న్యూఢిల్లీ: భారత్, అమెరికా దేశాల మధ్య రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంయుక్తంగా ప్రకటించారు. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం భారత్‌కు విచ్చేసిన బైడెన్‌ను ప్రధాని మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసం 7, కళ్యాణ్‌మార్గ్‌కు సాదరంగా ఆహా్వనించారు. దాదాపు 50 నిమిషాలకుపైగా జరిగిన ఈ భేటీ సందర్భంగా ఇరువురు అగ్రనేతలు కీలకమైన అంశాలపై చర్చించి పలు రంగాలకు సంబంధించి ఒప్పందాలు ఖరారుచేశారు.
అమెరికా నుంచి 31 అత్యాధునిక డ్రోన్ల కొనుగోలు, ఆధునిక జెట్ ఇంజిన్ల సంయుక్త తయారీపై రెండు దేశాలు అవగాహనకు వచ్చాయి. జీ20 సారథ్యం, అణుఇంధనంలో సహకారం, 6జీ, కృత్రిమ మేథ వంటి సంక్లిష్ట, అధునాతన సాంకేతికతల్లో పరస్పర సహకారం, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల్లో సంస్కరణలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అమెరికా రక్షణ రంగ దిగ్గజం జనరల్ అటామిక్స్ సంస్థ నుంచి ఎంక్యూ–9బీ రకం 31 డ్రోన్లను కొనేందుకు భారత రక్షణ శాఖ పంపిన విజ్ఞప్తి లేఖకు బైడెన్ తన సమ్మతి తెలిపారు.
చదవండి: G20 Summit 2023: శిఖరాగ్ర భేటీకి శ్రీకారం
అమెరికాలోని జీఈ ఏరోస్పేస్, భారత్‌లోని హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(హాల్)లు సంయుక్తంగా జీఈ ఎఫ్–414 జెట్ ఇంజన్లను భారత్‌లోనే తయారుచేసేందుకు ఇరునేతలు అంగీకరించారు. సాంకేతికత బదలాయింపు, జెట్ ఇంజన్ల తయారీకి పచ్చజెండా ఊపారు. ‘జీ20 కూటమి అనేది ఏ విధంగా గొప్ప ఫలితాలను రాబట్టగలదన్న దానిని జీ20 సారథిగా భారత్ నిరూపించి చూపింది. సదస్సు తాలూకు ఫలితాలు మున్ముందు మరిన్ని ఉమ్మడి లక్ష్యాలను నిర్ధేశిస్తాయి’ అని బైడెన్ భారత్‌ను పొగిడారు.
స్వేచ్ఛాయుత, పారదర్శక, సమ్మిళిత ఇండో–పసిఫిక్ కోసం క్వాడ్ కూటమి అత్యవశ్యకమని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే క్వాడ్(అమెరికా, జపాన్, ఇండియా, ఆ్రస్టేలియా) చతుర్భుజ కూటమి సదస్సుకు రావాలని బైడెన్‌ను మోదీ కోరారు. ‘ స్వేచ్ఛా, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, బహుళత్వం, సమాన అవకాశాలనే విలువలు రెండు దేశాల పౌరుల విజయానికి ఎంతో కీలకం. ఈ విలువలే రెండు దేశాల మైత్రి బంధాన్ని మరింత బలోపేతం చేశాయి’ అని సంయుక్త ప్రకటనలో ఇరు దేశాలు పేర్కొన్నాయి. ‘సదస్సు తుది నిర్ణయాలు సుస్థిరాభివృద్ధి, బహుపాక్షిక సహకారం, సమ్మిళిత ఆర్థిక విధానాల్లో ఏకరూపత సాధనకు తద్వారా పెను ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు దోహదపడతాయి’ అని సంయుక్త ప్రకటన పేర్కొంది. బైడెన్‌తో చర్చలు ఫలప్రదమయ్యాయని అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
ఏఏ అంశాల్లో ఒప్పందం కుదిరిందంటే..
► ప్రపంచ వ్యాప్తంగా సెమీ కండక్టర్ల సరఫరా గొలుసు బలోపేతం
► భారత్‌లో పరిశోధనాభివృద్ధి కోసం మైక్రోచిఫ్ టెక్నాలజీ సంస్థ దాదాపు 30 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టడం
► వచ్చే ఐదేళ్లలో అధునాతన మైక్రో డివైజ్‌ల కోసం 40 కోట్ల డాలర్ల పెట్టుబడి
► భారత్ 6జీ కూటమి, నెక్ట్స్ జీ కూటమి మధ్య అవగాహన ఒప్పందం(ఎంఓయూ)
► ఇండో–పసిఫిక్‌లో స్వేచ్ఛా వాణిజ్యం, రక్షణ కోసం మరింత సహకారం
► భద్రత, టెలీ కమ్యూనికేషన్స్ రంగాల్లో సహకారం
► సాంకేతిక రంగాల్లో కలిసి పనిచేయడం
Comments
Please login to add a commentAdd a comment