
వాషింగ్టన్: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులపై దాడి వ్యూహాలను రహస్యంగా ‘సిగ్నల్’ యాప్ గ్రూప్‌చాట్‌లో చర్చిస్తూ పొరపాటున ఒక సీనియర్ పాత్రికేయుడిని ఆ గ్రూప్‌లో చేర్చుకున్న ఉదంతంలో అసలు ఆ గ్రూప్‌లో ఏం చర్చించారన్న వివరాలు బహిర్గతమయ్యాయి. సీనియర్ పాత్రికేయుడు జెఫ్రీ గోల్డ్‌బర్గ్ ఎడిటర్–ఇన్–చీఫ్‌గా ఉన్న ‘ది అట్లాంటిక్’ మేగజైన్ ఈ వివరాలను బుధవారం స్క్రీన్‌షాట్ల రూపంలో బయటపెట్టింది.
ఈ గ్రూప్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్, విదేశాంగ మంత్రి రూబియో, ఆర్థిక మంత్రి స్కాట్, రక్షణమంత్రి పీట్ హెగ్సెత్, హోంల్యాండ్ సెక్యూరిటీ సలహాదారు స్టీఫెన్ మిల్లర్‌సహా 19 మంది సభ్యులుగా ఉన్నారు. మార్చి 15వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటల నుంచి ఏ సమయంలో ఎక్కడెక్కడ ఏ రకం బాంబులు, యుద్ధవిమానాలు, డ్రోన్లతో దాడిచేసేది రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చాటింగ్‌లో పేర్కొన్నారు. దాడులను ప్రశంసిస్తూ మిగతావాళ్లు అమెరికా జెండాలు, పిడికిలి గుర్తు, ఎమోజీలను పోస్ట్‌చేశారు.
సభ ముందుకు నిఘా అధికారులు
లీకేజీ ఉదంతంపై ఉన్నతస్థాయి విచారణలో భాగంగా సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ తదితరులు బుధవారం పార్లమెంట్ దిగువ సభలో ఇంటెలిజెన్స్ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇవ్వనున్నారు. దేశం ఎదుర్కొంటున్న ముప్పులపై వార్షిక సమీక్షలో భాగంగా వీళ్లంతా వివరణ ఇచ్చుకోనున్నారు. ఇప్పటికే వీళ్లంతా మంగళవారం ఎగువసభ సెనేట్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. లీకేజీపై కొందరు డెమొక్రటిక్ పార్టీ సెనేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. లీకేజీని అధ్యక్షుడు ట్రంప్ అతిచిన్న పొరపాటుగా అభివర్ణించారు. గతంలో డెమొక్రటిక్ నాయకురాలు హిల్లరీ క్లింటన్ విదేశాంగ మంత్రిగా ఉన్న కాలంలో సొంత ఈ–మెయిల్ వాడినందుకే అత్యంత సున్నిత సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదముందని తీవ్ర వివాదం రేపిన రిపబ్లికన్లు ఇప్పుడు లీకేజీ ఘటన అత్యంత అప్రాధాన్యమైన అంశమని కొట్టిపారేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment