తీవ్రవాద శక్తులపై కఠిన చర్యలు తీసుకోండి.. కెనడాకు మోదీ సూచన | G20 Summit: PM Narendra Modi conveyed concerns about anti-India activities of extremists in Canada | Sakshi
Sakshi News home page

G20 Summit: తీవ్రవాద శక్తులపై కఠిన చర్యలు తీసుకోండి

Published Mon, Sep 11 2023 5:32 AM | Last Updated on Mon, Sep 11 2023 8:15 AM

G20 Summit: PM Narendra Modi conveyed concerns about anti-India activities of extremists in Canada - Sakshi

ఢిల్లీలో ఆదివారం మహాత్మాగాంధీ సమాధి ‘రాజ్‌ఘాట్‌’ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘన నివాళులర్పిస్తున్న జీ20 సభ్యదేశాల అధినేతలు. చిత్రంలో భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తదితరులు ఉన్నారు.

న్యూఢిల్లీ:  భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా అడ్డాగా మారుతుండడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ట్రూడో దృష్టికి తీసుకెళ్లారు. తీవ్రవాద శక్తులు కెనడా కేంద్రంగా భారత్‌పై విషం చిమ్ముతున్నాయని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని పేర్కొన్నారు. కెనడాలో నివసిస్తున్న భారతీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, భారత దౌత్యవేత్తలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తున్నాయని వెల్లడించారు.

కెనడాలోని భారతీయుల ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. భారత దౌత్య కార్యాలయాలపై దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలతో, మాదక ద్రవ్యాల ముఠాలతో, మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారితో తీవ్రవాద శక్తులు అంటకాగుతున్నాయని, ఈ పరిణామం కెనడా భద్రతకు సైతం ముప్పేనని తేల్చిచెప్పారు. ఈ అవాంఛనీయ ధోరణికి తక్షణమే అడ్డుకట్ట వేయాలని, తీవ్రవాద శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని జస్టిన్‌ ట్రూడోకు సూచించారు.

తీవ్రవాదులను ఏరిపారేయడానికి భారత్, కెనడా పరస్పరం కలిసి పనిచేయాలని చెప్పారు. జీ20 సదస్సు నేపథ్యంలో మోదీ, ట్రూడో ఆదివారం ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్, కెనడాకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై చర్చించుకున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలంటే పరస్పర గౌరవం, విశ్వాసం చాలా ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. విభిన్న రంగాల్లో భారత్‌–కెనడా సంబంధాలపై ట్రూడోతో విస్తృతంగా చర్చించినట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.  
చదవండి: మహాత్ముని పలుకులే భారత్‌–అమెరికా మైత్రికి మూలం

విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు: ట్రూడో   
భారత్‌ తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చెప్పారు. ప్రపంచంలో భారత్‌ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ప్రశంసించారు. వాతావరణ మార్పులపై పోరాటం, ఆర్థిక ప్రగతి వంటి అంశాల్లో భారత్, కెనడా కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. మోదీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కెనడాలో ఇటీవలి కాలంలో ఖలిస్తాన్‌ అనుకూల శక్తుల కార్యకలాపాలు పెరగడంపై స్పందిస్తూ.. తమ దేశంలో హింసకు తావులేదని, విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించుకొనే హక్కు ప్రజలకు ఉందన్నారు. ఎవరో కొందరు వ్యక్తుల చర్యలను మొత్తం సామాజిక వర్గానికి ఆపాదించడం సరైంది కాదన్నారు. మోదీతో జరిగిన చర్చల్లో ఖలిస్తాన్‌ తీవ్రవాదం ప్రస్తావనకు వచ్చిందని వెల్లడించారు. భారత్, కెనడా మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement