ఏ చర్చలకైనా అప్పుడే సార్థకత
జీ20 శిఖరాగ్ర సదస్సులో మోదీ
రియో డిజనిరో: ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల కమ్ముకున్న యుద్ధ మేఘాలు దక్షిణార్ధ గోళ (గ్లోబల్ సౌత్) దేశాలను అతలాకుతలం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫలితంగా ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభాలతో అవి సతమతమవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. వాటిని తక్షణం పరిష్కరించడంపై జీ20 కూటమి ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. ‘‘గ్లోబల్ సౌత్ సవాళ్లు, అవసరాలకు ముందుగా పెద్దపీట వేయాలి. అప్పుడు మాత్రమే జీ20 జరిపే ఏ చర్చలైనా, తీసుకునే ఏ నిర్ణయాలైనా ఫలవంతం అవుతాయి’’ అని స్పష్టం చేశారు.
రెండు రోజుల జీ20 శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో సోమవారం మొదలైంది. తొలి రోజు సదస్సును ఉద్దేశించి ‘ఆకలి, పేదరికంపై పోరు–సోషల్ ఇంక్లూజన్’ అంశంపై మోదీ ప్రసంగించారు. గ్లోబల్ సౌత్ సమస్యలు, సవాళ్లను ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ గతేడాది ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో పలు నిర్ణయాలు తీసుకున్న వైనాన్ని గుర్తు చేశారు. ‘‘గ్లోబల్ సౌత్‌కు ప్రాధాన్యం పెంచే చర్యల్లో భాగంగా ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కలి్పస్తూ ఢిల్లీ శిఖరాగ్రం నిర్ణయం తీసుకుంది.
అన్ని దేశాలనూ కలుపుకునిపోయేలా సుస్ధిరాభివృద్ధి లక్ష్యాలకు ప్రాథమ్యమివ్వాలని నిర్ణయించింది. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత’ అన్నదే మూలమంత్రంగా సదస్సు జరిగింది. ఆ ఒరవడిని మరింతగా కొనసాగించాలి’’ అని సదస్సులో పాల్గొన్న పలువురు దేశాధినేతలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి మొదలుకుని పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమన్న భారత వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
భారత్ తీరు ఆచరణీయం
పేదరికం, ఆకలి సమస్యలపై పోరులో భారత్ ముందుందని మోదీ వివరించారు. ‘‘ప్రజలందరినీ కలుపుకుని పోవడమే ప్రధాన లక్ష్యంగా మా ప్రభుత్వ పదేళ్ల పాలన సాగింది. 80 కోట్లకు పై చిలుకు ప్రజలకు ఆహార ధాన్యాలను ఉచితంగా అందజేస్తున్నాం. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆరోగ్య బీమా, పెద్ద పంటల బీమా, పంట రుణాల పథకాలు అమలు చేస్తున్నాం. తద్వారా 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయట పడ్డారు’’ అని వివరించారు. గ్లోబల్ సౌత్‌తో పాటు ఇతర దేశాలు కూడా వీటిని అనుసరిస్తే అద్భుత ఫలితాలుంటాయన్నారు. పేదరికం, ఆకలిపై పోరాటానికి అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలని జీ20 శిఖరాగ్రంలో తొలి రోజు నిర్ణయం జరిగింది.
బైడెన్‌తో మోదీ భేటీ
జీ20 శిఖరాగ్రం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ సోమవారం సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం వారి మధ్య ఇది తొలి భేటీ. వారిద్దరూ పలు ద్వైపాక్షిక అంశాలు మాట్లాడుకున్నట్టు సమాచారం.
ఘనస్వాగతం
జీ20 భేటీ కోసం బ్రెజిల్ వెళ్లిన మోదీకి ఘనస్వాగతం లభించింది. ప్రవాస భారతీయుల సంస్కృత శ్లోకాలాపన, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోని యో గుటెరస్, స్పెయిన్ అధినేత పెడ్రో శాంచెజ్, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తదితరులతో ప్రధాని భేటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment