భారత పర్యటనలో కుటుంబంతో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయాలని నరేంద్రమోదీ ప్రభుత్వం భావించినట్లయితే దాన్ని అంతగా పట్టించుకోవలసిన పని లేదు. కానీ అది వాస్తవమేనన్న అభిప్రాయం ప్రస్తుతం బాగా ప్రచారంలోకి వచ్చింది. వాస్తవం కంటే ఎరుక ప్రధానం అనడానికి ఇదొక స్పష్టమైన సందర్భం. దీని అర్థం ఏమిటంటే, భారత ప్రభుత్వం ట్రూడోను నిర్లక్ష్యం చేయనప్పటికీ–దాని ఉద్దేశం అది కాదని నమ్మడానికే నేను సిద్ధపడుతున్నాను–అలా చేసిందన్న ఆరోపణలకు గురికావడమే కాకుండా, దోషిగా నిలిచిందనే.
ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్య విషయం ఏమిటంటే, తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విషయం జస్టిన్ ట్రూడోకు స్పష్టంగా తెలిసి ఉండటమే. తనకు అవమానం జరిగిందని ట్రూడో భావిం చనప్పటికీ, తాను అవమానానికి గురైనట్లు చాలామంది భారతీ యులు నమ్ముతున్నట్లు ఆయనకు తెలిసింది. పైగా అలాంటి అభిప్రాయం ట్రూడో సొంత దేశానికి కూడా చాలా స్పష్టంగా ఏర్పడింది.
కాబట్టి నిజం ఏదైనప్పటికీ, తనను నేరుగా ఎవరూ అవమానించనప్పటికీ అలాంటి అనుభూతి ఆయనకు కలిగే ఉంటుంది. ఇరుదేశాల్లో ఏ పక్షానికీ ఇది మంచి చేసేది కాదు. ఏదేమైనప్పటికీ, ఈ అంశంలో వాస్తవాలకేసి నేను పరిశీలించదలిచాను. తనకు సరైన స్వాగతం లభించలేదని ట్రూడో భావిస్తున్నట్లు ఇవి సూచిస్తున్నాయా? ఉద్దేశపూర్వకంగానైనా లేక మరోవిధంగానైనా సరే దీనికి సమాధానం అవును అన్నదే.
కెనడా ప్రధానికి స్వాగతం చెప్పడానికి భారత ప్రధాని విమానాశ్రయానికి రాలేదన్నదే ఒక అసందర్భమైన విషయం. కాగా, ఆయనకు స్వాగతం చెప్పేందుకు వెళ్లిన ప్రభుత్వ ప్రతినిధుల స్థాయి సరైందేనా? పూర్తి స్థాయి కేబినెట్ మంత్రి విమానాశ్రయంలో కనబడలేదు. పైగా, కేంద్రప్రభుత్వం ఒక అనామక సహా యమంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌ను అక్కడికి పంపింది. కెనడాతో మన సంబంధాలను మెరుగుపర్చుకోవలసిన అవసరం ఉన్నందున ఆయనకు స్వాగతం పలకడానికి మన విదేశాంగ మంత్రి వచ్చి ఉంటే ఉత్తమంగా ఉండేది కదా.
ఇది చిన్న విషయమే అనుకుంటే మరిన్ని ఘటనలు కూడా జరిగాయి. కెనడా ప్రధాని ఆగ్రా, అహమ్మదాబాద్ నగరాలను సందర్శించినప్పుడు ఉత్తరప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రులు ఆయనను కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. వారు ఇతర కార్యక్రమాల్లో మునిగిపోయి ఉన్నారంటే సందేహపడాల్సిన అవసరం లేదు. కానీ ట్రూడో కెనడా ప్రధానమంత్రి. పైగా తాను ఇటీవలే భారత్ సందర్శనకు వచ్చిన కెనడా టూరిస్టు కాదు. వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తమ రాష్ట్రాలను సంద ర్శించినప్పుడు ఈ సీఎంలిద్దరూ హాజరయ్యారు. ఈ విషయం కెనడా ప్రజలకు, వారి మీడియాకు స్పష్టంగా తెలిసే ఉంటుంది.
అన్నిటికంటే మించి జస్టిన్ ట్రూడోకు స్వాగతం చెబుతూ ట్వీట్ పంపడంలో ప్రధాని మోదీ వైపు నుంచి జరిగిన వైఫల్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి అది వైఫల్యమేనా? అది ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి ఘటనలు కాకతాళీయంగా జరగవు. ఇవి ఉద్దేశపూర్వకంగా జరిగినవే. స్పష్టం కాకపోవచ్చు కానీ సూచనప్రాయంగా అయినా సరే వీటి వెనుక ఒక సందేశం ఉంది. ఆ సందేశం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే దాన్ని మనం అనేక రకాలుగా వ్యాఖ్యానించవచ్చు.
వీటిలో ఒక వ్యాఖ్యానాన్ని ఉపేక్షించడానికి వీల్లేదు. చాలా తరచుగా ట్వీట్లు చేస్తూ, డాంబికమైన కౌగిలింతలను ఆయుధంగా చేసుకునే అలవాటున్న మోదీ ఇప్పుడు పాటిస్తున్న ఈ నిశ్శబ్దం కెనడియన్లకు చాలానే బోధపరుస్తుంది. బోధపర్చింది కూడా. ఈ ఉదంతంలో అతి ముఖ్య విషయం ఏదంటే, ఇంతవరకు జరుగుతూ వచ్చిన పరిణామాలు ఏవీ అవసరం లేదన్నదే. కెనడాతో మనకున్న అభిప్రాయభేదాలను లాంఛనప్రాయ చర్చలకు వదలిపెట్టవచ్చు. అక్కడే వీటికి మంచి పరిష్కారం దొరుకుతుంది. కానీ మీరు ఒకరిని మీ ఇంటికి ఆహ్వానించినప్పుడు సాదరస్వాగతానికి హామీ ఇచ్చేలా అతిథితో యుక్తంగా వ్యవహరించాల్సి ఉంది.
దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని సృష్టించాక, పదే పదే అలాంటి అభిప్రాయాలనే పునరావృతం చేయడం, వ్యాప్తిలోకి తీసుకురావడం వల్ల మీరు మీ అతిథితో చెడుగా వ్యవహరిస్తున్నారని అందరూ నమ్మేలా చేస్తుంది. అతిథి దేవోభవ భావనకే ఇది వ్యతిరేకం. అతిథిని దైవంగా భావించే భారతీయ సంప్రదాయం నుంచి తమను మినహాయించారనే భావనతోటే ట్రూడో దంపతులు స్వదేశానికి వెళతారని నేను భయపడుతున్నాను.
చివరగా మన ఈ తరహా స్వాగతం, తన ఖలిస్తాన్ అనుకూల విధానాలను సవరించుకునేలా ట్రూడోను ప్రోత్సహిస్తుందా అని నా సందేహం. మన ఆతిథ్యం మరీ లాంఛనం కాకుండా మరింత ఉదారంగా ఉండినట్లయితే, అది తనకు నచ్చచెప్పేలా ఉండేది. ఒక తేలికపాటి పాఠాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్లుగా కనిపిస్తోంది. అదేమిటంటే.. మీరు మార్చాలనుకుంటున్న వ్యక్తిని మీరు ఎన్నటికీ బాధించవద్దు.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : karanthapar@itvindia.net
Comments
Please login to add a commentAdd a comment