ఒట్టావా: భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఢిల్లీలో ఇటీవల జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశం అనంతరం ఇరు దేశాల సంబంధాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలకు బ్రేక్ పడింది. ఇప్పటికే జీ20 సదస్సుకు కొద్ది రోజుల ముందు భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కెనడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అక్టోబర్‌లో ఆ చర్చలను తిరిగి ప్రారంభిచాల్సి ఉండగా తాజాగా మరోసారి ఇవి వాయిదా పడ్డాయి.
భారత్‌తో జరగాల్సిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందంపై చర్చలను వాయిదా వేస్తున్నట్లు కెనడా వెల్లడించింది. భారత్‌తో అక్టోబరులో జరగాల్సిన వాణిజ్య మిషన్‌ను వాయిదా వేయాలని ఆదేశ వాణిజ్యశాఖ మంత్రి మేరీ ఎన్జీ నిర్ణయించారని సదరుశాఖ అధికార ప్రతినిధి శాంతి కోసెంటినో తెలిపారు. అయితే వాయిదా వేయడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.
న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చర్చలు జరిపిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం వెలుగుచూసింది. సెప్టెంబర్9, 10 న భారత్ అధ్యక్షతన నిర్వహించిన జీ 20 సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ ప్రపంచ దేశాధినేతలతో ధైపాక్షక చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.
ఖలిస్థానీ సానుభూతిపరులకు కెనడా అడ్డాగా మారుతుందనే విషయాన్ని నేరుగా ట్రూడో దృష్టికి మోదీ తీసుకెళ్లారు. భారత్ వ్యతిరేక శక్తులు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారని, అక్కడ నివసిస్తున్న భారతీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తీవ్రవాద శక్తులు కెనడా కేంద్రంగా భారత్‌పై విషం చిమ్ముతున్నాయని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఇది కెనడాకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలంటే పరస్పర గౌరవం, విశ్వాసం చాలా ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment