పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో మోదీ ఆలింగనం (ఫైల్)
న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెంట కేంద్ర మంత్రులెవరూ కనిపించడం లేదు. సంప్రదాయ దుస్తుల్లో తాజ్‌మహల్, స్వర్ణదేవాలయం, సబర్మతీ ఆశ్రమం సందర్శించినప్పుడు ఆయనతో భార్య, ముగ్గురు పిల్లలే ఉన్నారు. కెనడాతో(జనాభా మూడున్నర కోట్లు) పోల్చితే చిన్న దేశం ఇజ్రాయెల్(84 లక్షలు) ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇటీవల ఇండియా వచ్చినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే మోదీ ఆలింగనంతో స్వాగతం పలికారు. కెనడాతో భారత్‌కు వందేళ్లకు పైగా సంబంధాలున్నాయి.
అక్కడ భారత సంతతికి చెందిన జనాభా సుమారు నాలుగు శాతం(దాదాపు 14 లక్షలు). ఈ నేపథ్యంలో వారం రోజుల అధికారిక పర్యటనపై వచ్చిన ట్రూడోతో భారత సర్కారు అంటీముట్టనట్టు ఎందుకు వ్యవహరిస్తోంది? అన్న ప్రశ్నకు సరైన జవాబు దొరకడం లేదు. కెనడాలో దాదాపు 1.4% జనాభా, పార్లమెంటులో 17 మంది సభ్యుల ప్రాతినిధ్యమున్న సిక్కుల్లోని తీవ్రవాద శక్తులతో ట్రూడో సర్కారు అంటకాగుతోందని, పరోక్షంగా మద్దతిస్తోందని మోదీ సర్కారు, ముఖ్యంగా పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుండటమే ఇందుకు కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు.
‘ఖలిస్తాన్’పై నిరసనా?
పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమానికి కెనడా సిక్కుల్లో కొద్దిమంది మద్దతు ఇచ్చిన మాట నిజమే. 1985లో టోరంటో నుంచి 329 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఎయిరిండియా విమానాన్ని సిక్కు ఉగ్రవాదులు దారిలోనే బాంబులతో కూల్చేశారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం దేశంలో మూడు వేల మంది సిక్కులను వేటాడి చంపడాన్ని కెనడా పార్లమెంటు ‘మారణకాండ’ అని వర్ణించడం అప్పటి కేంద్ర సర్కార్లకు నచ్చలేదు. ఇప్పటికీ కెనడా సిక్కుల్లో కొద్ది మంది ఖలిస్తాన్ ప్రస్తావన తేవడం ఇండియాకు మింగుడుపడడం లేదు.
ట్రూడో మంత్రివర్గంలో కేబినెట్ (రక్షణ శాఖ) మంత్రి హర్జీత్‌సింగ్ సజ్జన్ ఖలిస్తానీ సానుభూతిపరుడంటూ కిందటేడాది ఆయనను కలుసుకోవడానికి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ నిరాకరించారు. కెనడా యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేస్తున్న, అక్కడి ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ‘ ట్రూడో పర్యటనను మోదీ చూసీచూడనట్టు వ్యవహరించడం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సిక్కు వేర్పాటువాద సమస్యకు సంబంధించి కెనడా సర్కారు వైఖరితో తీవ్ర అసంతృప్తిగా ఉన్నామని భారత్ ఇలా బలమైన సంకేతం ఇచ్చినట్లు తెలుస్తోంది’’ అని బ్రూకింగ్స్ ఇండియాలో నిపుణుడు ధ్రువ జైశంకర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment