
కెనడా విపక్షనేత బెర్నియర్
ఒట్టావా: ఇతర వివాదాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యోదంతాన్ని తెరపైకి తెచ్చి భారత్‌పై ఆరోపణలు చేస్తున్నారని కెనడా విపక్షనేత మాక్సిమ్ బెర్నియర్ అన్నారు. గతంలో జరిగిన తప్పిదాన్ని సరిచేసుకోవాలంటే మరణానంతరం నిజ్జర్ పౌరసత్వాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
నిజ్జర్ హత్యలో భారత రాయబారి ప్రమేయముందని ట్రూడో ఆరోపించడం, పరస్పర దౌత్యవేత్తల బహిష్కరణతో భారత్– కెనడా సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ వివాదానికి కేంద్రబిందువైన నిజ్జర్ విదేశీ ఉగ్రవాది అని, అతనికి 2007లో కెనడా పౌరసత్వం లభించిందని పీపుల్స్ పార్టీ ఆఫ్ కెనడా నేత బెర్నియర్ అన్నారు. కెనడా గడ్డపై భారత రాయబార సిబ్బంది నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారనేది నిజమైతే.. అది చాలా తీవ్రమైన విషయమని, తగుచర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
కానీ ఇప్పటిదాకా భారత్ ప్రమేయంపై ఎలాంటి ఆధారాలను ప్రభుత్వం బయటపెట్టలేదని, ఇతర వివాదాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ట్రూడో నిజ్జర్ హత్యను వాడుకుంటున్నారని సుస్పష్టంగా కనపడుతోందన్నారు. నిజ్జర్ విదేశీ ఉగ్రవాది అని, 1997 నుంచి పలుమార్లు తప్పుడు పత్రాలతో కెనడా పౌరసత్వాన్ని పొందడానికి ప్రయత్నించాడని అన్నారు. పలుమారు తిరస్కరణకు గురైనా మొత్తానికి 2007 పౌరసత్వం దక్కించుకున్నాడని తెలిపారు. నిజ్జర్ కెనడా పౌరుడు కాదని, అధికారిక తప్పిదాన్ని సరిచేసుకోవడానికి వీలుగా.. మరణానంతరం అతని పౌరసత్వాన్ని రద్దు చేయాలని బెర్నియర్ డిమాండ్ చేశారు. అతని దరఖాస్తు తిరస్కరణకు గురైన మొదటిసారే నిజ్జర్‌ను వెనక్కిపంపాల్సిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment