కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు స్వాగతం పలుకుతున్న ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. భారత్, కెనడాల మధ్య సంబంధాల బలోపేతంతో పాటు పెట్టుబడులు, ఉగ్రవాదం సహా పలు అంశాలు చర్చించారు. ఉగ్రవాదంపై సమిష్టి పోరుకు ఇరు దేశాలు కలిసిసాగుతాయని చర్చల అనంతరం సంయుక్త ప్రకటనలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉత్తర కొరియా అణ్వాయుధాల సమీకరణ, ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో శాంతి, మాల్దీవుల వ్యవహారంపై ఇరు దేశాలు ఒకే అభిప్రాయం కలిగిఉన్నాయని చెప్పారు.
మరోవైపు ప్రధాని మోదీ ఆతిధ్యాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రస్తుతించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం దిశగా అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు. ఇక ఇరు దేశాలు పలు రంగాల్లో చేపట్టే ఆరు ఎంఓయూలపై సంతకాలు చేశాయి.అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం ఉదయం ట్రూడోకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, మంత్రివర్గ సహచరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి ట్రూడో నివాళులు అర్పించారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తోనూ ట్రూడో భేటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment