
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరిపినట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తెలిపారు. శుక్రవారం లావోస్‌లో జరిగిన భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని మోదీతో భేటీ అయినట్లు స్వయంగా వెల్లడించారు.
‘‘మా భేటీలో చర్చించిన అంశాల గురించి పూర్తి వివరాలను వెల్లడించలేను. కానీ కెనడియన్ల భద్రత, చట్టబద్ధపాలనను సమర్థిస్తూ కొనసాగించటం తమ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతల్లో ఒకటని చాలాసార్లు చెప్పా. అందుకే వాటిపైనే నేను దృష్టి సారించా. కెనడా.. భారత్‌తో తన వాణిజ్య సంబంధాలు, ప్రజలతో సంబంధాలను అభివృద్ధి కొనసాగించాల్సిన అవసరం ఉంది. అయితే ఇరు దేశాల మధ్య పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిపైనే మేము దృష్టి పెడతాం. తదుపరి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి’’ అని అన్నారు. ఇక.. ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకుంది.
ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ 2023, జూన్ కెనడాలోని సర్రేలో జరిగిన కాల్పుల్లో మృతి చెందాడు. అయితే.. నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారు. దీంతో ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆయన ఆరోపణలు చాలా అసంబద్ధమని, కొట్టిపారేసింది. అయితే అప్పటి నుంచీ ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment