టొరంటో/న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారత్‌పై విమర్శలు చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయంపై తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలను భారత ప్రభుత్వానికి చాలా వారాల క్రితమే అందజేసినట్లు ట్రూడో తెలిపారు. తీవ్రమైన ఈ అంశంలో వాస్తవాలను ధ్రువీకరించే విషయంలో నిర్మాణాత్మకంగా భారత్ వ్యవహరించాలని తాము కోరుకుంటున్నామన్నారు.
భారత్ స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్నారు. కెనడాతో భారత్ సహకిస్తుందని ఆశిస్తున్నామన్నారు. దీనివల్ల సమస్య మూలాల్ని తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు. అయితే, అది ఎలాంటి సమాచారమో ఆయన వెల్లడించలేదు. కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాతో మాట్లాడుతూ.. ‘కెనడా ప్రధాని చెబుతున్నట్లుగా గతంలో గానీ, ఇప్పుడు గానీ అటువంటి సమాచారం భారత ప్రభుత్వానికి అందనేలేదు.
అటువంటిదేమైనా ఉంటే భారత ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుంది. ఇదే విషయాన్ని కెనడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం’అని స్పష్టం చేశారు. గతంలో కెనడా గడ్డపై భారత వ్యతిరేక హింసాత్మక చర్యలకు సంబంధించిన సమాచారం అందజేసినప్పుడు అటువైపు నుంచి స్పందన రాలేదని గుర్తు చేశారు. జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వ ఏజెంట్లకు దగ్గరి సంబంధం ఉందనే విషయంలో కెనడా నిఘా సంస్థలు చురుగ్గా దర్యాప్తు చేపట్టాయంటూ గత వారం ట్రూడో కెనడా పార్లమెంట్‌లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీటిని భారత్ తీవ్రంగా ఖండించింది. అప్పటినుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
ఆ ఆరోపణలు ఆందోళనకరం: అమెరికా
ఖలిస్తానీ వేర్పాటువాది హత్యకు సంబంధించి భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు. బ్లింకెన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘భారత్‌నుద్దేశించి ప్రధానమంత్రి ట్రూడో చేసిన ఆరోపణలపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. దీనిపై కెనడా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లా డుతున్నాం. భారత ప్రభుత్వంతో కూడా ప్రస్తావించాం. దర్యాప్తులో భారత్ సహకరించడం ఎంతో కీలకం. నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి బాధ్యులను తేల్సాల్సిన అవసరం ఉంది’అని ఆయన అన్నారు. భారత్‌పై ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణల వెనుక ఫైవ్ ఐస్ నుంచి అందిన నిఘా సమాచారమే ఆధారమని కెనడాలో అమెరికా రాయబారి డేవిడ్ కోహెన్ చెప్పారు.
మత పెద్ద కాదు.. ఉగ్రవాదే: భారత్
నిజ్జర్ ఉగ్రవాదేనని భారత్ స్పష్టం చేసింది. ఉగ్ర శిక్షణ శిబిరాల నిర్వహణ, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సేకరించడం వంటి వాటితో అతడికి సంబంధాలున్నాయంది. అతడు ప్రముఖుడు కాదని పేర్కొంది. నిషేధిత ఖలిస్తాన్ కమాండో ఫోర్స్(కేసీఎఫ్)కు చెందిన గుర్దీప్ సింగ్ అలియాస్ హెరాన్‌వాలాకు అతడు సన్నిహితుడని తెలిపింది. 1980–90 మధ్య కాలంలో పంజాబ్‌లో గుర్దీప్ సింగ్200 వరకు హత్యలకు పాల్పడినట్లు గుర్తు చేసింది. బలవంతంపు వసూళ్లు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసుల్లో ఉన్న నిజ్జర్ పోలీసుల అరెస్టు భయంతో 1996లో నకిలీ ధ్రువపత్రాలతో భారత్ నుంచి కెనడాకు పరారయ్యాడని అధికార వర్గాలు తెలిపాయి.
ఇంటర్నెట్‌లో చూసే తెలుసుకున్నా
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయం తాను ఇంటర్నెట్‌లోనే చూశానని బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్ డేవిడ్ ఈబీ చెప్పారు. తనకీ విషయాలను దర్యాప్తు అధికారులెవరూ తెలపకపోవడం నిరుత్సాహం కలిగించిందన్నారు. ఫెడరల్ ప్రభుత్వం కీలకమైన సమాచారాన్ని అందించకపోవడంతో స్థానికంగా పౌరులకు భద్రత కల్పించే చర్యలపై తమ వంతుగా స్పందించలేకపోయామన్నారు.
ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను ఆస్తులు జప్తు
కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఆస్తుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) స్వాధీనం చేసుకుంది. 2020లో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం(యూఏపీఏ)కింద నమోదైన కేసుకు సంబంధించి మొహాలిలో ఉన్న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్‌ఎఫ్‌జే) జనరల్ కౌన్సిల్‌గా చెప్పుకునే పన్నుకు చెందిన అమృత్‌సర్‌లోని ఖాన్‌కోట్ గ్రామంలో ఉన్న 5.7 ఎకరాల వ్యవసాయ భూమి, చండీగఢ్‌లోని సెక్టార్ 15/సి ప్రాంతంలోని ఇంటిలో కొంతభాగం ఉన్నాయన్నారు.
Canada–India relations: నిజ్జర్ హత్యపై ఆధారాలిచ్చాం
Published Sun, Sep 24 2023 5:02 AM | Last Updated on Sun, Sep 24 2023 5:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment