిస్తాన్ ప్రస్తావన తేవడం ఇండియాకు మింగుడుపడడం లేదు. కిందటేడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ(ఆమ్) తరఫున కెనడా నుంచి వచ్చిన సిక్కులు ప్రచారం చేయడమేగాక ఆ పార్టీకి నిధులు సమకూర్చారంటూ పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్ ఆరోపించారు. ట్రూడో మంత్రివర్గంలో కేబినెట్ (రక్షణ శాఖ) మంత్రి హర్జీత్‌సింగ్ సజ్జన్ ఖలిస్తానీ సానుభూతిపరుడంటూ కిందటేడాది ఆయనను కలుసుకోవడానికి అమరీందర్ నిరాకరించారు. (సాక్షి ప్రత్యేకం) ఖలీస్తానీలే అసలు సమస్యా? ఇంథన భద్రత నుంచి విద్యారంగం వరకూ కెనడా, ఇండియా మధ్య పలు రంగాల్లో 600 కోట్ల డాలర్ల వ్యాపారం జరిగిందని 2016 అంచనాలు చెబుతున్నాయి. కెనడా యూనివర్పిటీల్లో చదువుకునే, అక్కడి ఐటీ కంపెనీల్లో పనిచేసే భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. (సాక్షి ప్రత్యేకం) అమెరికాలో మాదిరిగాకాక కెనడాలో భారతీయులకు శాశ్వత నివాస సౌకర్యం(పీఆర్) తేలికగా లభిస్తోంది. ఇలా అనేక రకాలుగా దశాబ్దాలపాటు సత్సంబంధాలు కొనసాగుతున్న రెండు ప్రజాతంత్ర దేశాల మధ్య ప్రస్తుత ‘పేచీ’కి ఖలిస్తాన్ సమస్య ఒక్కటే అసలు కారణం కాదని పరిశీలకులు చెబుతున్నారు. ట్రూడో, మోదీ మధ్య సన్నిహిత రాజకీయబంధం లేకపోవడమే ప్రస్తుత వివాదానికి మరో కారణమని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ‘‘ ట్రూడో పర్యటనను మోదీ చూసీచూడనట్టు వ్యవహరించడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సిక్కు వేర్పాటువాద సమస్యపై కెనడా సర్కారు వైఖరిపై తమకు తీవ్ర అసంతృప్తిగా ఉందని భారత్ ఇలా బలమైన సంకేతం పంపించినట్టు కనిపిస్తోంది.’’ అని బ్రూకింగ్స్ ఇండియాలో నిపుణుడు ధ్రువ జైశంకర్ అన్నారు. (సాక్షి ప్రత్యేకం) -- సాక్షి నాలెడ్జ్ సెంటర్