AP CM YS Jagan Delhi Tour: Updates - Sakshi
Sakshi News home page

ముగిసిన ఢిల్లీ పర్యటన, ప్రధాని మోదీతో సీఎం జగన్‌ చర్చించిన కీలకాంశాలివే..

Published Wed, Jul 5 2023 10:02 AM | Last Updated on Wed, Jul 5 2023 8:23 PM

Cm Ys Jagan Delhi Tour Updates - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరోజు ఢిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న ఆయన.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో  భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన వాటాలు, పెండింగ్‌ బకాయిలతో పాటు న్యాయంగా దక్కాల్సిన సాయం గురించి ఆయన వాళ్ల దృష్టికి తీసుకెళ్లారు.  

ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో దాదాపు 1 గంటా, 20 నిమిషాలసేపు సీఎం జగన్‌ భేటీ కొనసాగింది. అంతకు ముందు దాదాపు 45 నిమిషాలసేపు హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు.  చివరగా.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.

ప్రధానితో భేటీ సందర్భంగా..  

రాష్ట్ర విభజన సహా అపరిష్కృత అంశాలపై సత్వరమే దృష్టిపెట్టాలని ప్రధాని మోదీకి సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు, కొత్త మెడికల్‌ కాలేజీలకు ఆర్థిక సహాయం తదితర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారాయన.

  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణవ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపండి. సుదీర్ఘకాలంగా ఇది పెండింగ్‌లో ఉంది. 
  • పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా తీసుకెళ్లేందుకు, తొలిదశ నిర్మాణానికి రూ.17,144 కోట్లు అవసరం అవుతుంది. ఈ అంశం కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో కూడా ఉంది. 
  • పోలవరం తొలిదశ నిర్మాణానికి, కేంద్ర ఆర్థికశాఖ ఇప్పటికే రూ.12911.15 కోట్ల మంజూరు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే తొలిదశలో భాగంగా మరో 36 గ్రామాల్లోని నిర్వాసితులకు సహాయ పునరావాసం ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది. ఇది ఇస్తేనే తొలిదశ పూర్తైనట్లు. 

మొత్తంగా పోలవరం తొలిదశ నిర్మాణానికి రూ.17144 కోట్లు ఇవ్వాలని, ఈమేరకు జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తిచేశారు సీఎం జగన్‌.  అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన సొంత నిధుల ఖర్చు రూ.1310.15 కోట్లను వెంటనే రీయింబర్స్‌ చేయాలని కోరారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడానికి పై రెండు అంశాలపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తిచేసిన సీఎం. 

  • 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరాచేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిలు అలాగే పెండింగులో ఉన్నాయి.  
  • ఏపీకి రావాల్సిన రూ.7,230.14 కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగులో ఉంది. 
  • ఏపీ జెన్‌కో ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా ఈ బకాయిలు వచ్చేలా దృష్టిపెట్టండి. 

జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత లోపించిన విషయాన్ని మరోసారి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్‌. 

  • ఏపీకన్నా ఆర్థికంగా ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాలకు జాతీయ ఆహార భద్రతాచట్టం కింద అధిక శాతం కవరేజీ ఉంది.  కానీ, పథకం అమలుకు ఎంచుకున్న ప్రమాణాల్లో హేతుబద్ధత లేదు. నీతిఆయోగ్‌ కూడా దీన్ని నిర్ధారించింది.  
  • రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్‌ దక్కకుండా పోతోంది.  దీనివల్ల  రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.5,527 కోట్ల భారం పడుతోంది. అందుకే సత్వరమే జోక్యం చేసుకోండి. 
  • ప్రతినెలా వినియోగించకుండా దాదాపు లక్ష టన్నుల బియ్యం కేంద్రం వద్ద ఉంటోంది. ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి ఇస్తే సరిపోతుంది.  

  • రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు పెండింగులో ఉన్నాయి.
  • ప్రత్యేక హోదా సహా… పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టండి. 
  • రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రత్యేక హోదా దోహదపడుతుంది. రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. ఈమేరకు సానుకూల నిర్ణయం తీసుకోండి. 

  • రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. ప్రతి జిల్లాకు కనీసంగా 18 లక్షల జనాభా ఉంది.
  • ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు గతంలో ఉన్న 11 కాలేజీలకు తోడు అదనంగా మరో 17 కాలేజీల నిర్మాణాలను చేపట్టాం. ఈ కాలేజీలకు తగిన ఆర్ధిక సహాయం చేయండి.
  • వైయస్సార్‌ కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్ర హామీ ఇచ్చింది. వెనకబడ్డ రాయలసీమ ప్రాంతంలో జీవనోపాధి మెరుగుపడ్డానికి, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరం. 
  • స్టీల్‌ప్లాంట్‌కు అత్యంత అవసరమైన ముడి ఖనిజంకోసం మూడు గనులను ఏపీ ఎండీసీకి కేటాయించేలా కేంద్ర గనులశాఖకు ఆదేశాలు ఇవ్వండి.

ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిలు రూ.1,702.90 కోట్లను మంజూరుచేయండి.  2012-13  నుంచి రూ. 2017-18 వరకూ ఇవి పెండిగులో ఉన్నాయి అని ప్రధాని మోదీకి ఏపీకి సంబంధించిన పలు అంశాలను వివరించారు సీఎం జగన్‌. 


చదవండి: మార్గదర్శిపై సీఐడీ విచారణకు రామోజీరావు, శైలజా కిరణ్ గైర్హాజరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement