రాష్ట్రపతి భవన్ వద్ద ట్రూడో, మోదీ ఆలింగనం
న్యూఢిల్లీ: భారత్ ఐక్యతను, సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను సవాలుచేస్తే సహించబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రాజకీయ లక్ష్యాలు, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికి మతాన్ని దుర్వినియోగం చేసేవారికి ప్రపంచంలో ఎక్కడా చోటు ఉండకూడదన్నారు. ఖలిస్తాన్ వేర్పాటువాదులపై కెనడా ప్రభుత్వ ఉదాసీన వైఖరిని పరోక్షంగా ప్రస్తావిస్తూ మోదీ మాట్లాడారు. శుక్రవారం నాడిక్కడ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో భేటీ అయిన మోదీ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. తర్వాత సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడారు.‘
ఇరుదేశాల మధ్య రక్షణ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. భిన్న సంస్కృతులున్న భారత్, కెనడా వంటి ప్రజాస్వామ్య దేశాలకు ఉగ్రవాదం, తీవ్రవాదాలే ప్రధాన ముప్పు. వీటిని తుదముట్టించడానికి కలసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నాం’ అని మోదీ అన్నారు. ట్రూడో పర్యటన సందర్భంగా ఇరుదేశాలు వాణిజ్యం, ఇంధన భద్రత, ఉన్నత విద్య, సైన్స్ అండ్ ఐటీ, మేధో సంపత్తి హక్కులు, అణు రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ట్రూడో దేశమంతా పర్యటించడాన్ని ఉటంకిస్తూ.. భారత్‌లోని భిన్నత్వం ఈ పర్యటనలో ఆయనకు అర్థమై ఉంటుందని మోదీ వ్యాఖ్యానించారు.
ట్రూడోకు ఘన స్వాగతం: అంతకుముందు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ట్రూడో కుటుంబానికి మోదీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రూడోను మోదీ ఆలింగనం చేసుకున్నారు. పర్యటనలో భాగంగా ట్రూడో కుటుంబం రాజ్‌ఘాట్‌ను సందర్శించి గాంధీజీకి నివాళులర్పించింది. మోదీ–ట్రూడోల సమావేశం అనంతరం ‘విభిన్న సంస్కృతులు, జాతుల సమాజాలున్న భారత్, కెనడాలు ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కులు, సమన్యాయ పాలనకు కట్టుబడి ఉన్నాయి. అల్‌కాయిదా, ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను ఉమ్మడిగా ఎదుర్కోవడానికి అంగీకరించాం’ అని భారత్–కెనడాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ పర్యటనలో భాగంగా ట్రూడో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీలను కలుసుకున్నారు.
ట్రూడో భార్య, పిల్లలతో సరదాగా ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment