ప్రపంచ దేశాధినేతలు కలిసి దిగిన ఓ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో జరిగిన జీ 20 శిఖరాగ్ర సదస్సులో ఈ పరిమాణం వెలుగుచూసింది. ఈ సమ్మిట్‌లో భాగంగా సోమవారం దేశాధినేతలంతా కలిసి ఓ ఫోటో దిగారు. ఇందులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తదితర నేతలంతా ఉన్నారు. వారందరూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు.
అయితే ఈ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు లేరు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌కు చివరి జీ20 సదస్సు అయినందున ఆయన లేకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. మరోవైపు ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరు కావడం గమనార్హం.
తాజాగా ఈ ఫోటోపై అమెరికా అధికారులు స్పందిస్తూ.. తీవ్రంగా త ప్పుబట్టారు. ఫోటో దిగే సమయంలో బైడెన్.. కెనడా ప్రధాని జస్టిన్‌ట్రూడోతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. చర్చలు ముగించుకొని వస్తుండగా బైడెన్ రాకముందే తొందరగా ఫోటో తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల నాయకులంతా రాకముందే పలువురు దేశాధినేతలు ఫొటో దిగేశారని, అందుకే అందరూ నేతలు అక్కడ లేరని చెప్పారు. కాగాఫోటోలో మిస్ అయిన బైడెన్, ట్రూడో, మెలోనీలు తరువాత ప్రత్యేకంగా ఫొటో దిగారు.
ఇదిలా ఉండగా మరో రెండు నెలల మాత్రం అమెరికా అధ్యక్ష హోదాలో కొనసాగనున్నారు బైడెన్.. యూఎస్ ప్రెసిడెంట్‌గా ఆయనకు ఇదే చివరి జీ 20 సదస్సు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment